భారత ప్రభుత్వం మేకిన్ ఇండియాను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన పథకం PLI. ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ ద్వారా భారత్ లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుంది. భారత కంపెనీలకు, భారత్ లో తమ తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే విదేశీ కంపెనీలకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. 2020లో ఈ పథకం అమలులోకి రాగా మొదట్లో మొబైల్ ఫోన్ల తయారీ, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, ఫార్మాసుటికల్ రంగాలకు దీన్ని అమలు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాలకు దీన్ని విస్తరించారు. తాజాగా వైట్ గుడ్స్ గా పిలువబడే ఎయిర్ కండిషన్లు, LED లైట్ల తయారీ కంపెనీలకు మరోసారి ఈ పథకాన్ని ప్రకటించారు.
30రోజుల విండో పీరియడ్..
సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 14 వరకు ACలు, LED లైట్ల తయారీ కంపెనీలనుంచి PLI స్కీమ్ లో చేరేందుకు దరఖాస్తులు స్వీకరిస్తామని కేంద్రం ప్రకటించింది. కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారు, ఇప్పటికే ఈ రంగంలో ఉన్నవారు కూడా దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. 30 రోజుల విండో సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 14 వరకు అమలులో ఉంటుందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ రౌండ్‌లో విజయవంతమైన దరఖాస్తుదారులు పథకం యొక్క మిగిలిన వ్యవధికి ప్రోత్సాహకాలు అందుకునేందుకు అర్హులు అవుతారు. గతంలో వైట్ గుడ్స్ కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించగా, మరోసారి 30 రోజుల విండో పీరియడ్ ని కేంద్రం ప్రకటించడం విశేషం.
ఇప్పటి వరకు 83 కంపెనీలు..
ఏసీలు, ఎల్ఈడీ లైట్ల తయారీకి సంబంధించి ఇప్పటికే 83 కంపెనీలు పీఎల్ఐ పథకంలో దరఖాస్తు చేసుకున్నాయి. వీటి విలువ దాదాపు రూ. 10,406 కోట్లు. ఇప్పుడు మరికొన్ని కంపెనీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది. PLI పథకంలో చేరిన వివిధ కంపెనీలు తమ ఉత్పత్తుల్ని గణనీయంగా పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఉత్పత్తి పెరిగితే దానివల్ల దేశానికి రాబడి పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కంపెనీకి లాభాలు రావడంతోపాటు దేశానికి కూడా లాభం చేకూరుతుంది. అందుకే కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ కంపెనీల వృద్ధికి దోహదపడుతోంది. వివిధ రంగాలకు ఈ పథకాన్ని విస్తరిస్తోంది. మేకిన్ ఇండియాను హైలైట్ చేసేందుకే ఈ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్రం. స్వదేశీ కంపెనీలతోపాటు, మన దేశంలో తయారీ యూనిట్లు ప్రారంభించే ఇతర దేశ కంపెనీలకు కూడా ఇది ఉపయోగకరం.
భారత్ లో తయారీని పెంచేందుకు, దేశీయంగా, విదేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు, భారత్ నుంచి ఎగుమతులను పెంచేందుకు, సుస్థిరాభివృద్ధిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ ఎకనమిక్ చైన్ ని అనుసంధానించేందుకు ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని కేంద్రం అమలులోకి తెచ్చింది. అయితే దీని ద్వారా అనుకున్న ఫలితాలను సాధించారని చెప్పలేం. అయితే మేకిన్ ఇండియా దిశగా ఈ పథకం పలు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ కంపెనీల ఉత్పత్తి పెరగడానికి సహాయపడుతోంది. కంపెనీల ఉత్పత్తి పెరిగితే దానికి లభించే ప్రోత్సాహకాలు కూడా పెరుగుతాయి. ఏడాదికేడాది కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటూ, వాటిని అందుకుంటూ.. దేశాభివృద్ధికి దోహదపడే కంపెనీలకు కేంద్రం నుంచి ప్రోత్సాహకం రూపంలో సాయం అందుతుంది. తద్వారా అవి మరింత అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం దోహదపడుతుంది.