BigTV English

Karthika Purnima : కోటి పుణ్యాల కార్తీక పున్నమి..

Karthika Purnima : కోటి పుణ్యాల కార్తీక పున్నమి..

Karthika Purnima : శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన, పరమపావనమైన కార్తికమాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశేషమైనది. కార్తీకమాసం మొత్తం చేసే పూజలన్నీ కలిపి ఇచ్చే ఫలితాన్ని ఒక్క కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ ఇస్తుందని పెద్దల నమ్మకం. అగ్నితత్త్వ మాసమైన కార్తీకంలో వచ్చే పౌర్ణమికి చంద్రుడిని విశేషంగా ఆరాధించాలని మన పూర్వులు చెబుతారు. ఈ పౌర్ణమినే శరత్‌ పూర్ణిమ, త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అనీ పిలుస్తారు. చంద్రుడు కృత్రికా నక్షత్రంతో కూడి ఉన్న మాసం కనుక దీనిని కార్తీకమాసం అంటారు.


వేదాలను అపహరించి, సముద్రంలో దాక్కున్న సోమకాసురుణ్ని సంహరించేందుకు ఈ పౌర్ణమి రోజే.. శ్రీమహా విష్ణువు.. మత్స్యావతారం ధరించాడు. అలాగే.. దత్తాత్రేయ స్వామి జన్మించినదీ ఈ రోజే. యోగసిద్ధులైన గోపికలను కృష్ణ పరమాత్మ అనుగ్రహించిన శుభదినమూ ఇదే. ఈ రోజున బృందావనంలో ‘రాసలీలా మహోత్సవం’ జరుపుతారు.

నేటి సముద్రస్నానం శివారాధన, అభిషేకం, ఉసిరిక, దీపారాధనలకూ విశేషమైన ఫలితాలున్నాయి. శంకరుడు త్రిపురాసురుణ్ని వధించిన విజయోత్సాహానికి సంకేతంగా స్త్రీలు 720 వత్తుల నేతి అఖండ దీపం వెలిగించి భక్తేశ్వర వ్రతం ఆచరిస్తారు.


మహిషాసురవధ సందర్భంలో పార్వతి అనుకోకుండా శివలింగాన్ని బద్దలు చేసిన పాపానికి పరిహారంగా కార్తిక పౌర్ణమి వ్రతం చేసి దోష నివారణ చేసుకున్నదని ఓ పురాణ కథనం. క్షీరసాగర మథనం సందర్భంగా వెలువడిన హాలాహలం మింగి శివుడు లోకసంరక్షణం చేసినందుకు సంతోషంతో ప్రజలు కార్తీక పౌర్ణమినాడు ‘జ్వాలాతోరణోత్సవం’ నిర్వహించారట.

కార్తీకపౌర్ణమి నాడు కార్తికేయుడు తారాకాసుర సంహారం చేసినట్లు తెలుస్తోంది. అందువలన ఆయనకు కూడా విశేష పూజలు నిర్వహిస్తారు. కార్తీక పౌర్ణమినాడు తమిళులు నూత్న వధూవరులను పుట్టింటికి పిలిచి వారితో దీపారాధన చేయించి, సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇప్పిస్తారు.

కార్తీక పూర్ణిమ నాడు శంకరుడు త్రిపురాసురుణ్ణి వధించిన రోజు. అందువలన ఈరోజును త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజు అరుణాచల క్షేత్రంలో అఖండ జ్యోతి వెలిగిస్తారు.
ఈ రోజున ‘వృషోత్సర్జనం’ అనే ఉత్సవం జరుపుకొంటారు. పితృదేవుల ప్రీత్యర్థం ఒక కోడెదూడను ఆబోతుగా వదులుతారు. ఇలా చేయడం వల్ల గయలో కోటిసార్లు శ్రాద్ధం నిర్వహించిన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. శివాలయంలో ఈ రోజున నందాదీపం పేరుతో అఖండ దీపం వెలిగిస్తారు. ఆకాశ దీపం పేరుతో ధ్వజస్తంభానికి వేలాడదీస్తారు.

ఉసిరి చెట్టు కింద కార్తీక దామోదరుడిగా కీర్తిపొందిన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికాయలతో పూజిస్తారు. కొందరు ఈ రోజున తులసిని, వ్యాసుణ్ని ఆరాధిస్తారు. దీపదానం, బిల్వదళార్చన, ఉపవాసం, జాగరణ, శతలింగార్చన, సహస్ర లింగార్చన, ఏకాదశ రుద్రాభిషేకం, వన భోజన సమారాధన, సంకీర్తన, పురాణ శ్రవణం, వెండి, బంగారు, సాలగ్రామం, భూ, గోదానం, అన్నదానాలకు కార్తిక పౌర్ణమి ఎంతో ప్రశస్తమైనది.

ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల్ని అనుసరించి శైవ-వైష్ణవాలయాల్లో ఈ రోజన చేసే జప, తప, దీపదాన, పూజాదికాలకు అనంతమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.

కార్తిక పౌర్ణమి సిక్కులకూ అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజునే సిక్కు మత వ్యవస్థాపకుడైన గురు నానక్‌ జన్మించాడు.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×