Chamala Kiran Kumar Reddy: భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి జర్మనీలో పర్యటించారు. జర్మనీ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ (SPD)తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో సభ్యుడిగా, రెండు రోజుల పాటు బెర్లిన్‌లో జరిగిన “పొలిటికల్ డైలాగ్ ప్రోగ్రామ్”లో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలోని ప్రోగ్రెసివ్ అలయన్స్‌లో కీలక సభ్యురాలిగా ఉన్న SPDతో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే ఈ పర్యటన ఉద్దేశం.
ఈ కార్యక్రమాన్ని ఫ్రెడ్రిచ్-ఎబర్ట్-స్టిఫ్టుంగ్ (FES) సంస్థ SPDతో భాగస్వామ్యంగా నిర్వహించింది. జర్మనీ రాజకీయ నాయకులు, విధానకర్తలతో చర్చలకు ఇది వేదికగా నిలిచింది. ఈ భారత ప్రతినిధి బృందంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) తో పాటు, కాంగ్రెస్ ఎంపీలు మాణిక్యం ఠాకూర్, ఆల్ఫ్రెడ్ కన్నంగం ఎస్. ఆర్థర్, డీఎంకే ఎంపీ డాక్టర్ కలానిధి వీరస్వామి పాల్గొన్నారు.
Read Also: Fertilizers: యాసంగి ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల సమీక్ష.. కేంద్రానికి కీలక విజ్ఞప్తి
రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జర్మనీ, యూరప్‌లోని ప్రస్తుత రాజకీయ-ఆర్థిక పరిస్థితులు, భారత్-జర్మన్ ప్రోగ్రెసివ్ పార్టీల మధ్య సహకారం, అసమానతలు, వాతావరణ సంక్షోభం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి ప్రోగ్రెసివ్ శక్తులు సమిష్టిగా పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
ఈ బృందం SPD పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ మథియాస్ మియర్ష్, మాజీ మంత్రి హుబర్టస్ హైల్, విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి ఆదిస్ అహ్మెడోవిచ్ వంటి ముఖ్య నేతలతో భేటీ అయింది. పర్యటన ముగింపులో FES అధ్యక్షుడు, యూరోపియన్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మార్టిన్ షుల్జ్‌తో ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఈ పర్యటన ఇరు దేశాల ప్రోగ్రెసివ్ పార్టీల మధ్య రాజకీయ అవగాహనను బలోపేతం చేసిందని ప్రతినిధి బృందం పేర్కొంది.