Poli Padyami 2025: కార్తీక మాసంలో దీపారాధన ఎంత ముఖ్యమో, ఆ మాసం ముగిసిన తర్వాత వచ్చే పోలి పాడ్యమి (దీనినే పోలి స్వర్గం అని కూడా అంటారు) అంతే విశిష్టమైనది. కార్తీక అమావాస్య మరుసటి రోజున.. అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది.. నవంబర్ 21, శుక్రవారం నాడు పోలి పాడ్యమి పర్వదినాన్ని జరుపుకోవాలి. ఇది కార్తీక వ్రతాన్ని పూర్తి చేసి.. ఆ వ్రత ఫలితాన్ని పొందడానికి చివరి, అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణిస్తారు.
పోలి పాడ్యమి విశిష్టత:
పోలి పాడ్యమి అనేది పోలి అనే అసాధారణ భక్తురాలి కథను గుర్తుచేస్తుంది. పోలి నిత్యం కార్తీక మాస దీపాలను వెలిగించినా.. ఆమె అత్తగారు , తోడికోడళ్ళు ఆమెను తక్కువ చేసి, ఆమెకు పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసేవారు. అయినా పోలి ఏ మాత్రం నిరుత్సాహపడకుండా.. పొలంలోని పత్తి చెట్టు నుండి పత్తిని తీసి, కవ్వానికి అంటిన వెన్నతో వత్తిని తయారు చేసి.. దీపం వెలిగించి, దానిపై బుట్ట బోర్లించి దీపారాధన చేసేది.
కార్తీక మాసం పూర్తయిన తర్వాత.. పోలి భక్తికి మెచ్చి, సాక్షాత్తు నారాయణుడే ఆమెను సశరీరంగా స్వర్గానికి తీసుకెళ్లాడని పురాణ గాథ. అందుకే ఈ రోజును పోలి స్వర్గం అని పిలుస్తారు. నియమాలు పాటిస్తూ నిత్యం దీపాలు వెలిగించినా.. ఏదైనా కారణం వల్ల నెల రోజుల దీపారాధన చేయకపోయినా.. ఈ ఒక్క రోజున భక్తి శ్రద్ధలతో దీపాలను వెలిగిస్తే నెల రోజుల కార్తీక వ్రత ఫలితం దక్కుతుందని ప్రగాఢ నమ్మకం. ఈ రోజు అజ్ఞానం తొలగిపోయి, జ్ఞానం, శుభాన్ని ఆహ్వానించడానికి ప్రతీకగా దీపాలను వదులుతారు.
పోలి పాడ్యమి పూజా విధానం:
పోలి పాడ్యమి రోజున పాటించాల్సిన పూజా విధానం చాలా సరళమైంది. కానీ అత్యంత భక్తితో కూడుకుంది.
1. వేకువజామున స్నానం:
బ్రహ్మ ముహూర్తంలో (తెల్లవారుజామున) నిద్ర లేచి, తలస్నానం చేయాలి. అవకాశం ఉంటే.. నది లేదా చెరువులో స్నానం చేయడం శ్రేయస్కరం. స్నానం అనంతరం శుభ్రమైన బట్టలు ధరించాలి.
2. దీపారాధన :
మహిళలు బియ్యపు పిండి లేదా ఆవు నెయ్యితో చేసిన వత్తులను ఉపయోగిస్తారు. సాధారణంగా.. కార్తీక మాసంలోని 30 రోజులకు గుర్తుగా 30 వత్తులు ఒకే దీపంలో వెలిగిస్తారు. అరటి దొప్పలు (చిన్న అరటి ఆకు ముక్కలు) లేదా కొబ్బరి చిప్పలను దీపాలు పెట్టడానికి ఉపయోగిస్తారు.
3. దీపాలను వదలడం (దీపదానం):
దీపాలను నూనెతో లేదా ఆవు నెయ్యితో వెలిగించి.. వాటిని అరటి దొప్పలలో పెట్టి, దగ్గరలోని నది, చెరువు లేదా నీటి కొలనులలో వదలాలి. దీపాలు వదులుతున్నప్పుడు.. గంగాదేవికి నమస్కరించి, దీపాలను మూడు సార్లు చేతులతో ముందుకు తోస్తూ.. కార్తీక వ్రత ఫలితాన్ని కోరుకుంటారు.
Also Read: కార్తీక మాసం చివరి అమావాస్య.. ఇలా చేయకపోతే అన్నీ కష్టాలే !
4. పోలి కథ పఠనం:
దీపాలను వదిలిన తర్వాత.. ఇంట్లో లేదా గుడిలో పోలి కథను వినడం లేదా చదువుకోవడం తప్పనిసరి. కథ పూర్తయిన తర్వాత.. అక్షింతలు తలపై వేసుకుని నమస్కరించుకోవాలి.
5. దాన ధర్మాలు:
ఈ రోజున బ్రాహ్మణులకు.. పేదలకు దీపదానం, వస్త్ర దానం లేదా ఆహార దానం చేయడం వల్ల కార్తీక వ్రత పుణ్యం పరిపూర్ణంగా లభిస్తుందని నమ్ముతారు. పోలి పాడ్యమి రోజున ఈ పద్ధతిని పాటించడం వల్ల కార్తీక మాస వ్రతాన్ని విజయవంతంగా ముగించి.. సకల శుభాలు, సౌభాగ్యాలు, సంతృప్తికరమైన జీవితం పొందుతారని ప్రతీతి.