ఉత్తరాఖండ్ లోని మంచుకొండల్లోని బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునఃప్రారంభం రోజున శ్రీమహావిష్ణువు తొలి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు బద్రీనాథ్ చేరుకున్నారు. ఒకవేళ మీరు కూడా బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే, ఇప్పటికే అక్కడికి చేరుకుంటే, త్వరలో మీరు ఆ యాత్ర చేయబోతుంటే మాత్రం ఈ ఆరు విషయాలను అస్సలు మరచిపోవద్దు. బద్రీనాథ్ లో ఈ ఆరు పనులు చేయకుంటే మీ యాత్రకు సార్థకత ఉండదు.
1. తప్త్ కుండ్ స్నానం..
బద్రీనాథ్ ఆలయం సమీపంలో తప్త్ కుండ్ లో స్నానం చేయనిదే యాత్ర పుణ్యఫలం దక్కదంటారు. సహజసిద్ధమైన ఈ తప్తకుండ్ లో నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. ఇక్కడ స్నానం చేస్తే శరీరంతోపాటు మనస్సు కూడా శుద్ధి అవుతుందని చెబుతారు. తప్త్ కుండ్ లో స్నానం చేశాక బద్రీనాథుడి దర్శనం చేసుకుంటారు భక్తులు.
2. మహా అభిషేకం..
బద్రీనాథుడి ఆలయంలో బద్రీనారాయణుడికి ప్రాతఃకాలంలో చేసే మహా అభిషేకం ఎంతో మహిమాన్విత అనుభూతిని కలిగిస్తుంది. అభిషేక సమయంలో స్వామివారిని దర్శించుకోవడంతోపాటు, ఆలయంలో ఉండటం కూడా పుణ్యంగా భావిస్తారు భక్తులు.
3. నీలకంఠ శిఖరంపై ధ్యానం..
బద్రీనాథ్ ఆలయం వెనక ఉన్ నీలకంఠ శిఖరాన్ని దర్శించుకోడానికి భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. సూర్యోదయ సమయంలో ఈ శిఖరం అత్యంత అద్భుతంగా కనపడుతుంది. ఈ వ్యూపాయింట్ పై నిలబడి భక్తులు ఫొటోలు దిగుతుంటారు. ఇక్కడ సూర్యోదయ సమయంలో ధ్యానం చేయడం వల్ల మంచి ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. సూర్యోదయానికి ముందే ఈ నీలకంఠ శిఖరానికి చేరుకుంటారు భక్తులు. అక్కడే యోగముద్రలో కూర్చుని సూర్యోదయాన్ని ఆస్వాదిస్తారు. ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుతారు.
4. మహాభారత గుహలు..
మహాభారత రచన జరిగినట్టు చెబుతున్న వ్యాస, గణేశ గుహలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. మన గ్రామ సమీపంలో ఈ గుహలుంటాయి. ఇక్కడ వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. వేద వ్యాసుడు మహాభారతాన్ని ఇక్కడే రచించాడనడానికి కొన్ని ఆధారాలను కూడా చూపిస్తారు స్థానికులు.
5. భీమ బ్రిడ్జ్..
సరస్వతి నదిపై భీముడు నిర్మించినట్టుగా చెప్పబడే రాళ్ల బ్రిడ్జ్ ఇక్కడి ప్రత్యేకత. ఈ బ్రిడ్జ్ పై నడిచేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తుంటారు. భీముడు నిర్మించిన బ్రిడ్జ్ నేటికీ చెక్కుచెదరకుండా ఉందని అంటారు. సరస్వతి నది నీటిని సేవిస్తే సకల పాపాలు హరించుకుపోతాయని అంటారు.
6. విష్ణు చరణాలు
బద్రీనాథ్ ఆలయ సమీపంలోని కొండపైకి ట్రెక్కింగ్ ద్వారా చేరుకుంటే అక్కడ విష్ణుమూర్తి పాద ముద్రలు కనపడతాయి. వీటినే విష్ణు చరణాలుగా కొలుస్తారు. విష్ణుమూర్తి పాదముద్రల్ని స్వయంగా చూసేందుకు చాలామంది ఆ కొండపైకి చేరుకుంటారు. విష్ణుమూర్తి పాద ముద్రలను పూజిస్తూ ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు.
బద్రీనాథ్ ఆలయంలో బద్రీనారాయణుడి దర్శనంతోపాటు.. చుట్టుపక్కల చూడాల్సినవి, కొలవాల్సినవి, ఆధ్యాత్మిక అనుభూతి చెందాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ఈ ఆరు విషయాలను మీరు మాత్రం గుర్తుంచుకోండి. మీ యాత్ర సమయంలో ఈ ఆరింటిని అస్సలు మిస్ చేసుకోవద్దు.