Tirumala: తిరుమలలో అత్యంత విశిష్టమైన సేవ జరుగుతుంది అయితే భక్తులకు మాత్రం ఈ సేవకు ఎంట్రీ ఉండదట. ఇంతకీ ఆ సేవ ఏంటి..? ఎప్పుడు జరుగుతుంది. భక్తులకు ఎందుకు ఎంట్రీ ఉండదు లాంటి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో రకాల సేవలు జరుగుతూనే ఉంటాయి. ఆయా సేవలకు భక్తలను కూడా అనుమతిస్తుంటారు. అయితే తిరుమలలో స్వామి వారికి జరిగే ఒక సేవ మాత్రం చాలా గోప్యంగా జరుగుతుందట. ఆ సేవకు భక్తులెవ్వరినీ అనుమతించరట. ఇంతకీ ఆ సేవ ఏంటో తెలుసా..? ఆ సేవకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా..? అదే కొలువు సేవ దీనినే దర్భార్ అని కూడా పిలుస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ తెల్లవారుజామున జరిగే అత్యంత విశిష్టమైన ఈ సేవకే భక్తులను అనుమతించరట.
శ్రీవారి ఆలయంలో ఉన్న ఐదు విగ్రహ రూపాలలో (పంచబేరాలు) ఒకరైన కొలువు శ్రీనివాసమూర్తికి (బలి బేరం) ఈ సేవను నిర్వహిస్తారు. ఈ మూర్తిని ఆలయ పరిపాలనాధికారిగా భావిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున సుమారు 4 గంటల 30 నిమిషాలకు తోమాల సేవ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. బంగారు వాకిలి లోపల ఉన్న స్నపన మండపంలో (తిరుమామణి మండపం) ఈ సేవ నిర్వహిస్తారు.
ఇది పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. ఇందులో కేవలం అర్చకులు, ఆలయ అధికారులు మాత్రమే పాల్గొంటారు, భక్తులకు అనుమతి ఉండదు. ఈ సేవ ఒక రాజు తన కొలువులో కూర్చుని రాజ్య విశేషాలు తెలుసుకున్నట్లుగా సాగుతుంది. స్వామివారిని బంగారు గొడుగు కింద, వెండి సింహాసనంపై కూర్చోబెడతారు. ఈ సమయంలో ఆలవట్టం (విసనకర్ర) విసురుతూ రాజోపచారాలు చేస్తారు.
ఆలయ ఆస్థాన సిద్ధాంతి ఆరోజు ఉన్న తిథి, వార, నక్షత్ర విశేషాలను, గ్రహ సంచారాన్ని స్వామివారికి వినిపిస్తారు. ఆదాయ నివేదన (బొక్కసం వివరాలు) క్రితం రోజున శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన ఆదాయాన్ని (డబ్బు, బంగారం, వెండి నాణేల వివరాలు) అధికారులు స్వామివారికి చదివి వినిపిస్తారు.
వేదాలను, ప్రబంధాలను పఠించిన అర్చకులకు బియ్యం, బెల్లం, తాంబూలం వంటివి దానంగా ఇస్తారు. దీనినే ‘తాండుల దానం’ అంటారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని “నిత్యైశ్వర్యోభవ” (ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతుడివై ఉండు) అని దీవిస్తారు.
ఈ సందర్భంగా స్వామి వారికి వేయించిన నువ్వులు, బెల్లం కలిపి దంచిన పిండిని (చిమ్మిలి) స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు అర్చకులు. శ్రీ వేంకటేశ్వర స్వామిని ఈ కలియుగ ప్రత్యక్ష దైవంగా, ఈ సృష్టికి అధిపతిగా భావిస్తారు. అందువల్ల ఆయన క్షేత్రంలో జరిగే ప్రతి పైసా ఖర్చు మరియు ఆదాయం ఆయన అనుమతితో, ఆయన సాక్షిగా జరగాలనే సంప్రదాయమే ఈ కొలువు సేవ
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.