150 Years of Vande Mataram: భారత స్వాతంత్య్ర పోరాటంలో అజరామర స్ఫూర్తిని నింపిన “వందేమాతరం” గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు (నవంబర్ 7) దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ 150వ వార్షికోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో జరిగే ప్రధాన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననుండగా, రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వందేమాతరం 150వ వార్షికోత్సవం (ఉత్సవం) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసింది. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, అలాగే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థలలో “వందేమాతరం” పూర్తి గీతాన్ని సామూహికంగా (మాస్ సింగింగ్) ఆలపించాలని ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని అన్ని జిల్లాల్లో పకడ్బందీగా నిర్వహించాలని సూచించింది.
ఢిల్లీలో స్మారక స్టాంపు, నాణెం: ప్రధాని మోదీ
ఈ చారిత్రక రోజుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. “నవంబర్ 7 ప్రతి భారతీయుడికి ఒక చిరస్మరణీయమైన రోజు. తరతరాలకు స్ఫూర్తినిచ్చిన, దేశభక్తిని రగిలించిన వందేమాతరం 150 ఏళ్లను జరుపుకుంటున్నాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఉదయం 9:30 గంటలకు జరిగే కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధాని వెల్లడించారు. ఈ వేడుకల్లో వందేమాతరం 150 ఏళ్ల స్మారకార్థం ప్రత్యేక స్టాంపు, నాణెం కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సామూహిక వందేమాతరం గానం హైలైట్‌గా నిలుస్తుందని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Also: Karimnagar: కొడుకు అరెస్ట్ అంటూ సైబర్ మోసగాళ్ల కాల్.. తండ్రికి గుండెపోటు!