Garuda Purana: నరకంలో విధించే భయంకరమైన 21 రకాల శిక్షల గురించి గరుడపురాణం ఏం చెప్తుందో తెలుసా..? ఏ పాపం చేస్తే ఎలాంటి శిక్ష విధిస్తారో తెలుసా..? యమధర్మరాజుకు వేసే శిక్షల గురించి గరుడపురాణంలో ఉన్న పూర్తి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం ముఖ్యంగా శ్రీమద్భాగవతం, గరుడ పురాణం ప్రకారం మనుషులు చేసే పాపాలను బట్టి యమధర్మరాజు 21 రకాలైన భయంకరమైన శిక్షలు విధిస్తాడట. అయితే ఆ శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తామిస్రం: పరాయివాళ్ల భార్యలను లేదా పిల్లలను అపహరించేవారిని ఇక్కడ ఉంచుతారు. యమదూతలు వారిని చీకటి గదుల్లో వేసి, స్పృహ కోల్పోయేలా కొడతారట.
అంధ తామిస్రం: మోసపూరితంగా ఇతరులను ఇబ్బంది పెట్టేవారికి ఈ శిక్ష పడుతుందట. ఇక్కడ పాపాత్ముడి కళ్లను పెరికివేసి, తీవ్రమైన బాధకు గురిచేస్తారట.
రౌరవం: కేవలం తమ స్వార్థం కోసం ప్రాణులను హింసించేవారికి ఈ శిక్ష విధిస్తారట. ‘రురు’ అనే క్రూర మృగాలు వారిని పీక్కు తినేలా చేస్తారట.
మహారౌరవం: ప్రాణులను చంపి తినే వారికి ఈ శిక్ష పడుతుందట. రౌరవం కంటే ఇది మరెంతో భయంకరంగా ఉంటుందట.
కుంభీపాకం: వండుకుని తినడం కోసం పక్షులను, జంతువులను చంపేవారికి ఈ శిక్ష వేస్తారట. ఈ శిక్షలో భాగంగా మరుగుతున్న నూనె బాణలిలో వేయిస్తారట.
అసిపత్రవనం: దైవ దూషణ చేసేవారు, ధర్మాన్ని తప్పేవారికి ఈ శిక్ష విధిస్తారట. పదునైన కత్తుల్లాంటి ఆకులు ఉన్న అడవిలో వారిని నడిపిస్తారట.
కాలసూత్రం: పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించని వారికి ఈ శిక్ష ఉంటుందట. మండుతున్న ఎండలో.. వేడి రాగి నేలపై వారిని పరుగులు పెట్టిస్తారట.
సూకర ముఖం: అన్యాయంగా ప్రజలను శిక్షించే రాజులు లేదా అధికారులకు ఈ శిక్ష వేస్తారట. ఇది చెరకు గడలని పిండినట్లు పాపులను యంత్రాల్లో వేసి పిండుతారట.
అంధకూపం: క్రూర జంతువులను, పురుగులను చంపేవారికి ఈ శిక్ష వేస్తారట. ఒక బావిలో పాపులను పడేస్తారట. ఆ బావిలో ఉన్న పురుగులు వారిని పొడుస్తుంటాయట.
తప్తమూర్తి: బంగారం, విలువైన వస్తువులను దొంగిలించే వారికి ఈ శిక్షలు వేస్తారట. ఎర్రగా కాల్చిన లోహపు విగ్రహాలను కౌగిలించుకోమని చెప్తారట. ఆ మంట తట్టుకోలేక నరకం అంటే ఇలా ఉంటుందా అని ఆత్మలు ఏడుస్తుంటాయట.
శాల్మలి: పరస్త్రీ లేదా పరపురుష వ్యామోహం ఉన్నవారికి ఈ శిక్ష వేస్తారట. శిక్షలో భాగంగా ముళ్లు ఉన్న చెట్లపై వారిని ఈడ్చుకెళ్తారట.
వైతరిణి: మర్యాదలు పాటించని వారికి ఈ శిక్ష వేస్తారట. మల మూత్రాలు, రక్తం ప్రవహించే నదిలో వారిని పడేస్తారట.
పూయోదం: బ్రాహ్మణులను లేదా పెద్దలను మోసం చేసేవారు ఈ నరకానికి వెళ్తారు. ఇక్కడ చీము, రక్తం, మలమూత్రాలతో నిండిన సముద్రంలో వారు మునిగి ఉండాలట.
ప్రాణరోధం: జంతువులను వేటాడి వినోదం పొందే వారికి ఈ శిక్ష విధిస్తారు. యమదూతలు వారిని లక్ష్యంగా చేసుకుని బాణాలతో కొడతారట.
విశసనం: యజ్ఞ యాగాదుల పేరుతో జంతువులను హింసించే వారు ఇక్కడ శిక్ష అనుభవిస్తారట.
లాలాభక్షం: భార్యను కష్టపెట్టే భర్తలకు ఈ నరకంలో శిక్ష పడుతుందట. ఇక్కడ వారు అసహ్యకరమైన పదార్థాలను ఆహారంగా తీసుకోవాల్సి ఉంటుందట.
సారమేయాదనం: ఇతరుల ఆస్తులను అపహరించేవారిని, విషప్రయోగం చేసేవారిని వేల సంఖ్యలో ఉన్న భయంకరమైన కుక్కలు పీక్కుతింటాయట.
అవీచి: అబద్ధపు సాక్ష్యాలు చెప్పేవారిని పర్వత శిఖరాల నుండి కిందకు తోసేస్తారట. వారు పదే పదే ముక్కలైనా మళ్లీ పుట్టి అదే శిక్షను అనుభవిస్తారట.
అయఃపానం: మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి ఇక్కడ కరిగించిన లోహాన్ని (వేడి వేడి ద్రవం) నోట్లో పోస్తారట.
క్షారకర్దమం: గర్వంతో ఇతరులను అవమానించేవారిని తలకిందులుగా వేలాడదీసి హింసిస్తారట.
రక్షోగణ భోజనం: నరబలి ఇచ్చే వారికి లేదా మనుషులను హింసించే వారికి, తాము చంపిన ప్రాణుల చేతే హింసించబడే శిక్ష పడుతుందట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.