Holika Dahan 2026: రంగుల పండగ హోలీకి ఒక రోజు ముందు నిర్వహించే అత్యంత ముఖ్యమైన ఘట్టం ‘హోలికా దహనం’. దీనినే మన తెలుగు రాష్ట్రాల్లో ‘కామదహనం’ అని కూడా పిలుస్తారు. మార్చి 3వ తేదీ సాయంత్రం జరగనున్న ఈ వేడుక, కేవలం కట్టెలను కాల్చడం మాత్రమే కాదు. ఇది అహంకారాన్ని, చెడు ఆలోచనలను వదిలేసి, భక్తి మార్గంలో నడవాలనే సందేశాన్ని ఇస్తుంది. హిరణ్యకశిపుని సోదరి హోలిక అంతం, భక్త ప్రహ్లాదుని రక్షణ అనే పురాణ గాథల చుట్టూ ఈ పండగ విశిష్టత అల్లి ఉంది.
హోలికా దహనం ఎప్పుడు?
ఫాల్గుణ మాస పౌర్ణమి తిథి నాడు సాయంత్రం లేదా రాత్రి వేళ హోలికా దహనం నిర్వహిస్తారు. ఈ ఏడాది మార్చి 3వ తేదీన వస్తుంది. ఆ మరుసటి రోజు అంటే ..మార్చి 4న రంగుల పండుగ హోలీని జరుపుకుంటారు.
పురాణ నేపథ్యం – హోలిక అంతం:
హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు తనను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు నిరంతరం నారాయణ నామస్మరణ చేస్తుంటాడు. ఇది నచ్చని హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు అతని సోదరి హోలిక ముందుకు వస్తుంది. ఆమెకు అగ్నిలో కాలని ఒక వరం ఉంటుంది (ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని కప్పుకుంటే మంటలు ఆమెను తాకవు).
ప్రహ్లాదుడిని ఒడిలో పెట్టుకుని మంటల మధ్య కూర్చుంటుంది హోలిక. కానీ భగవంతుని మాయ వల్ల ఆ వస్త్రం ప్రహ్లాదుడిని కప్పుతుంది. హోలిక మంటల్లో కాలి బూడిదవుతుంది. ఈ సంఘటన భగవంతుని నమ్మిన వారికి ఎప్పుడూ రక్షణ ఉంటుందని, అధర్మానికి పాల్పడేవారు ఎంతటి శక్తిమంతులైనా నాశనమవుతారని చాటి చెబుతుంది.
కామదహనం పేరు ఎలా వచ్చింది?
దక్షిణ భారతదేశంలో దీనిని ‘కామదహనం’ అని పిలుస్తారు. దీని వెనక శివుని కథ కూడా ఉంది. తారకాసురుడనే రాక్షసుడిని చంపే కుమారుడు శివునికి కలగాలని, తపస్సులో ఉన్న శివునిపై మన్మథుడు (కామదేవుడు) బాణాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు ఆగ్రహించిన శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మథుడిని భస్మం చేస్తాడు. మనలోని కామ, క్రోధ, లోభ మోహాలను దహనం చేయాలనే అర్థంలో దీనిని కామదహనం అంటారు.
Also Read: హోలీ 2026: మార్చి 3నా లేక 4నా? అసలు తేదీ, ముహూర్తం వివరాలు!
ఆచారాలు, సంప్రదాయాలు:
హోలికా దహనం రోజున వీధి కూడళ్లలో కర్రలు, ఎండిన ఆకులు, పిడకలతో పెద్ద కుప్పను వేస్తారు. దీనిని హోలికకు ప్రతీకగా భావించి పూజలు చేస్తారు. ముహూర్తం ప్రకారం ఆ కట్టెలకు నిప్పు పెడతారు. ప్రజలు ఆ మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పాటలు పాడతారు. పాత వస్తువులను, మనసులోని నెగటివ్ ఆలోచనలను ఆ మంటల్లో వేస్తున్నట్లుగా భావిస్తారు. ఆ మంటల నుంచి వచ్చిన బూడిదను పవిత్రంగా భావించి నుదుట ధరిస్తారు.
సామాజిక, ఆధ్యాత్మిక సందేశం:
హోలికా దహనం మనకు ఇచ్చే గొప్ప సందేశం “విశ్వాసం”. ప్రహ్లాదుడు ఆపదలో ఉన్నప్పుడు భగవంతుడిని స్మరించినట్లు, మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నీతిగా ఉండాలని ఇది చెబుతుంది. అలాగే వాతావరణంలో మార్పులు వచ్చే ఈ సమయంలో, మంటల వల్ల వచ్చే వేడి పరిసరాల్లోని క్రిములను చంపేస్తుందని.. చర్మ వ్యాధులను అడ్డుకుంటుందని ఒక నమ్మకం.