Lord Venkateswara: తిరుమల వెంకటేశ్వరస్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా..? స్వామివారిని శనివారం రోజు దర్శనం చేసుకోవాలని చాలా మంది ఎందుకు కోరుకుంటారు. శ్రీవారికి శనివారానికి వీడదీయరాని బంధం ఎప్పుడు ఎలా ఏర్పడిందో తెలుసా..? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఈ కథనం చదవాల్సిందే..!
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే అత్యంత ప్రీతిపాత్రమైన రోజట. శనివారానికి స్వామివారికి వీడదీయరాని బంధం ఉందట. స్వామి వారి జీవిత కాలంలో జరిగిన అన్ని ముఖ్యమైన కార్యక్రమాలన్నీ శనివారం రోజే జరిగాయల. స్వామి వారి జననం నుంచి వివాహం వరకు అన్ని శుభకార్యాలు స్వామి వారికి శనివారమే జరిగాయట. దీనికి సంబంధించి పురాణాలలోనూ, స్థల పురాణంలోనూ కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయట. ఆ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శని దేవుని అనుగ్రహం: పురాణాల ప్రకారం, శని దేవుడు శ్రీమహావిష్ణువును (వేంకటేశ్వరుడిని) అత్యంత భక్తితో ఆరాధించాడట. శని దేవుని భక్తికి మెచ్చిన స్వామి, శనివారం నాడు నిన్ను పూజించే వారికి, అలాగే నన్ను దర్శించుకునే వారికి నీవల్ల కలిగే కష్టాలు తొలగిపోతాయి అని వరం ఇచ్చారని పురాణాలలో ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. అందుకే, శనివారం నాడు స్వామి వారిని దర్శించుకుంటే శని దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
స్వామి వారి అవతార దినం: ఒక ఐతిహ్యం ప్రకారం కలియుగంలో శ్రీ వేంకటేశ్వర స్వామి శనివారం నాడే అవతరించారని (శ్రవణ నక్షత్రం, శనివారం కలయికలో) చెబుతారు. అందుకే ఆ రోజు స్వామి వారికి అత్యంత ప్రత్యేకం. స్వామివారు జన్మిచిన వారం కాబట్టి భక్తులు కూడా శనివారం స్వామి వారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపిస్తారట.
పద్మావతీ దేవి పరిణయం: శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని శనివారం నాడే వివాహం చేసుకున్నారని పురాణాల్లో ఉన్నట్టు పండితులు చెప్తుంటారు. అందుకే శనివారం రోజు కొత్త దంపతులు వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం ఆనవాయితీ వస్తుందట. చాలా మంది దంపతుల స్వామి వారిని శని వారం దర్శించుకోవడం శుభప్రదంగా భావిస్తారు.
అత్యంత శక్తివంతమైన రోజు: ఆధ్యాత్మికంగా, శనివారం శని గ్రహానికి సంబంధించిన రోజు. శని భగవానుడు ‘కర్మ ఫల ప్రదాత’. స్వామి వారిని ఈ రోజున సేవించడం వల్ల మన కర్మ దోషాలు తొలగిపోయి, జీవితంలో ప్రశాంతత, సౌభాగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే తిరుమలలో శనివారం అత్యంత రద్దీగా ఉండటానికి కారణాలు ఇవేనట. భక్తులు శని దోష నివారణ కోసం, స్వామి కృప కోసం ఆ రోజున తిరుమలకు పోటెత్తుతుంటారట.
పురట్టాసి మాసం: ముఖ్యంగా తమిళ క్యాలెండర్ ప్రకారం పురట్టాసి నెలలో వచ్చే శనివారాలు అంటే స్వామికి అత్యంత ప్రీతికరమైనవట. ఈ సమయంలోనే వేలాది మంది భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకుంటారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.