
World Cup 2023 : ఆశ్చర్యపోతున్నారా? అవునండీ అవును.. వరల్డ్ కప్ కలల జట్టుని క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆడుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో 10 దేశాల జట్లు పాల్గొన్నాయి. టాప్ 4లో ఉన్న జట్లే కాదు. మిగిలిన జట్లలో కూడా కొంతమంది క్రీడాకారులు అద్భుతంగా ఆడారు. కాకపోతే జట్టుగా ఓడిపోవచ్చు గానీ, ఆటగాళ్లుగా ఓడిపోలేదు.
అలా అద్భుతమైన ప్రదర్శన చేసినవాళ్లని 10 జట్ల నుంచి 12 మందిని ఎంపిక చేశారు. వీరందరూ వరల్డ్ కప్ జట్టులో ఉంటే అద్భుతంగా ఉంటుందని తెలిపారు. ఇందులో విశేషం ఏమిటంటే ఇండియా నుంచి నలుగురు క్రికెటర్లకు అందులో చోటు దక్కింది. ఈ టీమ్ కి కింగ్ విరాట్ కోహ్లీని కెప్టెన్ చేసింది. ఇంతకీ క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసిన సభ్యులు వీరే.. ఒకసారి మీరు కూడా ఆ కలల జట్టును చూడండి.
సౌతాఫ్రికా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ ఉన్నాడు. ఇందులో 4 సెంచరీలున్నాయి. మొత్తం 591 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ గా ఆస్ట్రేలియా నుంచి డేవిడ్ వార్నర్ ఉన్నాడు. మొత్తం 499 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. లీగ్ దశ ముగిసేసరికి 594 పరుగులతో తనే టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి.
న్యూజిలాండ్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. తను కూడా ఇప్పటివరకు 565 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలున్నాయి. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ మార్ క్రమ్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 396 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, మూడు ఆఫ్ సెంచరీలున్నాయి. ఇక విధ్వంసకర బ్యాట్స్ మెన్ మ్యాక్స్ వెల్ ఉన్నాడు. ఆఫ్గాన్ పై చేసిన డబుల్ సెంచరీతో ప్రపంచం దృష్టిని ఒక్కసారి తనవైపునకు తిప్పుకున్నాడు.
ఇక పేసర్ల దగ్గరికి వచ్చేసరికి సౌతాఫ్రికా నుంచి మార్కో జాన్సన్, ఇండియా నుంచి మహ్మద్ షమీ, బుమ్రా, శ్రీలంక నుంచి దిల్షాన్ మధుశంక ఉన్నారు. ఇక స్పిన్నర్లు ఆడమ్ జంపా, రవీంద్ర జడేజా ఉన్నారు. ఇందులో వికెట్ కీపర్ గా డికాక్ చేస్తాడు. మొత్తానికి ఇంతవరకు టాప్ లో ఉన్నవారినే ఈ కలల జట్టులోకి ఎంపిక చేశారు. ఇండియా నుంచి నలుగురు, సౌతాఫ్రికా నుంచి ముగ్గురు ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ముగ్గురు, న్యూజిలాండ్, శ్రీలంక నుంచి ఒకొక్కరు ఉన్నారు.