Navratri Puja Vidhi: నవరాత్రి హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన పండగలలో ఒకటి. తొమ్మిది రాత్రులు, పది పగళ్లు జరుపుకునే ఈ పండగ దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. నవరాత్రుల్లో ప్రతి రోజు ఒక దేవతకు అంకితం చేయబడింది. దేవి ..ప్రతి రూపానికి దాని స్వంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, శక్తి ఉంటుంది. ఈ పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల పండగకు సంబంధించిన పూజా విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
నవరాత్రి పూజకు అవసరమైన సామాగ్రి:
ప్రధాన వస్తువులు: దుర్గాదేవి లేదా దుర్గమ్మ అమ్మవారి విగ్రహం/పటం, ఎర్రటి క్లాత్, కలశం (మట్టి లేదా రాగి పాత్ర), కొబ్బరికాయ, ఐదు మామిడి ఆకులు, కలశంలో పోయడానికి పవిత్రమైన నీరు, పసుపు, కుంకుమ, గంధం.
పూజ సామాగ్రి: పూలు (ఎరుపు గులాబీలు, మందార పూలు), అక్షింతలు (పసుపు కలిపిన బియ్యం), అగరబత్తీలు, దీపాలు, నూనె/నెయ్యి, ప్రసాదం (బెల్లం లేదా నైవేద్యం), కర్పూరం.
నైవేద్యం: ప్రతి రోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయాలి. ఉదాహరణకు.. మొదటి రోజు శైలపుత్రికి పాయసం లేదా హల్వా సమర్పించాలి.
పూజా విధానం:
1. కలశ స్థాపన:
నవరాత్రి పూజలో కలశ స్థాపన చాలా ముఖ్యమైనది. ఇది పూజకు శుభ సూచకం. ఇంట్లోని ఒక పవిత్రమైన ప్రదేశంలో ఎర్రటి వస్త్రాన్ని పరచి, దానిపై బియ్యం లేదా గోధుమలను పోసి, దాని మధ్యలో కలశాన్ని ఉంచాలి. తర్వాత కలశంలో పవిత్రమైన నీటిని నింపి, కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక రూపాయి నాణెం, గంధం వేయాలి. అనంతరం కలశం చుట్టూ మామిడి ఆకులను పెట్టి.. దానిపై కొబ్బరికాయను ఉంచాలి. కొబ్బరికాయను ఎరుపు రంగు క్లాత్ లో చుట్టి, పూలతో అలంకరించాలి. ఇది పూర్తి అయ్యాక, కలశం పక్కన దుర్గాదేవి విగ్రహం లేదా పటాన్ని ఉంచాలి.
2. రోజువారీ పూజ:
ప్రారంభం: మొదటగా.. పూజ చేసేవారు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఆ తర్వాత దీపాలు వెలిగించి, అగరబత్తీలు వెలిగించాలి.
దేవికి ఆహ్వానం: ‘ఓం దుర్గాయై నమః’ లేదా ఇతర దుర్గా మంత్రాలను పఠిస్తూ దేవిని పూజకు ఆహ్వానించాలి.
మంత్ర పఠనం: ప్రతి రోజు ఆ రోజుకు అంకితమైన దేవి రూపం మంత్రాన్ని 108 సార్లు జపించడం మంచిది. ఉదాహరణకు.. మొదటి రోజు ‘ఓం శైలపుత్ర్యై నమః’ అని జపించాలి.
పువ్వులు, అక్షింతలు, నైవేద్యం: దేవి విగ్రహానికి లేదా పటానికి పువ్వులు, అక్షింతలు సమర్పించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి, హారతి ఇవ్వాలి.కథా శ్రవణం, ప్రార్థన: ప్రతి రోజు పూజ తర్వాత ఆ రోజు దేవత కథ లేదా దుర్గా సప్తశతిలోని ఒక భాగాన్ని చదవడం లేదా వినడం మంచిది. ఆ తర్వాత కోరికలు, ప్రార్థనలను దేవికి నివేదించాలి.
3. అష్టమి లేదా నవమి పూజ (కన్యా పూజ):
నవరాత్రి పూజ ముగింపులో అష్టమి లేదా నవమి రోజున బాలికలను పూజిస్తారు. ఇది దుర్గాదేవికి గౌరవ సూచకం. 9 ఏళ్లలోపు బాలికలను ఇంటికి ఆహ్వానించి.. వారిని దేవి రూపంగా భావించి పాదాలు కడిగి, కొత్త దుస్తులు, పూలు సమర్పించాలి. వారికి రుచికరమైన భోజనం లేదా ప్రసాదం పెట్టి, వారికి దానాలు ఇవ్వాలి. ఇది దేవిని సంతృప్తిపరుస్తుంది అని నమ్ముతారు.
4. దశమి (విజయదశమి):
నవరాత్రి చివరి రోజు.. విజయదశమి నాడు, పూజను ముగిస్తారు. కలశాన్ని పూజించి, దానిలోని నీటిని ఇల్లంతా చల్లాలి.
కలశంలో ఉన్న కొబ్బరికాయను దేవత ముందు కొట్టి కుటుంబ సభ్యులు పంచుకుని తినాలి.
ఈ పూజను శ్రద్ధగా.. భక్తితో చేయడం వల్ల దేవి ఆశీర్వాదాలు లభించి, జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి.