Big Stories

Magha Purnima 2024: ముక్తినిచ్చే మహా మాఘి..!

magha purnima 2024

- Advertisement -

Significance of Magha Pournami: నెలలో వచ్చే పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నెలకు ఆ నక్షత్రంతో కూడిన పేరు వచ్చింది. ఈ నెలలో చంద్రుడు ‘మఘ’ నక్షత్రంతో కలసి ఉంటాడు గనుక ఇది మాఘమాసం అయింది. ఈ మాఘ పౌర్ణమినే ‘మహా మాఘి’ అని కూడా అంటారు. ఇది చంద్రుడు పదహారు కళలతో ప్రకాశించే అరుదైన రోజు. సంవత్సరంలో 12 నెలల్లో వచ్చే అన్ని పౌర్ణమి తిధుల కంటే.. ఈ మాఘ పౌర్ణమి అత్యంత గొప్పదిగా మన పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

పౌరాణికంగా ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. దక్ష ప్రజాపతికి సతీదేవి పుట్టిన రోజు ఇదే. అలాగే.. సుబ్రహ్మణ్య స్వామి.. తన తండ్రి పరమశివుడికి వేదాంత రహస్యాలను బోధించినదీ ఈ రోజే. ఈ పున్నమి రోజునే జగద్గురువు ఆదిశంకరులు.. పంచాయతన పూజావిధిని ప్రారంభించారు. ఈ రోజున దేవతలు మానవ రూపంలో భూమిపైకి వచ్చి గంగాస్నానం చేస్తారని, నేడు చేసే విష్ణుపూజ, ఉపవాసం మనసులోని కోరికలను నెరవేరుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మృకండు ముని దంపతులు చేసిన పుణ్యస్నానం వల్లనే వారి కుమారుడైన మార్కండేయునికి ఎదురైన అపమృత్యుదోషం తొలగిపోయిందని మార్కండేయ పురాణం చెబుతోంది. ఈ రోజున మఘ నక్షత్రాధిపతియైన బృహస్పతిని ఈ రోజు పూజించటం వల్ల విశేషమైన జ్ఞానం సిద్ధిస్తుంది.

ఈ రోజు శ్రీమన్నారాయణుడు నీటిలో కొలువై ఉంటాడు. కనుక సూర్యోదయానికి గంట ముందే సముద్ర స్నానం చేయటం, లేదా నది, కాలువ, బావి స్నానమైనా చేయాలి. ఈ రోజు స్నానం చేసే పద్ధతి కూడా ప్రత్యేకమే. ప్రవాహానికి ఎదురుగా నడుము మునిగే లోతులో నిలబడి కనీసం 48 నిమిషాల పాటు స్నానం చేయాలి. ఈ రోజున సూర్యుని తేజస్సు, చంద్రుని అమృతగుణాలు నీటిలో ఉంటాయనీ, కనుక ఈ స్నానం మనసులోని మాలిన్యాన్ని పోగొట్టి మనలను మాధవునికి దగ్గర చేస్తుందని చెబుతారు. ఇంట్లోనే స్నానం చేసేవారు ‘గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు’ అనే మంత్రం చదివి తలస్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ఉత్తమమని పెద్దలు సూచిస్తున్నారు.

ఈ రోజున నువ్వులకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. శ్రీమహా విష్ణువు శరీరానికి పట్టిన చెమట బిందువులే నువ్వులుగా మారాయని పురాణ కథనం. ఈ రోజున నువ్వులు, చక్కెర కలిపి విష్ణువుకు నివేదన చేయటం విశేష ఫలితాన్నిస్తుంది. అలాగే.. ఉదయం స్నానానంతరం రాగి పాత్ర నిండుగా నువ్వులు పోసి బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి. ఈ పూర్ణిమ నాడు రవి, చంద్రులు ఒకరికొకరు సమసప్తక కేంద్రగతులై పరస్పరం వీక్షించుకుంటారు.

ఈ ఏడాది పౌర్ణమి తిథి ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3:33 గంటలకు ప్రారంభమై, మర్నాడు సాయంత్రం 5.59 గంటల వరకు ఉంది. సంవత్సరంలో ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘపూర్ణిమ, వైశాఖ పూర్ణిమల్లో సముద్ర స్నానం చేసిన వారికి సముద్రుడు మంచి ఆరోగ్యాన్ని అందిస్తాడని పురాణవచనం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News