Hindu Gods: సనాతన ధర్మం కేవలం భక్తి మార్గాన్ని మాత్రమే కాకుండా.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగే నిరంతర పోరాటాన్ని కూడా బోధిస్తుంది. ఈ పోరాటంలో దేవతలు ధర్మానికి ప్రతీకలైతే.. వారిని వ్యతిరేకించిన రాక్షసులు అధర్మానికి సంకేతాలుగా నిలిచారు. ఈ యుద్ధాలు కేవలం శారీరకపరమైనవి కావు.. అవి మనిషి మనసులో జరిగే మంచి-చెడుల సంఘర్షణకు ప్రతిబింబాలు కూడా. హిందూ పురాణాలలో ప్రముఖమైన కొన్ని దేవతలు, వారి ప్రధాన శత్రువుల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..
1. శ్రీరాముడు vs రావణుడు:
శ్రీరాముడు: విష్ణువు యొక్క ఏడవ అవతారమైన శ్రీరాముడు ధర్మానికి, సత్యానికి, మర్యాదకు, పితృవాక్య పరిపాలనకు ప్రతీక.
రావణుడు: రావణుడు లంకాధిపతి. అంతే కాకుండా మహా శివభక్తుడు. కానీ అహంకారం, కామం, క్రూరత్వం అతడిని సర్వనాశనం చేశాయి. సీతను అపహరించడం ద్వారా రాముడికి ప్రధాన శత్రువుగా మారాడు.
రామాయణంలో.. రాముడు రావణుడిని సంహరించడం అనేది ధర్మం అధర్మంపై సాధించిన విజయంగా చెబుతారు. రావణుడి పది తలలు మానవులలో ఉండే పది చెడు లక్షణాలను సూచిస్తాయి. వాటిని జయించడమే నిజమైన విజయం అని రామాయణం బోధిస్తుంది.
2. దుర్గాదేవి vs మహిషాసురుడు:
దుర్గాదేవి: దుర్గాదేవి శక్తికి, పరాక్రమానికి అంతే కాకుండా ధైర్యానికి ప్రతీక. సకల దేవతల తేజస్సుతో ఆవిర్భవించిన దుర్గాదేవి దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతరించింది.
మహిషాసురుడు: మహిషాసురుడు ఒక శక్తివంతమైన రాక్షసుడు. బ్రహ్మ వరం వల్ల పురుషులెవ్వరూ తనను సంహరించలేరని గర్వించి, దేవలోకాన్ని ఆక్రమించాడు.
మహిషాసురుడి గర్వాన్ని అణచివేయడానికి దుర్గాదేవి అవతరించింది. దేవి తన ఖడ్గంతో మహిషాసురుడిని సంహరించి.. ముల్లోకాలకు శాంతిని చేకూర్చింది. ఈ విజయమే దుర్గా పూజ, దసరా పండుగకు ముఖ్య కారణం. ఈ కథ, చెడు ఎంత బలంగా ఉన్నా.. అంతిమంగా మంచిదే గెలుస్తుందని తెలియజేస్తుంది.
Also Read: నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం, విశిష్టత ఏమిటి ?
3. శ్రీకృష్ణుడు vs కంసుడు:
శ్రీకృష్ణుడు: విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమైన శ్రీకృష్ణుడు ప్రేమ, జ్ఞానం, లీలా వినోదాలకు ప్రతీకగా చెబుతారు .
కంసుడు: శ్రీకృష్ణుడి మేనమామ అయిన కంసుడు ఒక క్రూరమైన, అధికార దాహం ఉన్న రాజు. తనకు కృష్ణుడి వల్ల మరణం సంభవిస్తుందని తెలిసి, అతడిని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశాడు.
కంసుడి చెరసాల నుంచి బయటపడిన కృష్ణుడు, చివరికి అతడిని సంహరించి ప్రజలకు విముక్తి కలిగించాడు. ఈ కథ చెడు మనస్తత్వం ఉన్న బంధువు కూడా శత్రువేనని, ధర్మాన్ని కాపాడటానికి బంధాలను కూడా త్యజించవచ్చని సూచిస్తుంది.
ఈ పురాణ గాథలు కేవలం కథలు మాత్రమే కాకుండా.. మానవ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని, చెడుపై మంచి విజయం సాధిస్తుందని, అంతే కాకుండా ధర్మాన్ని ఎల్లప్పుడూ అనుసరించాలని బోధిస్తాయి.