BigTV English

Subrahmanya Sashti : అందరివాడు.. మన స్కందుడు

Subrahmanya Sashti : అందరివాడు.. మన స్కందుడు
Subrahmanya Sashti

Subrahmanya Sashti : ఆది దంపతుల ముద్దుల బిడ్డ, దేవతల సేనాని, తారకాసురుడిని నేలకూల్చిన మహావీరుడు, సకల వేద పారంగతుడు, బ్రహ్మజ్ఞాని.. సుబ్రహ్మణ్యుడు. దేవతల ప్రార్థనపై తారకాసుర సంహారం కోసం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున ఈ భూమ్మీద అవతరించాడు. దీనినే మనం సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము.


కార్తికేయుడి ఆవిర్భావం వెనక ఒక పురాణ గాథ ఉంది. పూర్వం తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి.. శివుని వీర్యానికి జన్మించిన, ఏడేళ్ల వయసులోపు బాలుడి చేతిలోనే తాను మరణించేలా వరాన్ని పొందుతాడు. శివుడు అంటే.. కామాన్ని జయించినవాడు. ఆయన నిరంతరం తనలో తానే రమిస్తూ.. ఆత్మస్థితిలో ఉంటాడు కనుక ఆయనక సంతానమే కలగదని ఆ రాక్షసుడి ధీమా. దీంతో వాడు లోకాలన్నింటినీ గడగడలాడించటం ఆరంభించాడు.

అదే సమయంలో శివపార్వతులు ఏకాంతంలో గడపుతున్నారు. వారి ఆనందకేళి కారణంగా వీరికి కుమారుడు జన్మిస్తే.. వాడు తనకంటే గొప్పవాడవుతాడనే భయంతో ఇంద్రుడు.. అగ్నిని పంపి వారి ఏకాంతాన్ని భంగపరచే ప్రయత్నం చేస్తాడు. శివపార్వతులు సంయోగ సమయంలో అగ్ని వారిని చికాకు పరుస్తాడు. కానీ.. అప్పటికే శివుడు తన తేజస్సు(వీర్యం)ను విడుదల చేయగా.. పార్వతీదేవి ఆ తేజస్సును స్వీకరించమని అగ్నిని ఆదేశిస్తుంది.


అగ్ని దానిని స్వీకరించినా.. దానిని భరించలేక దానిని గంగకు అప్పగించగా, ఆమె కూడా దానిని భరించలేక.. భూమికి అప్పగించింది. ఆ తేజస్సు ధాటికి తట్టుకోలేక భూదేవి దానిని హిమాలయాల్లోని శరవణం అనే రెల్లు(దర్భ) వనంలో విడిచిపెట్టింది. పదునైన ఆ దర్భల నుంచి ఆ తేజస్సు ప్రయాణించే క్రమంలో 6 ముఖాలు గల బాలుడిగా మారింది. ఆ సమయంలో ఆరుగురు కృత్తికా దేవతలు (ఆరుగురు మునిపత్నులు) ఆ బాలుడికి పాలిచ్చి పెంచారు.

ఆరు ముఖాలతో ఉన్నందున ఆ బాలుడు.. షణ్ముఖుడు(ఆర్ముగం)గా, సదా బాలుడిగా కనిపిస్తాడు కనుక కుమారస్వామిగా, కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక కార్తికేయుడిగా, రెల్లుగడ్డిలో జన్మించాడు గనుక శరవణ భవుడిగా, స్కలితమైన రేతస్సునుంచి పుట్టినవాడు గనుక స్కందుడిగా. అద్భుతమైన బ్రహ్మజ్ఞాని గనుక సుబ్రహ్మణ్యుడిగా, వల్లీదేవిని వివాహమాడిన కారణంగా వల్లీశ్వరుడిగా, చేతిలో దండాన్ని ధరిస్తాడు గనుక దండాయుధపాణి(దండపాణి)గా, సాక్షాత్తూ పరమేశ్వరుడికే జ్ఞానబోధ చేసిన కారణంగా గురుగుహ అనే పేర్లతో పూజలందుకుంటాడు. తెలుగువారు సుబ్బారాయుడిగా, తమిళలు మురుగన్, స్వామినాథన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, శక్తివేల్ అనే పేర్లతో స్వామిని కొలుస్తారు.

అలా పెద్దవాడైన సుబ్రహ్మణ్యుడు.. దేవతల సేనానిగా.. యుద్ధంలో తారకాసురుడిని సంహరించి.. లోకాలకు శాంతిని కలిగించాడు. కుమారస్వామి బ్రహ్మజ్ఞాన స్వరూపుడు కాగా దేవేరులలో వల్లీదేవిని కుండలినీ శక్తికి, దేవసేనాదేవిని ఇంద్రియ శక్తులకు ప్రతీకలుగా చెబుతారు. శాఖుడు, విశాఖుడు, నైగమేషుడు, పృష్ఠజుడు అనేవారు సుబ్రహ్మణ్యస్వామి పుత్రులు. తాటాకాది దానవ సంహారానికి రామలక్ష్మణులను వెంట తీసుకుపోయే సమయంలో విశ్వామిత్రుడు.. కుమార స్వామి జన్మవృత్తాంతాన్ని వారికి వివరిస్తాడు.

కార్తికేయుడు కాలస్వరూపుడనీ, ఆయన 6 తలలు ఆరు రుతువులు, 12 చేతులు నెలలని చెబుతారు. స్వామిని సర్పస్వరూపుడు కనుక.. నాగదోషాలున్నవారు స్వామిని ఆరాధిస్తే.. దోషాలు తొలగుతాయి. అలాగే.. సంతానం లేనివారు స్వామిని ఆరాధిస్తే.. సత్సాంతానం కలుగుతుంది. కుమారస్వామి.. సకల దేవగణాలకు సైన్యాధ్యక్షుడు గనుక ఆయనను పూజిస్తే.. శత్రుభయం తొలగిపోతుంది. విజయసిద్ధికి, జ్ఞానలబ్దికై కుమారస్వామిని పూజించే సంప్రదాయం 2 వేల ఏళ్లనాటినుంచే ఉంది. నాటి తమిళసంగం సాహిత్యంలో, తంత్రశాస్త్రంలోనూ ఆయన ప్రస్తావన కనిపిస్తుంది. తమిళనాట ప్రతి గ్రామంలోనూ స్వామి కోవెల కనిపిస్తుంది.

ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామిని దర్శించుకున్నా, మనసులో స్మరించినా ఆయన అనుగ్రహం తప్పక సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య షష్ఠికి ముందురోజు (పంచమి) రోజంతా స్వామికి ఉపవాసం ఉండి షష్ఠి తిథి నాడు.. బాల వటువులను స్వామి అవతారంగా భావించి భోజన తాంబూలాదులు అర్పిస్తారు. ఈ రోజు ఆలయాల్లో స్వామికి ఆవుపాలు, తేనెతో అభిషేకం చేయటం, సర్ప సూక్తాన్ని పఠించటం వల్ల అవివాహితులకు వివాహం, చర్మవ్యాధులున్న వారికి ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

కుమారస్వామి సైన్యసమేతంగా తారకాసురునిపై దండెత్తే సమయంలో ఆరు చోట్ల విడిది చేసినవే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి.. తిరుప్పర కుండ్రం, తిరుచెందూరు, పళని, తిరుత్తణి, పళముదిర్‌ ‌చోళై, స్వామిమలై. వీటిని తమిళంలో ‘పడైవీడుగళ్‌’ అం‌టారు. తెలుగునాట మోపిదేవి, బిక్కవోలు, రామకుప్పం, పరకాల, మంగళిగిరి శివారులోని నవులూరు, నాగుల మడకలో ప్రసిద్ధ కార్తికేయ ఆలయాలు ఉన్నాయి.

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×