Tirumala break darshan: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు. రికమండేషన్ లెటర్లు చెల్లవు.. ఇక అంతా నార్మల్ దర్శనమే చేసుకోవాలి. అసలు వీఐపీ దర్శనాలు ఎందుకు రద్దయ్యాయి. ఎప్పుడు రద్దయ్యాయి. లాంటి విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకోవానికి వివిధ మార్గాలు ఉన్నాయి. ఉచిత దర్శనం నుంచి పేమెంట్ దర్శనాల వరకు ఉన్నాయి. ఉచిత దర్శనం చేసుకునే వారు కొండ కింద తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అలాగే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో ఇచ్చే టోకెన్స్ తీసుకుని దర్శనాలకు వెళ్తుంటారు. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు కూడా భూదేవి కాంప్లెక్స్ లోనే టోకెన్స్ ఇస్తుంటారు. ఇక్కడ టోకెన్స్ తీసుకుని కొండ మీదకు వెళ్లిన భక్తులకు శ్రీవారి దర్శనం త్వరగా అవుతుంది. టోకెన్స్ లేకుండా దర్శనానికి వెళ్లే భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ఇక ఇవే కాకుండా మూడు వందల రూపాయల టికెట్ దర్శనాలు, శ్రీవాణి ట్రస్ట్ డోనేషన్ దాతలకు కల్పించే వీఐపీ దర్శనాలు. ఇక ప్రజాప్రతినిధులు ఇచ్చే రికమండేషన్ లెటర్ల ద్వారా కల్పించే దర్శనాలు ఉంటాయి. అయితే రికమండేషన్ లెటర్లు తీసుకుని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 16వ తేదీన తిరుమల ఆలయంలో జరిగే కోయిల్ అళ్వార్ తిరుమంజనం, కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ నెల 15వ తారీఖున బ్రేక్ దర్శనాలకు సంబంధించిన రికమండేషన్ లెటర్లను టీటీడీ స్వీకరించదని ఆలయ అధికారులు ప్రకటించారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 02వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అయితే వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు ఆ రోజు అష్టదళ పాద పద్మారాధన సేవను కూడా టీటీడీ రద్దు చేసింది.
ఆలయ గర్భగుడి ప్రాంగణాన్ని శుద్ది చేసే కార్యక్రమాన్నే కోయిల్ అళ్వార్ తిరుమంజనం అంటారు. తమిళంలో, కోయిల్ అంటే ‘పవిత్ర పుణ్యక్షేత్రం’ అని అర్థం వస్తుంది. అలాగే ఆళ్వార్ అంటే “భక్తుడు”, తిరు అంటే “శ్రేష్ఠo”, మంజనం అంటే “స్నానం”. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గర్భగుడి మరియు ఆలయ ప్రాంగణాన్ని భక్తులు శుద్ధి చేసే కార్యక్రమం అని అర్థం వస్తుంది. ఈ శుద్ధి జరుగుతున్న సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని ఒక తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను మరియు ఇతర వస్తువులను గర్భగుడి నుండి బయటికి తెచ్చి, కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ మొదలైన వాటితో కూడిన “పరిమళం” అనే సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు.
ఈ మొత్తం కార్యాచరణ ఉదయం 6 నుండి ఉదయం 10 గంటల వరకు ఒక మహా యజ్ఞం లా జరుగుతుంది. తర్వాత ప్రధాన దేవతపై ఉన్న వస్త్రాన్ని తొలగించి, లోపల ఇతర పరివార దేవతలు, దీపం మరియు పూజ వస్తువులను మరల లోనికి తీసుకొస్తారు . అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పిస్తారు. ఈ యావత్ కార్యక్రమం ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించబడుతుంది.
ఈ కారణం చేతనే టీటీడీ సెప్టెంబర్ 16న వీఐపీ బ్రేక్ దర్శనాలను (ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా) రద్దు చేసింది. కావున సెప్టెంబర్ 15న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.