BigTV English

Bhogi festival Special : భోగభాగ్యాల భోగి..!

Bhogi festival Special : భోగభాగ్యాల భోగి..!

Bhogi festival Special : దేశ వ్యాప్తంగా జరిగే సంక్రాంతి వేడుకలు ప్రారంభమవుతున్నాయి. ఏటా పుష్యమాసంలోని బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగను.. దేశమంతా వేర్వేరు పేర్లతో జరుపుకుంటారు. తెలుగునేలపై 3 రోజుల పండుగగా దీనిని జరుపుకుంటారు. ఈ నాలుగు రోజుల సంక్రాంతి వేడుకల్లో తొలిరోజును భోగి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ఉదయాన్నే భోగిమంట వేయటం, పిల్లలకు భోగిపళ్లు పోయటం సంప్రదాయం.


‘భుగ్’ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే మాట వచ్చింది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని.. దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందని పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు.. శ్రీ మహా విష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు పరమేశ్వరుడు.. తన వాహనమైన నందీశ్వరుడిని.. రైతుల కోసం భూమిమీదికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని.. అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు.

భారతీయలు అనాదిగా అగ్నిని ఆరాధించేవారు. బుుగ్వేదం కూడా ‘అగ్నిమిళే పురోహితం’ అంటూ అగ్ని ఆరాధనతో వేదఘోష ప్రారంభమయింది. అసలైన భోగాన్ని కలిగించమని, అమంగళాలు తొలగించాలని అగ్నిని పూజించి, అక్కర్లేని ఆలోచనలను, రాగద్వేషాది దుర్గుణాలను కోపతాపాలను అజ్ఞానాన్ని దగ్ధం చేసుకోవడం భోగిమంట పరమార్థం. అందుకే.. ఈ రోజున ఇంట్లోని అందరూ వేకువజామునే లేచి ఇంటిముందు భోగిమంట వేస్తారు. ఆవు పిడకలు, నెయ్యి వేసి భోగిమంటలు రాజేసి, అందులో ముందే రెడీగా పెట్టుకున్న తాటి ఆకులు, కర్ర ముక్కలు, ఇంట్లో పాడైన చెక్క కుర్చీలు వగైరాలన్నీ అందులో వేస్తారు. వేకువజాము చీకటిలో, విపరీతమైన చలి వాతావరణంలో ఇరుగుపొరుగు వారితో కలిసి చలి కాచుకుంటారు.


ఇంట్లో ఉన్న పనికి రాని వస్తువులను భోగిమంటల్లో వేయటం వల్ల తమ దారిద్య్రం తొలగిపోతుందని, దక్షిణాయనకాలంలో ఎదుర్కొన్న కష్టాలకు వీడ్కోలు చెప్పి ఉత్తరాయణం శుభాలను మోసుకొస్తుందని భావిస్తారు. అలాగే.. మనసులో తపస్సు అనే యాగం చేసి, అందులో అరిషడ్వర్గాల (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు)ను వేసి దహించి, భగవంతుడిని చేరేందుకు అందరూ ప్రయత్నించాలనే ఆధ్యాత్మిక సందేశమూ భోగిమంటలో ఉంది. పనికిరాని వస్తువులు వేసి మండించే ఈ భోగిమంట మన శరీరానికి ఎంత హాయినిస్తుందో.. అవసరం లేని విషయాలను మనం వదిలించుకుంటే.. మన మనసుకూ అంతే ఆనందం కలుగుతుందనే సందేశమూ ఇందులో ఉంది.

ఒకవైపు భోగిమంటలు మండుతుంటూ.. అమ్మాయిలు ఇళ్లముందు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు. అలాగే.. హరిదాసుల ఇంటికి రాగానే ఆయనకు స్వాగతం పలికి భిక్షను అందిస్తుంటారు. ఇదే రోజున 12 ఏళ్లలోపు బాలబాలికలకు తలపై భోగి పళ్లను పోస్తారు. ఇందులో చిన్న రేగుపండ్లను వాడతారు. భోగి తర్వాతి రోజు నుంచి సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి మారతాడు. ఆ విధంగా ఆరోగ్యప్రదాత అయిన సూర్యుడు తన గతిని మార్చుకునే వేళ.. ఆయన మాదరిగా గుండ్రంగా, ఎర్రగా ఉండే రేగుపండ్లను పిల్లల మీద పోయటం ద్వారా వారికి సూర్యానుగ్రహం సిద్ధిస్తుందని నమ్మకం. అందుకే భోగి రోజు సూర్యాస్తమయం లోపలే భోగిపండ్ల వేడుకను ముగిస్తారు. రేగి పండును అర్కఫలం అనీ, సూర్యుడిని అర్కుడు అనటాన్ని బట్టి కూడా.. ఈ భోగిపండ్ల వేడుక సూర్యుని ఆరాధనలో భాగమేనని చెప్పొచ్చు.

రేగుకాయలకు బదరీఫలం అనేపేరూ ఉంది. పూర్వం నరనారాయణులు ఈ బదరికావనంలో శివుని గురించి ఘోర తపస్సు చేయగా, దేవతలు వారిపై బదరీ ఫలాలను వర్షింపజేశారట. నాటి ఘటనకు గుర్తుగా పిల్లలను నారాయణుని స్వరూపంగా భావించి, ఈ భోగిపండ్లు పోస్తారు. చిన్ని కృష్ణుని తలపించే పిల్లలకి దిష్టి తగలకుండా ఉండేందుకే ఈ భోగిపండ్లు పోస్తారనే మాట కూడా ఉంది. గోదాదేవి (ఆండాళ్‌) ‌ధనుర్మాసమంతా మార్గళీ వ్రతాన్ని ఆచరించి రంగనాథునిలో ఐక్యమైనదీ ఈ రోజే. అందుకే భోగి నాడు గోదా, రంగనాథుల కల్యాణాణ్ని జరిపిస్తారు.

పిల్లలను భోగిపండ్ల వేడుక కోసం తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ముందుగా తల్లి వారికి బొట్టు పెట్టి, ఒకసారి కుడిచేతి వైపు నుంచి తిప్పి తలమీద పోయాలి. అలాగే.. ఎడమవైపు నుంచి తిప్పి పోయాలి. ఇలా పేరంటానికి వచ్చిన అందరూ పోసిన తర్వాత పిల్లలకి హారతి ఇచ్చి, వారికి హారతి పాట పాడించి,అందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి. ఇలా పిల్లవాడి మీద నుంచి నేల మీద పడిన పండ్లను తినటం గానీ, తొక్కటం గానీ చేయకుండా, వాటిని ఏరి, వాటని సంక్రాంతి తర్వాత సోమ, బుధ, శని, ఆదివారాల్లో దూరంగా పారేస్తారు. నేల మీద పడిన నాణేలను తీసి పక్కనబెట్టి పేదలకు ఇవ్వటం సంప్రదాయం. మరికొన్ని ప్రాంతాల్లో ఆ కార్యక్రమానికి వచ్చిన పిల్లలను ఆ నాణేలను గబగబా ఏరుకోమని కూడా పెద్దలు ప్రోత్సహించే సంప్రదాయం ఉంది. ఈ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి‘ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ మాదిరి గొప్ప జ్ఞానం పొందుతారని నమ్ముతారు.

భోగిపండ్ల కోసం సిద్ధం చేసిన రేగుపండ్లలో చెరుకు గడల ముక్కలు, బంతిపూల రెమ్మలు, చిల్లర నాణేలు, నానబెట్టిన శనగలు కూడా కలుపుతారు. వీటిలో వైద్య పరిభాషలో కేలెండ్యులాగా పిలుచుకునే బంతిపూలు ఒంటికి తగిలితే, ఎలాంటి చర్మవ్యాధి అయినా నయమైపోతుందని పెద్దలు చెబుతారు. ఇప్పటిమాదిరిగా గాక.. పాతరోజుల్లో అన్నీ రాగి నాణేలుండేవని, రాగి శరీరానికి తగలటం మంచిదనే ఉద్దేశంతోనే నాణేలు భోగిపండ్లలో చేరాయనే మాట కూడా ఉంది. ఈ భోగి పండుగ రోజు తప్పకుండా పొంగలి లేదా పులగం వండుకుని తింటారు.

దక్షిణాయనం ముగిసి.. ఉత్తరాయణం ఆరంభమవుతున్న ఈ శుభ సమయంలో ఎన్నో భోగభాగ్యాలను మోసుకొచ్చే భోగిపండుగకు మనమంతా ఉత్సాహంగా స్వాగతం పలుకుదాం.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×