Navratri 2025: ఆది శక్తిని ఆరాధించే పండుగే నవరాత్రి. తొమ్మిది రాత్రులు, పది రోజులు భక్తులు శక్తిస్వరూపిణిని ఆరాధిస్తూ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. భూలోకంలో ధర్మం స్థాపన కోసం దుర్గామాత అవతరించి, దుష్టరాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ఆ గాథే నవరాత్రి వెనుక ఉన్న అసలు మూలం. ఈ పవిత్ర ఉత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం కలగలిపిన వేడుక. నరకాశురి వధ ఎందుకు జరిగింది…? ఆదిశక్తి అవతారం ఎలా అయ్యింది…? ఇప్పుడు చూద్దాం.
బ్రహ్మదేవుని వర ప్రభావం
ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుని అనుగ్రహం పొందాడు. దేవతల చేతగానీ, దానవుల చేతగానీ తాను చంపబడకూడదని వరం కోరుకున్నాడు. దీంతో అతనికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటూ వరం ప్రసాదించాడు. ఆ వరం మహిషాసురుడి అహంకారానికి బలం ఇచ్చింది. స్వర్గాన్ని ఆక్రమించి, దేవతలను ఓడించి, ఇంద్రస్థానాన్ని సైతం స్వాధీనం చేసుకున్నాడు. భూలోకంలోనూ, పాతాళంలోనూ అతని దాడులు పెరిగి సమస్త లోకాలూ భయబ్రాంతులకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నిస్సహాయ స్థితిలో దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించారు.
దుర్గాదేవి అవతారం
మహిషాసురుడు చేస్తున్న దాడులు సహించలేక పోతున్నాం. ఇలాగే కొనసాగితే సృష్టి అనేది అంతరించిపోతుంది అంటూ దేవతలు వేడుకున్నారు. దీంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురు త్రిమూర్తుల శక్తులు, దేవతల ఆయుధాలు ఏకమై ఓ మహాదేవిని సృష్టించాయి. ఆమెనే జగజ్జననీ, ఆదిశక్తి, దుర్గామాత. సింహవాహనంపై కూర్చుని, పది చేతుల్లో పది ఆయుధాలతో కాంతిమయంగా వెలసి యుద్ధానికి సిద్ధమయ్యింది.
మహా సంగ్రామం
మహిషాసురుడు ఎద్దుగా, సింహమై, రాక్షసుడిగా రూపాలు మారుస్తూ భీకర యుద్ధం సాగించాడు. భూమి కంపించేలా, సముద్రాలు ఉప్పొంగేలాగా ఆ సంగ్రామం కొనసాగింది. ఆకాశంలో దేవతలు ఉలిక్కిపడుతూ, భూమిపై భక్తులు భయాందోళనకు గురయ్యారు. మాత శక్తివంతమైన ఆయుధాలతో ఒకొక్క రూపాన్ని ధ్వంసం చేస్తూ ముందుకు సాగింది. చివరికి తొమ్మిదవ రోజు, త్రిశూలంతో మహిషాసురుని సంహరించింది.
Also Read: Delhi Accident: ఫ్లైఓవర్ పై నుంచి రైల్వే ట్రాక్ పైకి ఎగిరిపడ్డ కారు.. ఆ తర్వాత షాకింగ్ సీన్
తొమ్మిది రూపాల ఆరాధన
ఆ విజయాన్ని గుర్తు చేసుకుంటూ నవరాత్రి జరుపుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల ఆరాధన చేస్తారు
* శైలపుత్రి – పర్వతపుత్రిక, స్థిరత్వం, ధైర్యానికి ప్రతీక.
* బ్రహ్మచారిణి – తపస్సు, క్రమశిక్షణకు సంకేతం.
* చండఘంట – ధైర్యం, రక్షణ, అపరాజిత శక్తి.
* కూష్మాండ – సృష్టి శక్తి, విశ్వాన్ని వెలిగించే ఆది శక్తి.
* స్కందమాత – సంతాన సమృద్ధి, తల్లితనానికి ప్రతీక.
* కాత్యాయనీ – ధర్మరక్షక, దుష్ట సంహారిణి.
* కాలరాత్రి – అంధకారాన్ని తొలగించే ఉగ్రశక్తి.
* మహాగౌరీ – పవిత్రత, కరుణ, శాంతి.
* సిద్ధిదాత్రి – సంపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించే శక్తి.
* విజయదశమి – ధర్మానికి జయభేరి
దశమి రోజున మహిషాసురుని సంహారం ఘట్టాన్ని స్మరించుకుంటూ విజయదశమి పండుగను జరుపుకుంటారు. అధర్మం ఎంతటి బలమైనా, దుష్టశక్తులు ఎంతటి ప్రభావశీలమైనా, చివరికి గెలుపు సత్యానిదే, విజయం ధర్మానిదే అని నవరాత్రి పండుగ మనకు అందించే సందేశం.
పండుగలో ఆధ్యాత్మికత.. సాంస్కృతిక వైభవం
నవరాత్రి సమయంలో భక్తులు ఉపవాసం, జపం, దీపారాధన, హోమం వంటి ఆచారాలను నిర్వహిస్తారు. ప్రతి రోజు భక్తి మరియు శక్తి ఆరాధన తో నిండిన విధంగా, విభిన్న పద్ధతులలో పూజలు జరుగుతాయి. బొమ్మల కొలువు, బొమ్మల ప్రదర్శనలు, రామలీల, దసరా శోభాయాత్రలు ఈ పండుగలో సాంస్కృతిక వైభవాన్ని, గ్రామీణ, నగర జీవన శైలీ ప్రతిబింబించే సంప్రదాయాన్ని ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మహిళలు ఒకరినొకరు దుర్గాదేవి స్వరూపమనే భావనతో పసుపు, కుంకుమలతో ఆహ్వానిస్తూ, గౌరవాన్ని, స్నేహాన్ని, ఐక్యతను ప్రదర్శిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఆచారాలు, పూజలు, సంగీతం, నాటకాలు, కళారూపాల కలయికతో నవరాత్రి పండుగ ఆధ్యాత్మికతతో పాటు సాంస్కృతిక వైభవాన్ని కూడా పరిపూర్ణం చేస్తుంది.