
Sanatana dharma : ఒకప్పుడు మనదేశంలో సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రజలు.. వందలాది ధార్మిక గురువుల అజమాయిషీలో చిక్కుపోయారు. దీనివల్ల సమాజం చీలికలు పేలికలుగా మారటంతో బాటు ఒకే మతానికి చెందిన వారి మధ్య ఘర్షణలు తరచూ జరుగుతుండేవి. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు మహాపురుషులు ఆయా ధార్మిక విశ్వాసాలను కూలకషంగా పరిశీలించి, వారితో చర్చించి, వారికి సత్యాన్ని బోధ పరచి.. నూతన మతాలను ప్రతిపాదించారు. అవే.. కాలక్రమంలో త్రిమతాలుగా పేరులోకి వచ్చాయి. అవి..
1) అద్వైతం
అద్వైతం అనగా.. రెండు కానిది.(అంటే.. ఒకటే అని అర్థం). ఆత్మ, పరమాత్మ ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. ఆది శంకరాచార్యులు ఈ అద్వైతాన్ని ప్రతిపాదించారు. కేరళలో జన్మించిన ఈయన కాలినడకన కేదార్‌నాధ్ వరకు పాదయాత్ర చేసి.. తన అద్వైతాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే మండన మిశ్రుడి వంటి ఉద్దండులను చర్చలో ఓడించి.. అద్వైతాన్ని దేశవ్యాప్తం చేశారు.
పరమాత్మలోని శుద్ధ చైతన్యమే పామరుడిలోనూ ఉంటుందని ప్రకటించారు. జన్మత: ఎవరూ అధికులు కారనీ, చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, రాజైనా.. వేరువేరుగా కనిపిస్తారనీ.. కానీ.. వారిలోని పరమాత్మ ఒక్కడేనని ఆయన బోధించారు.
కులమతాల కారణంగా విడిపోయిన దేశాన్ని.. అద్వైత భావనతో ఒక్కటి చేసిన మహాపురుషుడిగా, జగద్గురువుగా చరిత్రలో నిలిచిపోయారు. ఈయన అద్వైత సిద్ధాంత ప్రచార నిమిత్తం.. దేశంలోని నాలుగు దిక్కులా నాలుగు (పూరీ, ద్వారక, శృంగేరి,బదరీనాథ్) పీఠాలను స్థాపించారు. ఆయా పీఠాలు నేటికి సనాతనధర్మానికి ప్రతీకలుగా నిలబడ్డాయి.
మనుషులు తనలోనే బ్రహ్మము ఉన్నాడనే విషయాన్ని గ్రహించి.. సాధన ద్వారా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నించాలని అద్వైతం చెబుతుంది.
2) ద్వైతం
అనగా..రెండు. జీవుడు, దేవుడు వేరువేరనే ఈ సిద్ధాంతాన్ని ద్వైతం అంటారు. ఉర్థ్వలోకంలో ఉన్న భగవంతుడు పాపపుణ్యాలను లెక్కకట్టి మరుజన్మ కర్మలను నిర్ణయిస్తాడని ద్వైతం చెబుతుంది. దీనిని మధ్వాచార్యులు ప్రవచించారు. క్రీ.శ 1238లో జన్మించిన మధ్యాచార్యులు పన్నెండవ ఏట సన్యాసం స్వీకరించి, తన జీవితం మొత్తం వేద విజ్ఙాన వ్యాప్తికి పాటుపడ్డారు.
కులాల కంపుతో పతనమైతున్న జాతికి భగవంతని సృష్టిలో అందరూ సమానమే అని చెప్పి, అందరూ తమ పరిధి తెలుసుకుని భగవంతుని శరణు కోరాలని ప్రభోధించారు. ఇతరులకు సేవచేయటం ద్వారానూ పరమాత్మను చేరుకోవచ్చని ద్వైతం ప్రభోధిస్తుంది. కర్ణాటకలోని ఉడుపి తదితర కృష్ణ క్షేత్రాల వారు ద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తారు.
3) విశిష్టాద్వైతం
నీవు(దేవుడు), నేను(జీవి), ప్రకృతి (పంచభూతాలు) అనేవి వేరైనా.. ఇవన్నీ ఒకదానిలో ఒకటి కలిసి, అంతటా వ్యాపించి ఉంటాయని విశిష్టాద్వైతం చెబుతుంది. దీనిని 11వ శతాబ్దిలో రామానుజాచార్యుడు ప్రతిపాదించారు.
‘చిత్’ అనబడే జీవునితోను, ‘అచిత్’ అనబడే ప్రకృతితోను కూడియే పరమాత్మ అయిన నారాయణుడున్నాడని వీరి భావన. శరీరములో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడుంటాడనీ, అజ్ఞానంతో మనిషి తనలోని నారాయణుడిని గుర్తించలేడనీ, కనుక.. సద్గురువును ఆశ్రయించి అజ్ఞానము నుండి విముక్తులై, మరణానంతరము మోక్షము పొందవచ్చని విశిష్టాద్వైతం చెబుతుంది. అలా నారాయణ సాన్నిధ్యము పొందినవారికి మరుజన్మలేదు.