Shivling at home: ఇంట్లో శివలింగం ఉంటే అదృష్టమా..? అరిష్టమా..? శివలింగం ఉంచుకోవడం వల్ల కలిగే ఫలితాలేంటి…? ఒకవేళ శివలింగం ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తే ఎలా పెట్టుకోవాలి. అందుకు ఉండే నియమాలేంటి..? శివలింగం ఇంట్లో పెట్టుకోవడంలో ఉన్న అన్ని వివరాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంట్లో శివలింగాన్ని ఉంచుకోవడం గురించి శాస్త్రాలలో మరియు పురాణాలలో స్పష్టమైన నియమాలు ఉన్నాయట. శివలింగం సాక్షాత్తు పరమశివుని స్వరూపం కాబట్టి, దానిని ఇంట్లో పెట్టుకోవడం అరిష్టం ఎంత మాత్రం కాదట. నిజానికి, భక్తితో కొలిస్తే అది అపారమైన అదృష్టాన్ని, శాంతిని ప్రసాదిస్తుందట. అయితే ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించడం తప్పనిసరట. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శివలింగం పరిమాణం (Size): ఇంట్లో పూజించే శివలింగం చాలా పెద్దదిగా ఉండకూడదట. సాధారణంగా మన బొటనవేలు పొడవు (సుమారు 2 నుండి 3 అంగుళాలు) కంటే ఎక్కువ ఉండకూడదని శాస్త్రం చెబుతోందట. అతి పెద్ద లింగాలు దేవాలయాలలోనే ఉండాలట. మన బొటనవేలు సైజు శివలింగం ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభాలు కలుగుతాయట.
నిత్య పూజ మరియు అభిషేకం: శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు దానికి నిత్యం అభిషేకం జరగాలట. శివుడు అభిషేక ప్రియుడు. కనీసం చిన్న గ్లాసు నీటితోనైనా ప్రతిరోజూ అభిషేకం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి (Positive Energy) పెరుగుతుందట. ఒకవేళ మీరు ఊరెళ్లాల్సి వచ్చి పూజ ఆగిపోయే పరిస్థితి ఉంటే లింగాన్ని నీటిలో ఉంచి వెళ్లడం లేదా శుద్ధి చేసి భద్రపరచడం చేయాలట.
పవిత్రత మరియు క్రమశిక్షణ: శివలింగం ఉన్న చోట శుచి, శుభ్రత చాలా ముఖ్యంమట లింగాన్ని ఎప్పుడూ ఒంటరిగా ఉంచకూడదు (అంటే కేవలం లింగం మాత్రమే కాకుండా పక్కన పార్వతీ దేవి ఫోటో లేదా వినాయకుని విగ్రహం ఉండటం మంచిదట). లింగానికి నైవేద్యం సమర్పించడం, ధూపదీపాలు చూపడం తప్పనిసరిగా చేయాలట.
అదృష్టమా లేక అరిష్టమా?: నియమబద్ధంగా పూజిస్తే శివలింగం అదృష్టదాయకమే అంటున్నారు పండితులు. శివలింగాన్ని ఇంట్లో పూజించడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుందట. నిత్య పూజ చేయడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందట. ధ్యానం చేసే వారికి శివలింగం ఒక గొప్ప శక్తి కేంద్రంగా పనిచేస్తుందట. అయితే శివలింగాన్ని కేవలం అలంకరణ వస్తువుగా భావించి పవిత్రత లేకుండా ఎక్కడపడితే అక్కడ ఉంచితే అది ప్రతికూలతను తెచ్చే అవకాశం ఉంటుందట.
ముఖ్యమైన సూచనలు: నర్మదా నది శివలింగాలు (బాణలింగాలు) ఇంట్లో పెట్టుకోవడం అత్యంత శ్రేయస్కరమట. వీటికి ప్రాణప్రతిష్ట అవసరం లేదట. ఇక శివలింగం యొక్క పానవట్టం (నీరు వెళ్లే మార్గం) ఎప్పుడూ ఉత్తరం వైపు ఉండాలట. శివలింగం ఇంట్లో ఉండటం శుభసూచకం. అయితే, మీ జీవనశైలి మరియు సమయం నిత్య పూజకు సహకరిస్తుందో లేదో ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమమని… నిత్యం భక్తితో ఒక్క లోటా నీరు సమర్పించినా ఆ భోళాశంకరుడు సంతోషిస్తాడని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.