Lord Venkateshwara: సాక్ష్యాత్తు వెంకటేశ్వర స్వామే దివి నుంచి భువికి దిగివచ్చి ఒక ముస్లీం భక్తుడి కోరిక నెరవేర్చిన సంఘటన తిరుమల చరిత్రలో జరిగిందట. స్వామి వారి ఆశీస్సులతోనే ఆ భక్తుల మూడు తరాల కోరిక నెరవేరిందట. వాళ్ల కోరిక మేరకే ఇప్పటికీ స్వామి వారికి అర్జితసేవ జరుగుతుందట. ఇంతకీ ఆ భక్తులు ఎవరు..? వారి స్వామి వారికి కోరిన కోరికలేంటి..? ఇప్పటికీ జరుగుతున్న ఆ అర్జిత సేవ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలు అన్ని ఇన్నీ కాదు. భక్తుల కొంగుబంగారమైన స్వామి కోరిన కోర్కెలు తీర్చే ఆపదమొక్కుల వాడిగా భక్తులకు నమ్మకాన్ని ఇచ్చాడు. అలాంటి శ్రీవారు.. ఒక ముస్లీం భక్తుడి కుటుంబం కోరుకున్న కోరికను నెరవేర్చారట. అదే కాకుండా వారిచ్చిన కానుకలతో ఇప్పటికీ ఒక అర్జిత సేవ జరుగుతుందట. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఆ భక్తుడెవరో తెలుసుకోవాలి.
సరిగ్గా నలభై రెండేళ్ల క్రితం టీటీడీ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోనుందని అందుకోసం ఆ స్వర్ణోత్సవ వేడుకలు చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలని టీటీడీ బోర్డు మెంబర్స్ మొత్తం మీటింగ్ పెట్టుకుని చర్చిస్తున్నారట. అయితే ఎంత ఆలోచించినా ఎవ్వరికీ కూడా అలా గుర్తుండిపోయే విషయం ఏదీ గుర్తుకు రాక తలలు పట్టుకుని కూర్చున్నారట. అప్పుడే ఒకాయన వచ్చి తన పేరు షేక్ మస్తాన్ అని తాను టీటీడీ ఈవో గారిని కలవాలని చెప్పడంతో ఈవో గారు ముస్లీం భక్తుడేంటి తనను కలవడం ఏంటి..? అనుకుని ఆశ్యర్యంగా ఆయనను మీటింగ్ హాల్లోకే పిలిపించుకున్నారట.
అక్కడికి వచ్చిన షేక్ మస్తాన్ తమది గుంటూరు అని చెప్పి తమ తాతలు తండ్రులు స్వామి వారి భక్తులు అని ఇప్పటికీ తమ ఇంట్లో ఉదయం వెంకటేశ్వరస్వామికి పూజ చేసుకున్నాకే పనులు మొదలుపెడతామని ఇది తరతరాలుగా తమ ఇంట్లో వస్తున్న ఆచారం అని చెప్పాడట. ఆయన మాటలకు ఆశ్యర్యంగా వింటున్న అధికారులు ఆయన విషయం చెప్పడం లేదని ఆసహన పడుతుంటే.. ఆయన అసలు విషయం చెప్పారట. తమ తాత స్వామి వారికి 108 బంగారు కలువపూలు చేయిస్తానని మొక్కుకున్నారట. సగం పూలు చేయించాక ఆయన మరణించారని దీంతో తాత గారి మొక్కుబడిని పూర్తి చేసేందుకు మస్తాన్ వాళ్ల నాన్న కొన్ని పూలు చేయించాక ఆయన చనిపోయారట. వారిద్దరి కలను పూర్తి చేసేందుకు షేక్ మస్తాన్ కూడా మిగిలిన బంగారు కలువ పూలు రెడీ చేయించాడని.. వాటి బరువు ఒక్కోక్కటి 23 గ్రాములు ఉన్నాయని వాటిని స్వామి వారికి సమర్పించడానికి తాము కుటుంబంతో వచ్చామని చెప్పారట.
షేక్ మస్తాన్ మాటలకు కొద్ది సేపు షాకింగ్ లో ఉన్న అధికారులు తేరుకుని ఆయన తెచ్చిన బంగారు పూలు పరిశీలించి ఆయనను సాదరంగా గౌరవించి త్వరలోనే స్వామి వారికి వీటిని సమర్పిస్తామని అప్పుడు మళ్లీ మీకు కబురు పెడతామని ఆయన ఫోన్ నెంబర్, అడ్రస్ తీసుకుని పంపిచేశారట.
ఆ తరువాత పనులన్నీ చకచకా జరిగిపొయి.. ఇంకో రెండు మూడు మీటింగుల తర్వాత చివరికి శ్రీ వారికి ఒక కొత్త అర్జిత సేవను ప్రవేశ పెట్టాలని TTD బోర్డు ఏకగ్రీవంగా తీర్మానించింది..ఆ సేవలో భాగంగా స్వామి వారికి వారానికొకసారి అష్టోత్తర శతనామ పూజ జరపాలని ఆ పూజలో స్వామి వారి 108 పేర్లను ఒక్కొక్కటిగా పటిస్తూ షేక్ మస్తాన్ కుటుంబం సమర్పించిన ఒక్కొక్క బంగారు తామర పూవును పూజారులు స్వామి వారి పాదాల మీద ఉంచాలని.. TTD ఈ ఆర్జిత సేవను 1984 లో స్వామి వారికి తమ స్వర్ణోత్సవ కానుకగా ప్రవేశ పెట్టింది.
శ్రీ వారి పట్ల షేక్ మస్తాన్ కుటుంబానికున్న గొప్ప భక్తి వలన స్వామి వారికి ఒక కొత్త ఆర్జిత సేవ ప్రారంభం అవటమే కాకుండా అదే కుటుంబం వలన TTD బోర్డుకి కూడా తమ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరుపుకొనే ఒక గొప్ప సదవకాశం లభించింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి మంగళవారం స్వామి వారికి జరపబడే ఈ సేవలో ఇప్పటికీ షేక్ మస్తాన్ కుటుంబం ఇచ్చిన బంగారు తామర పూలనే వాడతారు.. కాలక్రమేణా ఈ సేవ భక్తుల్లో ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది..మొదట్లో ఈ సేవను “అష్టదళ స్వర్ణ పద్మ పూజ” అని పిలిచినా ఇప్పుడది “అష్టదళ పాద పద్మారాధన సేవ” గా మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.