BigTV English

Kaleshwaram Temple : కమనీయ శైవక్షేత్రం.. కాళేశ్వరం..!

Kaleshwaram Temple : కమనీయ శైవక్షేత్రం.. కాళేశ్వరం..!

Kaleshwaram Temple : తెలంగాణలోని అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన శైవక్షేత్రాల్లో కాళేశ్వరం ఒకటి. ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలంలో ఉంది. మహాదేవపూర్‌ మండలానికి 16 కి.మీ దూరాన, మహారాష్ట్ర సరిహద్దున ‘సిరొంచ’ తాలూకాకు 4 కి.మీ దూరాన ఈ క్షేత్రం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రవహించే గోదావరికి ఇవతలి ఒడ్డున కాళేశ్వరం, ఆవలి ఒడ్డున ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర సరిహద్దులుంటాయి.


కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మధ్య ప్రాంతాన్నే త్రిలింగ దేశమని పిలుస్తారు. అత్యంత ప్రాచీన క్షేత్రంగా భావించే కాళేశ్వరానికి అనేక ప్రత్యేకతలున్నాయి. పూర్వం కాళుడు (యముడు) ఇక్కడ పరమశివుని గురించి ఘోర తపస్సు చేసి స్వామిని ప్రత్యక్షం చేసుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. స్కాందపురాణంలో సూత మహర్షి శౌనకాది మునులకు ఈ క్షేత్ర మహిమను వివరించాడు.

సాధారణంగా పానవట్టం మీద ఒకే శివలింగం ఉంటుంది. కానీ కాళేశ్వరంలోఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండటం విశేషం. అలాగే.. ఇక్కడి ఆలయానికి నాలుగు దిక్కులా 4 నంది విగ్రహాలతో బాటు 4 ధ్వజస్తంభాలు, 4 గోపురాలుంటాయి. ఇక్కడి ఆలయంలోని శివలింగాల్లో ఒకటి కాళేశ్వర లింగం, రెండవది ముక్తీశ్వర (యముడు) లింగం. ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి. ఆ రంధ్రాలలో ఎంత నీరు పోసినా ఆ నీరంతా త్రివేణిసంగమంలో కలుస్తుందట. ఒకప్పుడు గోవిందరావు అనే కలెక్టరు వీటి రహస్యాన్ని కనిపెట్టేందుకు 1000 బిందెల పాలు ఈ నాశికారంధ్రాలలో పోయగా, ఆ పాలన్నీ.. త్రివేణీసంగమతీరంలో కనిపించాయని గ్రామస్థులు చెబుతుంటారు.


ఈ క్షేత్రంలో అమ్మవారు శుభానందాదేవి పేరుతో పూజలందుకుంటోంది. గౌతమీ అభీష్టం, ముక్తీశ్వరుని ఆదేశాల మేరకు సాక్షాత్ కాశీ అన్నపూర్ణాదేవియే ఇక్కడ శుభానందాదేవిగా వెలిసింది. శివునికి ఎడమవైపు, బంగారు రంగులో తాంబూలం నములుతూ అటు పరమేశ్వరుడిని, ఇటు తనను దర్శించే భక్తులను చూస్తున్నట్లుగా అమ్మవారు దర్శనమిస్తుంది.

కాళేశ్వర గర్భాలయానికి నాలుగువైపులా ద్వారాలున్నాయి. కాళేశ్వరం గాక.. గర్భాలయాలకు ఇలా 4 వైపులా ద్వారాలున్న దేవాలయాలు కాశీలోని విశ్వనాథ ఆలయం, నేపాల్‌లోని పశుపతినాథ ఆలయం మాత్రమే. అలాగే.. బాసరలోని జ్ఞాన సరస్వతి, కశ్మీర్‌లో బాల సరస్వతి ఆలయాలకు ఎంత పేరుందో.. మూడవదైన కాళేశ్వరంలోని మహా సరస్వతి ఆలయానికీ అంతే చరిత్ర ఉంది. ఈ మూడు సరస్వతి మూర్తులను సాక్షాత్ ఆది శంకరులే స్వహస్తాలతో ప్రతిష్ఠించారని ప్రతీతి.

ఇక్కడ ముందుగా కాళేశ్వరుని, తర్వాత ముక్తీశ్వరుని పూజిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఆలయానికి పడమర వైపున్న యమగుండం నుండి కిలోమీటర్ దూరంలో దట్టమైన అడవిలో ‘ఆదిముక్తీశ్వరాలయం’ ఉంది. దీనిచుట్టూ నేటికీ విభూతి రాళ్లు లభించడం విశేషం. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఉండే యమకోణం నుంచి.. దిక్సూచిని అనుసరించి.. బయటికి నడవటం వల్ల యమ దోషం పోతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడి గోదావరి త్రివేణి సంగమంలో నిత్యం పితృతర్పణాలు జరుగుతాయి. ఇక్కడ పితృతర్పణం చేస్తే కాశీలో చేసినట్లే అని పండితులు మాట.

రుద్రదేవుడి పాలనా కాలం నుంచి రెండో ప్రతాపరుద్రుడి (క్రీ.శ. 1158 – క్రీ.శ 1323) వరకు సుమారు 165 ఏళ్ల పాటు కాళేశ్వరం కాకతీయ పాలకుల ఆదరణను పొందినట్లు శాసనాలను బట్టి తెలుస్తోంది. క్రీ.శ. 1310లో ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కాఫిర్, క్రీ.శ.1323లో ఢిల్లీ సుల్తాన్ ఘియాసుద్దీన్ తుగ్లక్ ఆదేశంతో అతని కుమారుడు, సైన్యాధిపతి ఉలఘ్‌ఖాన్‌లు ఈ ఆలయాన్ని లూటీ చేసి నేలమట్టం చేశారు. ఆ తర్వాత 650 ఏళ్లకు ఈ ఆలయం చీకటిలో మగ్గింది. 1972లో శృంగేరి పీఠాధిపతుల చొరవతో ఈ క్షేత్రం తిరిగి పూర్వ వైభవాన్ని పొందింది.

పురావస్తుశాఖవారి తవ్వకాల్లో ఇక్కడ బయటపడిన బౌద్ధవిహారాల గోడలు, పునాదులు, మహాస్తూపాలు, బుద్ధుడి కంచు విగ్రహాలను బట్టి ఈ ప్రాంతంలో ఒకప్పుడు బౌద్ధం విలసిల్లినట్లు తెలుస్తోంది. మహాశివరాత్రి రోజు కాళేశ్వరంలో జరిగే ముక్తేశ్వర, శుభానందా దేవి కళ్యాణోత్సవానికి వేలాది మంది భక్తులు.. తెలంగాణతో బాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దు ప్రాంతాల నుంచీ తరలి వస్తారు. వరంగల్ నుంచి 120 కి.మీ దూరంలోని ఈ కాళేశ్వరం వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. అక్కడ బస చేసేందుకు పలు వసతి గృహాలున్నాయి.

Related News

Ganesh Chathurthi 2025: మొదటి సారి ఇంట్లో వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారా ? ఈ నియమాలు తప్పనిసరి !

Ganesh Puja: గణపతి పూజలో.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆశీర్వాదాలకు దూరమే!

Sri Padmavathi Ammavari Temple: శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు.. రూ.750 చెల్లిస్తే ఆ సేవలు

Lord Vinayaka – Moon: చంద్రుడు నవ్వినందుకే చవితి శాపమా? అసలు శాస్త్రీయ కారణం ఇదే!

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చే.. ముందు వీటిని అస్సలు ఇంట్లో ఉంచొద్దు

Diwal 2025 Telugu Calendar: తెలుగు క్యాలెండర్ ప్రకారం దీపావళి ఎప్పుడో తెలుసా.. కరెక్ట్ డేట్ ఇదే

Big Stories

×