Fertilizers: యాసంగి సీజన్‌కు ఎరువుల సరఫరాపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సీజన్ కోసం రాష్ట్రానికి 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 1.45 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపి, 7 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సహా ఇతర ఎరువులు కేటాయించినట్లు వ్యవసాయ డైరెక్టర్ గోపి మంత్రికి వివరించారు. మంత్రి ఆదేశాల మేరకు, 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లోనే (నెలకు 2 లక్షల టన్నుల చొప్పున) తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత సీజన్‌లో సీజన్ ప్రారంభానికి ముందే అడిగినా కేంద్రం కేటాయించిన ఎరువులను సమయానికి సరఫరా చేయలేదని గుర్తుచేశారు. ఈసారైనా కేటాయించిన ఎరువులలో 60 నుంచి 70 శాతం మేర అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లలో సరఫరా చేస్తే, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పంపిణీ చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 58 వేల టన్నుల డిఎపి, 2.09 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు బఫర్ నిల్వలుగా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
Also Read: KCR Campaign: జూబ్లీహిల్స్ ప్రచారానికి కేసీఆర్ రానట్లేనా?
ఈ సమీక్షలో రెండు కీలక అంశాలను మంత్రి ప్రస్తావించారు. రైల్వే శాఖ వరంగల్ రేక్ పాయింట్‌ను మూసివేసి, చింతలపల్లి పాయింట్‌కు మార్చడం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎరువుల సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పాయింట్ పూర్తిస్థాయిలో వాడకంలోకి వచ్చే వరకు, మరో 4-5 నెలల పాటు వరంగల్ రేక్ పాయింట్‌ను కొనసాగించాలని రైల్వే మంత్రికి లేఖ రాసినట్లు తెలిపారు.
అలాగే, రాష్ట్రంలో యూరియా వినియోగం డిసెంబర్ మూడో వారం నుండి గరిష్ట స్థాయికి చేరుకుంటుందని, అయితే అక్టోబర్ నెలకు సంబంధించి దిగుమతి యూరియాలో 37 వేల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో, తక్షణమే అదనంగా 0.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుమతి యూరియాను కేటాయించి, CIL ద్వారా త్వరితగతిన రవాణా చేయాలని కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రిని కోరినట్లు తుమ్మల వెల్లడించారు.