
Yaganti Temple : తెలుగునేలపై అత్యంత పేరున్న శైవక్షేత్రాల్లో యాగంటి ఒకటి. ఎర్రని శేషాచలం కనుమల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో, ఉట్టిపడే ప్రశాంత వాతావరణంలో… బనగానపల్లెకు 13 కి.మీ దూరాన ఈ క్షేత్రం కొలువై ఉంది.
అపర శివభక్తుడైన భృగుమహర్షి శివ సాక్షాత్కారం కోసం తపస్సు చేసిన స్థలం ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. మరో జానపద గాథ ప్రకారం.. చిట్టెప్ప అనే శివభక్తుడు పూర్వం శివుడి కోసం ఇక్కడ తపస్సు చేశాడట. కొన్నాళ్లకు అతనికి ఒక పెద్దపులి కనిపించగా.. పరమేశ్వరుడే పులి రూపంలో వచ్చాడని భావించి.. సంతోషంతో ‘నేకంటి నేకంటి’ (నేను చూశాను..నేను చూశాను) అని కేకలు వేశాడట. అదే కాలక్రమంలో యాగంటి అయిందని చెబుతారు.
సాధారణంగా శివాలయాల్లో శివలింగం ఒక చోట, అమ్మవారు వేరే ఆలయంలో ఉంటారు. కానీ.. యాగంటిలో ఒకే శిలపై ఉమామహేశ్వరులు కొలువై ఉన్నారు. పేరుకు శైవ క్షేత్రమే అయినా.. యాగంటి అనగానే అందరికీ ఇక్కడి భారీ నందీశ్వరుడే గుర్తుకొస్తాడు. యాగంటి బసవన్న పేరుతో భక్తులు ఆయనను పూజిస్తుంటారు.
పార్వతీ పరమేశ్వరులు ఈ క్షేత్రంలో ఒకే పీఠంపై కొలువై ఉన్న కారణంగా.. ఇక్కడి బసవయ్య వారి ఏకాంతానికి భంగం కలిగించని రీతిలో ఎదురుగా కాకుండా, కాస్త ఈశాన్యం దిశగా ముఖం పెట్టి కనిపిస్తాడు. ఆది దంపతుల ఏకాంతానికి భంగం కలిగించని రీతిలో.. ఇక్కడి నందీశ్వరుడు కాస్త ఈశాన్యం వైపు ముఖం పెట్టి కనిపిస్తాడు. కలియుగాంతం రోజున ఇక్కడి ఈ బసవయ్య బిగ్గరగా అరిచి, రంకెవేస్తాడని, ఆ ధ్వనికి జనులంతా మరణిస్తారని వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో ఈ క్షేత్ర ప్రస్థావన చేశారు.
ఇక్కడి బసవయ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాడు. ప్రతి 20 సంవత్సరాలకు ఈ నంది అంగుళం మేర పెరుగుతోందని పురావస్తు శాఖ చెబుతోంది. 90 ఏళ్ల క్రితం నందీశ్వరుడి మండపంలో భక్తులు బసవయ్యకు ప్రదక్షణలు చేసేవారు. కానీ.. స్వామి రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ప్రస్తుతం ఆ మండపంలో స్తంభాలకు, నందీశ్వరుడికి మధ్య మనిషి పట్టే అవకాశం లేకుండా పోయింది.
దట్టమైన అడవిలో ఉన్న ఈ క్షేత్రంలో ఒక్క కాకి కూడా కనిపించకపోవటం విశేషం. గతంలో అగస్త్య మహాముని ఇక్కడ తపస్సు చేస్తున్నవేళ.. కాకాసురడనే కాకుల నాయకుడు తన సమూహంతో వచ్చి, ఆయనను చీకాకు పెట్టటంతో ఇక్కడ కాకి అనేది వాలటానికి వీల్లేదని ఆయన శపించాడట. తన వాహనానికి స్థానంలేని ఈ ప్రదేశంలో తానిక అడుగే పెట్టనని శనీశ్వరుడూ ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయాడట. శని ప్రభావం లేని అరుదైన క్షేత్రంగా యాగంటికి పేరుంది. అందుకే ఇక్కడి శివాలయంలో నవగ్రహాలుండవు.
నిజానికి అగస్త్యుడు ముందుగా ఇక్కడ ఒక పెద్ద విష్ణువు ఆలయం నిర్మించాలని సంకల్పించాడట. ఆయన ఆజ్ఞ మేరకు అక్కడి రాజు.. విష్ణువు విగ్రహం తయారుచేయించగా, ప్రతిష్ట సమయానికి అది దెబ్బతినిందట. ఆ రాత్రి ఆ రాజుకు కలలో పరమేశ్వరుడు కనిపించి.. అక్కడ తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించటంతో ఇది శివక్షేత్రం అయింది. పూర్తయ్యే వేళకి.. దానిలో కొంత పగిలిపోవటం, ఆ తర్వాత రాజు కలలో పరమేశ్వరుడు కనిపించి, ఇది శేవ క్షేత్రానికే సముచితమని చెప్పడంతో శివాలయం నిర్మించారట. దీనికి గుర్తుగా.. యాగంటి ప్రధానాలయానికి చుట్టూ ఉన్న గుహలయాల్లోని శ్రీ వెంకటేశ్వరుడి గుడి ఉంటుంది. ఆ ఆలయంలోని మూర్తి ఎడమకాలి బొటనవేలు విరిగిపోయి ఉంటుంది.
14వ శతాబ్దంలో హరిహరరాయలు, బుక్కరాయల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందిందనీ, శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టు చరిత్ర చెబుతోంది. ఆలయ నిర్మాణం, అందులో స్వచ్ఛమైన నీటితో కనిపించే గొప్ప పుష్కరిణి భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి. శేషాచల పర్వత శ్రేణుల నుంచి జాలువారే ఒక జలధార నీరు ఈ పుష్కరిణిలో పడుతుంది. ఈ నీటిలో స్నానం చేస్తే మంచి ఆరోగ్యం సమకూరుతుందని భక్తుల నమ్మకం.