BigTV English

Story of Poli Swargam : పోలి స్వర్గం విశేషాలు తెలుసా?

Story of Poli Swargam : పోలి స్వర్గం విశేషాలు తెలుసా?
Poli Swargam

Story of Poli Swargam : కార్తికమాసం చివరికి రాగానే తెలుగువారికి పోలి కథ గుర్తుకొస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపం అందించే శుభాలను, పవిత్ర హృదయంతో శివుడిని కార్తీకంలో ఆరాధిస్తే లభించే పుణ్యం ఎలా ఉంటుందో మనకు పోలి స్వర్గానికి వెళ్లే ఘట్టం వివరిస్తుంది. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె కథ ఏమిటో తెలుసుకుందాం.


పూర్వం ఒక గ్రామంలోని ఓ ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారిలో అందరి కంటే చిన్న కోడలి పేరు.. ‘పోలి’. ఆమెకు బాల్యం నుంచే దైవభక్తి ఎక్కువ. ఆమె భక్తి అత్తగారికి కంటగింపుగా ఉండేది. దీంతో కార్తీక మాసంలో మిగిలిన కోడళ్లను తీసుకుని నదీస్నానం చేసి, అక్కడే దీపాలను వెలిగించి వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెట్టి.. తానూ పుణ్యం సంపాదించుకుంటుందో అనే అసూయతో నదీ స్నానానికి వెళ్లేముందే.. ఇంట్లోని నూనె, దీపారాధన సామాగ్రి దాచి వెళ్లేది.

అత్తగారి ధోరణికి బాధపడిన పోలి.. చేసేదేమీ లేక.. పెరట్లో కాసిన పత్తి చెట్టు నుంచి కాసింత పత్తితో ఒత్తిని చేసి, మజ్జిగ చిలికి పక్కనబెట్టిన కవ్వాలని ఉన్న కొద్దిపాటి వెన్నపూసను రాసి దీపాన్ని వెలిగించేది. అత్తగారు చూస్తే ఊరుకోరనే భయంతో ఆ దీపాన్ని బుట్టకింద దాచేది. కార్తీకమాసపు చివరిరోజైన అమావాస్య రోజునా పోలికి చేయలేనంత పనిచెప్పిన అత్తగారు కోడళ్లతో నదీస్నానానికి వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులు పూర్తిచేసి భక్తితో కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.


ఎన్ని అవాంతరాలు వచ్చినా పరమేశ్వరుడిని ఆరాధిస్తున్న పోలిని చూసిన దేవతలకు పోలిని చూసి అపారమైన కరుణ కలిగింది. ఆమెను జీవించి ఉండగానే.. స్వర్గానికి తీసుకెళ్లేందుకు దేవతలంతా బంగారు విమానంతో ఆమె ఇంటికి వచ్చారు. ఇది చూసిన ఆమె అత్తగారు, తోటి కోడళ్లు అది తమ భక్తి ప్రభావమే అనుకుంటారు. కానీ అందులో పోలి ఎక్కి కూర్చోవటం చూసి షాక్ తింటారు. ఎలాగైనా ఆమెకు మోక్షం దక్కకుండా చేయాలని ఎగరబోతున్న విమానం నుంచి ఆమె కాళ్లు పట్టి లాగబోగా, దేవతలు వారిని వారిస్తారు.

నాడు నిష్కల్మషమైన భక్తితో మోక్షాన్ని పొందిన పోలి కథను కార్తీక మాసం చివరి రోజున తెలుగునాట మహిళలంతా గుర్తుచేసుకుంటారు. ఈ రోజున పోలిని తల్చుకుంటూ ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే…. మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

భగవంతుని ఆరాధనలో భక్తి ముఖ్యం తప్ప ఆడంబరాలు కాదని, అహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని, అత్తాకోడళ్ల మధ్య సఖ్యత అవసరమని మనకు పోలి కథ బోధపరుస్తోంది. అందుకే ఏటా కార్తీకమాసపు చివరి రోజున నేటికీ ప్రతి ఇంటా పోలి స్వర్గం కథ వినిపిస్తూనే ఉంది.

Related News

Vastu Tips: వాస్తు ప్రకారం.. ఇంట్లో డబ్బు ఎక్కడ దాచాలి ?

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Big Stories

×