BigTV English

Story Of Khatu Shyam : బర్బరీకుడి తలపడిన క్షేత్రమే .. ఖాటు ..!

Story Of Khatu Shyam : బర్బరీకుడి తలపడిన క్షేత్రమే .. ఖాటు ..!
Story Of Khatu Shyam

Story Of Khatu Shyam : మహాభారత కాలంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో మహావీరులు పాల్గొన్నారు. వారిలో రాక్షసజాతికి చెందిన బర్బరీకుడు ఒకడు. ఇతనెవరో కాదు.. పాండవులలో రెండవవాడైన భీముని మనుమడు. అంటే.. భీముడు, హిడింబలకు జన్మించిన ఘటోత్కచుని కుమారుడే బర్బరీకుడు. ఇతని తల్లిపేరు.. మౌర్వి.


బర్బరీకుడు బాల్యంనుంచే యుద్ధ విద్యలో అపార ప్రతిభావంతుడిగా పేరుపొందాడు. అస్త్రశస్త్రాలపై ఇతనికి ఉన్న పట్టుచూసిన దేవతలకి.. ఈ బాలుడి మీద ముచ్చట కలిగి.. వారు బర్బరీకుడికి 3 మహాశక్తివంతమైన బాణాలను ప్రసాదిస్తారు. ‘ఈ 3 బాణాలు నీ దగ్గర ఉన్నంతవరకు నీకు పరాజయమే లేదు’ అనే వరాన్నీ ఇస్తారు.

కురుక్షేత్ర యుద్ధం నాటికి బర్బరీకుడు నూనూగు మీసాల వాడిగా ఉన్నాడు. అప్పటికే కర్ణుడి చేతిలో తండ్రి ఘటోత్కచుడు నేలకూలాడు. దీంతో తానూ యుద్ధంలో పొల్గొనేందుకు బయలుదేరతాడు. ‘వీరుడు ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలబడాలి’ అనే తల్లి మాట మేరకు పాండవుల పక్షాన నిలవాలని తన 3 బాణాలను తీసుకుని కురుక్షేత్రానికి బయలుదేరతాడు.


అతడే యుద్ధరంగానికి వస్తే.. పాండవుల ప్రతిజ్ఞలు నెరవేరవని భావించిన శ్రీకృష్ణుడు.. ఒక బ్రాహ్మణుడి రూపంలో యుద్ధానికి బయలుదేరిన బర్బరీకుడికి ఎదురవుతాడు. ‘ ఏంటోయ్..! మహావీరులు పాల్గొంటున్న ఆ యుద్ధానికి ముచ్చటగా 3 బాణాలు తీసుకుని బయలుదేరావా మొనగాడా?’ అని ఎగతాళిగా అడుగుతాడు.

దానికి బర్బీరకుడు తనకు ఈ మూడు బాణాలే చాలనీ, తన మొదటిది.. తన శత్రువును గుర్తిస్తుందనీ, రెండవ బాణం.. మిత్రులను గుర్తిస్తుందనీ, మూడవ బాణం.. శత్రవులను సంహరిస్తుందని.. వాటి శక్తిని వివరిస్తాడు. ‘ ఈ కథలన్నీ పిల్లలకు చెప్పు. నాకు కాదు. నేను చూడందే ఏదీ నమ్మను. నువ్వు చెప్పిందే నిజమైతే.. ఆ కనిపించే రావిచెట్టు మీద పండిపోయిన ఆ ఆకుమీద నీ బాణం వేసి చూపించు’ అంటూ కృష్ణుడు అతడికి రోషం వచ్చేలా మాట్లాడతాడు.

‘సరే చూడు.. అంటూ బర్బరీకుడు దానిమీద బాణం వేయగానే.. ఆ బాణం రెప్పపాటులో కృష్ణుడి కాలిచుట్టూ తిరుగుతుంది. ఇదేంటా అని కృష్ణుడు కాలు తీయగానే ఆ రావిఆకు కనిపిస్తుంది. దీంతో ఇతని శక్తికి బిత్తరపోయిన కృష్ణుడు.. ‘వీడి పరాక్రమం తెలిసి.. ఆ కౌరవులు దారిలోనే వీడి మనసు మార్చి.. తమవైపు తిప్పుకుంటే పాండవులు ఒక్కరోజు కూడా యుద్ధం చేయలేరు’ అనుకొంటాడు.

వెంటనే.. ‘చూడు బర్బరీకా! నువ్వు బలహీనుల తరపున నిలబడి పోరాటం చేయటం మొదలుపెట్టగానే.. నువ్వు నిలబడిన పక్షం బలంగా మారుతుంది. ఆ వెంటనే నువ్వు బలహీనంగా ఉన్న కౌరవుల వైపుకు చేరి పాండవుల మీద యుద్ధానికి దిగుతావు. అప్పుడు మళ్లీ కౌరవులు బలవంతులుగా మారతారు. ఇలా.. నువ్వు యుద్ధంలో అటు, ఇటు నిలబడుతూ పోరాటం చేస్తే.. చివరకు పాండవులు, కౌరవులు ఇద్దరూ చనిపోతారు’ అని వివరిస్తాడు.

ఇదంతా విన్న బర్బరీకుడు ‘ ఓ పండితుడా.. ఇదంతా నిజమే. నేను యుద్ధానికి వెళుతుండగా ఎదురై నాకు మంచి మాట చెప్పావు కనుక… నీకు ఏమైనా కావాలంటే కోరుకో. ఇస్తాను’ అని అడుగుతాడు. దానికి కృష్ణుడు ‘మహాభారత యుద్ధానికి ముందు ఒక మహావీరుడి తలను బలి ఇవ్వాలి. నేను చూసినవారిలో నీకంటే వీరుడు ఎవడూ కనిపించలేదు. కనుక నీ తలను ఇవ్వు’ అని కోరతాడు.

దీంతో వచ్చిన వాడు శ్రీకృష్ణుడేనని అర్థం చేసుకున్న బర్బరీకుడు సంతోషంగా తన తలను ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ.. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేకపోయినా… కనీసం దాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని తెగిపడ్డ తర్వాత తన శిరస్సుకు ప్రసాదించమని కోరగా కృష్ణుడు సరేనంటాడు. అలా.. యుద్ధంలో బలిపూజలో తెగిన బర్బరీకుడి శిరస్సు.. కురుక్షేత్ర యుద్ధం పూర్తయ్యే వరకు అలాగే యుద్ధంలోని ఘట్టాలన్నీ ప్రత్యక్షంగా చూస్తుండిపోతుంది.

నిజానికి బర్బరీకుడు పూర్వజన్మలో ఒక యక్షుడు. శాపం వల్ల బర్బరీకుడిగా జన్మించాడు. అతని శాప విముక్తి చేసేందుకే బర్బరీకుడి తలను కృష్ణుడు బలిగా కోరతాడు. అంతేకాదు.. నాడు బర్బరీకుడు వేసిన బాణం తన కాలిచుట్టూ తిరిగే క్రమంలో తన కాలు బలహీన పడిందనీ, ఆ కాలుకు బాణం తగిలే తాను కూడా చివరలో ప్రాణాలు విడుస్తానని కూడా శ్రీకృష్ణుడికి ముందే తెలిసిపోతుంది.

అలా.. శ్రీకృష్ణుడి వరం కారణంగా నేటికీ రాజస్థాన్‌లోని ఖాటూ అనే ప్రదేశంలో బర్బరీకుడు పూజలందుకుంటూనే ఉన్నాడు. జైపూర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. 1027లో ఈ ప్రాంతాన్ని పాలించే రూప్ సింగ్ చౌహాన్ అనే రాజుకు బర్బరీకుడు కలలో కన్పించి, తన తల ఉన్న ప్రదేశం వివరాలు చెప్పి, రోజూ అక్కడ ఓ ఆవు తన పొదుగు నుంచి పాలను కారుస్తోందని చెప్పాడట. మర్నాడు అక్కడ తవ్వి చూడగా.. ప్రాచీన సాలగ్రామం కనిపించిందనీ, అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్టించారని స్థలపురాణం చెబుతోంది. సాక్షాత్తూ శ్రీకృష్ణుడినే మెప్పించిన ఈ మహావీరుడిని ‘ఖాటూ శ్యామ్ బాబా’ పేరుతో ఏటా.. 40 లక్షలమంది భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×