Arshdeep Singh : ఇన్నాళ్లూ తన ప్రతిభను ఎక్కడ పెట్టాడో తెలీదు కానీ, ఒకొక్కసారి అది బయటకు వచ్చి, క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరుస్తుంటుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో ఆఖరి మ్యాచ్ లో ఆఖరి ఓవర్ బౌలింగ్ చేసి, మ్యాచ్ ను గెలిపించిన అర్షదీప్ మళ్లీ సౌతాఫ్రికా గడ్డపై తన పేరు వినిపించాడు.
తొలి వన్డే మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికా గడ్డపై వన్డేల్లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత్ పేస్ బౌలర్ గా రికార్డులకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్ లోనే వరుస బాల్స్ లో రెండు వికెట్లు తీసి సౌతాఫ్రికాను డిఫెన్స్ లోకి నెట్టేశాడు. ఇంక అక్కడ నుంచి సౌతాఫ్రికా మళ్లీ కోలుకోలేదు.
ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో భారత్ స్పిన్నర్లే ఐదు వికెట్ల ప్రదర్శన చేశారు. వారిలో యుజ్వేంద్ర చాహల్ , రవీంద్ర జడేజా, సునీల్ జోషీ ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే అర్షదీప్ సింగ్ నాలుగో బౌలర్ గా నిలిచాడు.
ఇవే కాకుండా పలు రికార్డులు మ్యాచ్ లో చోటు చేసుకున్నాయి. అర్షదీప్ సింగ్ 5 వికెట్లు తీస్తే, తనతో పాటు ఆవేశ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. ఇలా ఒక మ్యాచ్ లో పేసర్లు 9 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2013లో 8 వికెట్లు, 1993లో మొహలీలో 8 వికెట్లు పేసర్లు తీశారు. మళ్లీ ఇప్పుడు 9 వికెట్లు తీసి ఇద్దరూ కొత్త రికార్డు నమోదు చేశారు.
వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికాకు సొంతగడ్డపై ఇదే అత్యల్ప స్కోర్ కావడం విశేషం. 2018లో సఫారీ గడ్డపై ఇదే భారత జట్టుతో 118 పరుగులకు ఆలౌటైన సౌతాఫ్రికా.. తాజా మ్యాచ్‌లో 116 పరుగులకే కుప్పకూలింది.
ఓవరాల్‌గా చూస్తే 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 69 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇదే ఆ జట్టు అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇలా ఇప్పటివరకు సౌతాఫ్రికా పదిసార్లు అత్యల్పస్కోరుకి ఆలౌట్ అయ్యింది. వన్డే వరల్డ్ కప్ లో కెప్టెన్సీ వైఫల్యమని చెప్పి కెప్టెన్ బవుమాను తప్పించి మార్ క్రమ్ కి అప్పగించారు.
జట్టులో 11మంది ఆడితేనే గెలుస్తారు కానీ, కెప్టెన్ వల్ల కాదనేది క్రికెట్ సౌతాఫ్రికా ఎప్పుడు తెలుసుకుంటుందోనని నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.