ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్రంలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూరీ ఆలయ శిఖరంపై ఉండే నీలచక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ద వచ్చి తీసుకెళ్లింది. అలా తీసుకు వెళ్తున్న దృశ్యాన్ని కొందరు సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పూరీ ఆలయ శిఖరంపై ఉన్న జెండాను గద్ద తీసుకెళ్తున్న దృశ్యాలు గంటల్లోనే వైరల్ గా మారాయి. అందరూ ఆ దృశ్యాల్ని చూసి ఆశ్చర్యపోయారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. తొలిసారి ఇలా ఒక గద్ద వచ్చి ఆలయ జెండాను తీసుకెళ్లిందని అంటున్నారు స్థానికులు. మరి దీని పరమార్థం ఏంటి..? ఆలయ శిఖరంపై ఉన్న జెండాను గద్ద తీసుకు వెళ్లడం శుభ సూచకమా..? అశుభమా..? దీని వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. పక్షి జెండాను తీసుకెళ్లే సమయంలో కూడా ఆలయంపై జెండా ఎగురుతూనే ఉంది. ఆలయ అధికారులు ఈ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
జెండా ప్రాధాన్యత..
పూరీ క్షేత్రానికి వచ్చే వచ్చే భక్తులంతా ముందుగా పతితపావన రూపమైన జెండాను దర్శించుకుంటారు. ఆలయానికి ఎంత దూరంలోనే జెండాను చూసి చేతులెత్తి మొక్కుతారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం చేసుకుంటారు. ఆలయానికి తొలిసారి వచ్చే వారికి స్థానికులు ఈ జెండా విశేషాన్ని వివరించి చెబుతుంటారు. భక్తులు మూలమూర్తిని చూసేందుకు ఎంత ఆసక్తి చూపిస్తారో, ఆలయ జెండాను దర్శించే సమయంలో కూడా అంతే ఆధ్యాత్మిక పరవశులవుతారు. స్వామివారి విగ్రహం లాగే.. ఈ జెండాకు పవిత్రమైన ప్రాధాన్యత ఉందని అంటారు.
ప్రతిరోజూ కొత్త జెండా..
జెండాకు ప్రాధాన్యతతోపాటు, ఓ ప్రత్యేకత కూడా ఉంది. సహజంగా ప్రతి ఆలయంపై కాషాయ వస్త్రాన్ని కట్టడం ఆనవాయితీ. ఇక బ్రహ్మోత్సవాలు చేసే ఆనవాయితీ ఉన్న ఆలయాల్లో గరుడ ధ్వజ పటాన్ని ఎగరవేస్తుంటారు. బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయని, ఆ ఉత్సవాలకు దేవతల్ని ఆహ్వానించడమే ఈ గరుడ ధ్వజ పటం ప్రత్యేకత. తిరుమల ఆలయంలో కూడా బ్రహ్మోత్సవ సమయంలో గరుడ ధ్వజ పటం ఎగురవేస్తారు. ధ్వజారోహణం, ధ్వజావరోహణం కార్యక్రమాలకు అక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది. పూరీ ఆలయం విషయంలో ఈ ఆనవాయితీ భిన్నమైనది. ఇక్కడ ప్రతిరోజూ జెండాను మారుస్తుంటారు. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటలకు సూర్యాస్తమ సమయంలో కొత్త జెండాను అక్కడ ఎగురవేస్తారు. ఆ జెండాకు దిగున భక్తులు సమర్పించే జెండాలను కడుతుంటారు. 14 మూరల పొడవున్న ప్రధాన పతాకం పూరీ ఆలయ ప్రత్యేకత. అయితే ఎన్నడూ లేనివిధంగా పక్షి జెండాను లాక్కెళ్లడం వింతగా చెప్పుకుంటున్నారు.
అపచారమా..?
కొంత మంది భక్తులు ఇది అపచారంగా భావిస్తున్నారు. గతంలో, 2020లో పూరీ ఆలయ పతాకం అగ్నికి ఆహుతైందని అంటున్నారు. అదే సమయంలో కొవిడ్ ఉధృతితో ప్రపంచం అల్లకల్లోలం అయిన సంగతిని గుర్తు చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు పటాన్ని పక్షి ఎత్తుకెళ్లిందని ఇప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు.
శుభమేనా..?
కొంతమంది మాత్రం దీన్ని ఓ దివ్య సంకేతంగా భావిస్తున్నారు. గద్ద అనేది విష్ణువు వాహనమైన గరుడుని ప్రతిరూపం. ఆ గద్ద పతాకాన్ని ఎత్తుకుని వెళ్ళింది కాబట్టి, అది ధర్మానికి సంకేతం అంటున్నారు. భక్తులెవరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎలాంటి అశుభాలు జరగవని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొందరు.