7 Rivers: ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం. అదే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరాలయం.
సంగమేశ్వర ఆలయం కర్నూల్ జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో ఉంది. సప్తనదీ సంగమంగా పిలువబడే ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం.. సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధికెక్కింది.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.
ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా… అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.
అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం మిస్టరీగా మిగిలిపోయింది.
ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు.
కర్నూలు నుంచి 55 కిలోమీటర్లు, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరుకోవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న ‘మచ్చుమర్రి’ గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరుకోవచ్చు. స్వంత వాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు.
ఇక తెలంగాణ నుంచి వచ్చే భక్తులు నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ కు చేరుకుని అక్కడి నుంచి సోమశిలకు అక్కడి నుంచి బోటులో సంగమేశ్వరానికి చేరుకోవచ్చు. కొల్లాపూర్ వరకు ఆర్టీసీ బస్సులు ఉంటాయి. కొల్లాపూర్ నుంచి సోమశిలకు మాత్రం ప్రైవేటు ఆటోల ద్వారా చేసుకోవాలి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.