BigTV English

Panakala Narasimha Swamy Temple : గండాలు తీర్చే దైవం.. పానకాల నరసింహుడు

Panakala Narasimha Swamy Temple : గండాలు తీర్చే దైవం.. పానకాల నరసింహుడు
Panakala Narasimha Swamy Temple

Panakala Narasimha Swamy Temple : తన పాదాలను ఆశ్రయించిన భక్తులను కాపాడేందుకు తోచిన రూపాల్లో శ్రీ నారసింహుడు ప్రత్యక్షమై వారిని కాపాడిన ఉదంతాలు ఎన్నో మనకు పురాణాల్లో కనిపిస్తాయి. పూర్వం ఆది శంకరాచార్యులంతటి మహనీయుడు.. తనని ఆపదలనుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ నృసింహ కరావలంబన స్తోత్రం చేయగా, ఆ స్వామి కృష్ణానదీ తీరాన 5 క్షేత్రాలలో స్వయంభువుగా అవతరించాడు.


ఈ పంచ నారసింహ క్షేత్రాలలో మంగళగిరి ఒకటి. ఇక్కడి నారసింహుడిని ‘పానకాలయ్య’ అని భక్తులు పిలుచుకుంటారు. ఇక.. మిగిలిన నాలుగు నృసింహ క్షేత్రాలైన వేదాద్రిలో స్నానాలయ్యగా, మట్టపల్లిలో అన్నాలయ్యగా, వాడపల్లిలో దీపాలయ్యగా, కేతవరంలో వజ్రాలయ్యగా నారసింహుడు పూజలందుకుంటున్నాడు.

స్థల పురాణం ప్రకారం.. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండపైన వున్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద వున్న గండాల నరసింహస్వామి ఆలయం. వీటిలో కొండ దిగువన వున్న శ్రీ లక్ష్మీ సమేత నరసింహస్వామి ఆలయాన్ని ఇక్కడి కొచ్చే భక్తులంతా దర్శించుకుంటారు.


హిరణ్యకశిపుని వధానంతరం రౌద్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి ముల్లోకాలూ వణికిపోయి, ఆయనను శాంతించమని ఎంత ప్రార్థించినా లాభం లేకపోయింది. దీంతో శ్రీ మహాలక్ష్మి ఈ క్షేత్రానికి వచ్చి.. తపస్సు చేసి స్వామికి అమృతాన్ని నైవేద్యంగా సమర్పించగా, దానిని స్వీకరించిన స్వామి మంగళాద్రిపై పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా కొలువయ్యారు. ఈ స్వామికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవునెయ్యిని, ద్వాపర యుగంలో ఆవుపాలను ప్రసాదంగా సమర్పించగా, కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు.

పానకాలస్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరచిన నోటితో దర్శన మిస్తుంది. స్వామి వారికి 108 సాలిగ్రామాలతో చేసిన దండ ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. భక్తులు సమర్పించే పానకాన్ని పూజారి ఇక్కడి స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. వెంటనే పానకాన్ని పోయటం ఆపి, మిగిలిన దానిని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. చెంబుతో పోసినా బిందెతో పోసినా.. ఖచ్చితంగా సగం పానకం కాగానే గుటక పడుతుంది. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. ఇంత పానకం ఇక్కడ వినియోగమవుతున్నా, ఇక్కడ ఒక్క చీమ కూడా కనిపించదు.

సర్వ మంగళ స్వరూపిణి, సర్వ శుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతానికి మంగళగిరి అనే పేరొచ్చింది. పానకాలస్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మి ఆలయం ఉంది. దీనికి పక్కగా ఉన్న సొరంగం నుంచే గతంలో మునులు కృష్ణానదికి పోయి స్నానమాచరించి, వచ్చి స్వామిని సేవించేవారని చెబుతారు. ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది.

స్వామి పానకం తాగుతున్నాడా లేదా అని అనుమానం వచ్చిన నాటి అమరావతి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.. తన బావమరిది, శక్తి ఉపాసకులైన యార్లగడ్డ అంకినీడుతో కలిసి కొండపై గల స్వామివారి తెరిచిన నోటిలో తన కుడిచేయి పెట్టారట. చెయ్యి కొంతదూరం వెళ్ళగానే విపరీతమైన బాధ కలిగి తీసి చూడగా, చేతిమీద కండ అనేది లేకుండా ఒట్టి ఎముక కనిపించిందట. అదే సమయంలో అంకినీడు గారికి తేళ్ళు, పాములు కరచినంత బాధ కలిగిందట. దీంతో తన శరీరం స్వామికి ఆహారమైందని, దీంతో తన జన్మ సార్ధకమయిందని భావించిన వెంకటాద్రి నాయడు.. ఈ ఆలయానికి గొప్ప గాలిగోపురాన్ని కట్టించారు. నేటికీ మనం దాన్ని చూడొచ్చు.

కొండ శిఖరానవున్న చిన్న మందిరంలో గండాల నరసింహస్వామి కొలువై ఉంటాడు. తీరని ఆపదలు వచ్చిన భక్తులు, తమ గండాలు గడిచిపోతే అక్కడ నేతితోగానీ, నూనెతోగానీ గండ దీపం పెడతామని మొక్కుకుని, గండం తీరాక.. వచ్చి పెద్ద దీపంలో దీపారాధన చేస్తారు. కొండకిందవున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో వున్న భ్రమరాంబా మల్లికార్జునస్వామి ఆలయంలో మూర్తులను, ద్వాపర యుగంలో పాండవులు ప్రతిష్టించారుట.

ఆలయానికి 4 గాలి గోపురాలున్నాయి. వీటిలో తూర్పు గాలి గోపురాన్ని విజయనగర రాజులు 3 అంతస్తులు నిర్మించగా, దానిపై 1807 – 1809 మధ్యకాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మరో 8 అంతస్తులు నిర్మించారు. 153 అడుగుల ఎత్తున్న ఈ గోపురం వెడల్పు 49 అడుగులు మాత్రమే. వెడల్పు తక్కువగా వుండి చాలా ఎత్తుగావున్న అరుదైన గాలిగోపురంగా ఇది పేరుగాంచింది. ఈ గోపురం కట్టేటప్పుడు అది ఉత్తరం వైపు ఒరిగిపోగా, కంచి శిల్పుల సూచన మేరకు గోపురానికి తూర్పున లోతైన కోనేరు తవ్వించారట. దీంతో ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది. ఆ కోనేరుని చీకటి కోనేరని పిలుస్తారు.

ఫాల్గుణ మాసంలో షష్టి నుంచి 10 రోజుల పాటు ఇక్కడ గొప్ప వేడుక జరుగుతుంది. ఉత్సవాలలో చివరి రోజైన చతుర్దశినాడు శాంత నరసింహస్వామికి, శ్రీదేవి, భూదేవులకు కళ్యాణం జరుగుతుంది. మరునాడు, అంటే పౌర్ణమి రోజు జరిగే రథోత్సవంలో లక్షమంది పైగా ప్రజలు పాల్గొంటారు. రథం తాళ్ళు తాకినా పుణ్యమేనని భావిస్తారు. శ్రీరామ నవమి, హనుమజ్జయంతి, నృసింహ జయంతి, వైకుంఠ ఏకాదశి పండుగలనూ ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×