Bhadrachalam Temple: భద్రాచలంలో రాములవారి ఆలయం గురించి ఎవ్వరికీ తెలియని రహస్య విషయాలు ఏంటో తెలుసా..? స్వామి వారి విగ్రహం నుంచి గోదావరి పరివాహక ప్రాంతం వరకు ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే వాటి ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు ఈ కథనంలో మనం తెలుసుకుందాం.
శ్రీరామ క్షేత్రమైన భద్రాచలం గురించి మనకు తెలిసిన విషయాల కంటే, తెలియని ఆధ్యాత్మిక మరియు చారిత్రక రహస్యాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. భద్రాచలంలో ఆలాంటి రహస్య ఆధ్యాత్మిక విషయాలకు కొదవలేదని అంటుంటారు. అయితే అలాంటి వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాముల వారి విగ్రహం – ఒక అరుదైన రూపం: సాధారణంగా ఏ రామాలయంలోనైనా శ్రీరాముడు కోదండధారిగా (విల్లు పట్టుకుని) కనిపిస్తాడు. కానీ భద్రాచలంలో రామచంద్రమూర్తి చతుర్భుజాలతో (నాలుగు చేతులతో) దర్శనమిస్తారు. పై రెండు చేతుల్లో శంఖు, చక్రాలు.. కింద రెండు చేతుల్లో ధనుర్భాణాలు ధరించి ఉంటారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది వైకుంఠ రాముని రూపం.
సీతమ్మ వారు స్వామివారి తొడపై కూర్చుని ఉండటం: భద్రాచల రాములోరి గుడిలో మరో విశేషం ఏమిటంటే సీతమ్మ వారు స్వామివారి ఎడమ తొడపై కూర్చుని ఉంటారు. సాధారణంగా ఇతర ఆలయాల్లో సీతమ్మ వారు స్వామివారి పక్కన నిలబడి ఉంటారు. దీనిని ఆలింగన మూర్తి అని కూడా అంటారు.
గోదావరి తీరంలో మారుతున్న నీటి మట్టం: భద్రాచలం వద్ద గోదావరి నది ఒక ప్రత్యేకమైన మలుపు తిరుగుతుంది. పురాణాల ప్రకారం, భద్రుడి కోరిక మేరకు రాముడు ఇక్కడ కొలువుదీరడంతో గోదావరి నది స్వామివారి పాదాలను తాకాలని తహతహలాడుతూ ప్రవహిస్తుందని నమ్ముతారు. అందుకే వరదల సమయంలో కూడా ఆలయ మెట్ల వరకు నీరు రావడం ఒక విశేషంగా చూస్తారు.
రామదాసు చేయించిన ఆభరణాలు: భక్త రామదాసు (కంచెర్ల గోపన్న) స్వామివారికి చేయించిన ఆభరణాలు ఇప్పటికీ భద్రాచలంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అత్యంత ప్రసిద్దమైనది చింతాకు పతకం. అలాగే రామదాసు స్వయంగా ఆ అభరణాల తయారీని పర్యవేక్షించారని చరిత్ర చెబుతుంది. వీటిని నేటికీ ప్రత్యేక పర్వదినాల్లో స్వామి వారికి అలంకరిస్తారట.
ప్రసాదానికి ఒక ప్రత్యేకత: భద్రాచలంలో ఇచ్చే చక్కెర పొంగలి, లడ్డు ప్రసాదానికి ఒక విశిష్టమైన రుచి ఉంటుంది. ఇక్కడ వాడే బియ్యం, నెయ్యి తయారీలో కొన్ని పాత పద్ధతులను పాటిస్తారు, ఇది స్వామివారికి ఎంతో ప్రీతికరమని భక్తుల నమ్మకం.
శ్రీరామ నవమి – ముత్యాల తలంబ్రాలు: భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఒక ఆచారం. భక్తులు కూడా కోటి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. ఈ సాంప్రదాయం తానీషా కాలం నుండి కొనసాగుతుండటం ఒక చారిత్రక విశేషం. అలాగే భక్తులు చేతులతో స్వయంగా వలిచిన బియ్యాన్ని స్వామి వారి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.