Kanaka Durga: విజయవాడ కనకదుర్గమ్మ పేరులోని కనక ఎలా వచ్చిందో తెలుసా..? అమ్మవారి పేరు ముందు కనక అని చేర్చి మొదట పలికింది ఎవరో తెలుసా..? దుర్గమ్మ కనకదుర్గమ్మగా మారడానికి దోహదం చేసిన సంఘటనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
విజయవాడ కనకదుర్గమ్మ పేరులోని కనక అనే పేరు రావడానికి ఓ కారణం ఉంది. దాదాపు ఐదారు శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం ఉండేది కాదట. ఆ రోజుల్లో అమ్మవారు ఒక పెద్ద రాతి బండ మీద చింతామణి కాళీ రూపంలో వెళిశారట. ఆ రూపం ఎంతో భయంకరంగా ఉండేది కాబట్టి ఆమెను చూడటానికి ప్రజలు ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదట. అమ్మవారు కూడా గొలుసుల శబ్దంతో ఊరి వీధుల్లో సంచరిస్తన్నట్లుగా ప్రజలకు అనిపించేదట. అందుకే సాయంత్రం కాగానే ఇళ్ల తలుపులు వేసుకుని లోపలే ఉండేవారట. ఆ రోజుల్లో విజయవాడను పరిపాలిస్తున్న రాజు పేరు మాధవవర్మ. అతడు ధర్మబద్దంగా ప్రజలను పాలించేవాడట. అమ్మవారంటే ఎనలేని భక్తి కలిగిన ఆ రాజుకు ఎంత చేసినా ఆ మహారాజుకు సంతానం కలగలేదట. రోజూ అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్లి భక్తితో పూజలు చేసేవాడట. చివరికి అమ్మవారు కరుణించారట. రాజుకు పుత్రసంతానం కలిగిందట. ఇది అమ్మవారి దయవల్లే అని గ్రహించిన రాజు అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడట.
కాలం గడిచింది యువరాజు పెరిగి పద్దవాడయ్యాడట. క్రమశిక్షణ, ధైర్యం కలిగిన యువకుడిగా ఉండేవాడట. ఒకరోజు యువరాజు తన రథానికి గుర్రాలు కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడట. అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబానికి భోజనం కోసం అడవిలో ఆకులు సేకరిస్తూ ఉంటుందట. చీకటి అయితే అమ్మవారు సంచరిస్తారని భయపడి తన కుమారుడిని పట్టుకుని త్వర త్వరగా ఇంటికి బయలుదేరిందట. దారిలో యువరాజు గమనించకపోవడంతో ఆ రథం డీ కొట్టి ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోతాడట. ఆ తల్లి తన కొడుకు శవాన్ని ఎత్తుకుని తన బాధను రాజుకు వినిపించేందుకు చరమగంటను మోగించిందట. విషయం తెలుసుకున్న రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా నేరానికి శిక్ష తప్పదు.. అంటూ తన కుమారుడికి మరణదండన విధించాడట. మాధవవర్మ స్వయంగా తన చేతులతో తన కుమారుడికి మరణదండన అమలు చేశాడట.
ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలంతా కన్నీళ్లు పెట్టుకున్నారట. అప్పుడే ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకున్నాయట. ఒక్కసారిగా ఆకాశంలోంచి బంగారు నాణేల వర్షం కురిసిందట. ప్రజలు ఆశ్చర్యంతో ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటున్నారట. కానీ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ.. నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా..? అమ్మా అని కన్నీళ్లతో అడిగాడట. అప్పుడే అమ్మవారి మహిమ వల్ల యువరాజు, చనిపోయిన ఆ పిల్లవాడు ఇద్దరూ లేచి పరుగెత్తుకుంటూ వచ్చారట. రాజు తన కుమారుడిని హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడట. ఆరోజు అక్కడ కనకవర్షం కురిసింది కాబట్టి ఆరోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారట.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.