Navratri: నవరాత్రి అనేది మన దేశంలో అత్యంత ప్రసిద్ధమైన, పవిత్రమైన హిందూ పండుగలలో ఒకటి. ‘నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు. ఇది తొమ్మిది రాత్రులు, పది పగళ్లు జరుపుకునే పండుగ. ఈ పండుగ సమయంలో శక్తి స్వరూపిణి అయిన దుర్గా దేవిని పూజిస్తుంటాం. నవ రాత్రులు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తాయి.
ఇదిలా ఉంటే.. దేవీ నవ రాత్రులను మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సంప్రదాయాలతో, ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం శరదృతువులో వచ్చే ఈ పండుగ సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో వస్తుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. ప్రతి రూపానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత, కథనాలు ఉన్నాయి.
తొమ్మిది రోజులలో.. దేవి రూపాలు:
నవ రాత్రుల సమయంలో దేవత ఈ 9 రూపాలను పూజిస్తారు.
రోజు – 1 : బాలా త్రిపుర సుందరీ దేవి. ఈ రూపం ధైర్యాన్ని సూచిస్తుంది.
రోజు – 2: గాయత్రీ దేవి. ఈ రూపం తపస్సుకు, నిగ్రహానికి ప్రతీక.
రోజు- 3 అన్నపూర్ణ దేవి: ఈ రూపం ప్రశాంతతకు, శాంతికి నిదర్శనం.
రోజు- 4 కాత్యాయని దేవి: ఈ రూపం సృష్టి కర్త అయిన దేవికి నిదర్శనం.
రోజు -5 మహాలక్ష్మీ దేవి: కార్తికేయుని తల్లి, మాతృత్వానికి ప్రతీక.
రోజు- 6 లలితా త్రిపుర సుందరీ దేవి: వీరత్వం,శక్తికి సూచిక.
రోజు- 7 మహా చండీ: చెడును నాశనం చేసే ఉగ్రరూపం.
రోజు- 8 సరస్వతి దేవి: అందం, స్వచ్ఛత, శాంతికి ప్రతీక.
రోజు- 9 దుర్గా దేవి: శత్రు సంహారం, చెడుపై మంచికి నిదర్శనం
నవరాత్రి ప్రాముఖ్యత:
నవరాత్రి పండుగ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాన్ని రక్షించిన విజయానికి ప్రతీక. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవి శక్తిని ,స్త్రీ శక్తిని ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి. ఈ పండుగ దుష్టశక్తులపై, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి గుర్తుగా నిలుస్తుంది.
పూజ, ఆచారాలు:
నవరాత్రి సమయంలో.. భక్తులు ఉపవాసం ఉంటారు. దుర్గాదేవికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహిస్తారు. అనేక ప్రాంతాల్లో ‘గర్బా’ ‘దాండియా రాస్’ వంటి సంప్రదాయ నృత్యాలు కూడా చేస్తారు. ఇది పండుగకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ తొమ్మిది రోజులు దుర్గా మాత విగ్రహాలను అందంగా అలంకరించి పూజలు చేస్తారు.
Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా.. ఈ పనులు చేయకండి
దశమి (విజయదశమి):
తొమ్మిది రోజుల పండుగ ముగింపు రోజును విజయదశమి లేదా దసరా అని అంటారు. ఈ రోజున దుర్గాదేవి మహిషాసురుడిపై విజయం సాధించిన సందర్భాన్ని జరుపుకుంటారు. ఈ పండుగ దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రామలీల, రావణ సంహారం వంటి కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుంటారు.
నవ రాత్రి పండుగ ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల కలయిక. ఇది కేవలం మత పరమైన పండుగ మాత్రమే కాదు.. సమాజంలో ఐక్యత, స్నేహాన్ని పెంచే ఒక వేదిక కూడా. ఈ పండుగలో పాల్గొనడం వల్ల ఒక గొప్ప శక్తిని, ఆనందాన్ని అనుభూతి చెందుతారు.