హిందూమతంలో రక్షా బంధన్ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్కా చెల్లెళ్లు, తమ అన్నదమ్ములకు రక్షా దారాన్ని కట్టి శుభాశీస్సులు అందిస్తారు. ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. రాఖీ పండుగను శ్రావణమాసం పౌర్ణమి నాడు నిర్వహించుకుంటాము. అయితే ఆగస్టు 9న రాఖీ కట్టేందుకు శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
భద్ర కాలం ఉందా?
రాఖీ కట్టేందుకు ముందు ఆరోజు భద్రకాలం ఉందో లేదో తెలుసుకోవాలి. భద్రకాలంలో రాఖీని కట్టడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. కానీ అదృష్టం కొద్దీ ఈసారి రాఖీ పండుగ నాడు భద్రకాలం లేదు. భద్రకాలము ఉదయమే ముగుస్తోంది. కాబట్టి ఆ రోజున ఎప్పుడైనా రాఖీని కట్టవచ్చు. అయితే ఆరోజు శ్రావణ పౌర్ణమి ఎంతవరకు ఉందో కూడా తెలుసుకోవాలి. శ్రావణ పౌర్ణమి ముందు రోజే అంటే ఆగస్టు ఎనిమిదినే ప్రారంభమవుతుంది. మరుసటి రోజు ఆగస్టు 9న మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు మాత్రమే శ్రావణ పౌర్ణమి ఉంటుంది. అంటే ఆగస్టు 9న మీరు మధ్యాహ్నం ఒంటి గంటన్నరలోపే రాఖీని కట్టాలి.
పౌర్ణమి తిథి ఎప్పుడు?
ఆగస్టు 8న మధ్యాహ్నం రెండు 12 గంటలకు శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి తిథి మొదలవుతుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 9న మధ్యాహ్నం 1:24 నిమిషాలకు ముగుస్తుంది. భద్రకాలం ఆగస్టు 9వ తారీఖున తెల్లవారుజామున 1:52 వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఆగస్టు 9న ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:24 నిమిషాల లోపు ఎప్పుడైనా మీ అన్నదమ్ములకు రాఖీని కట్టవచ్చు. ఆ సమయం అంతా కూడా శుభముహూర్తమే.
భద్ర కాలంలో ఎందుకు కట్టకూడదు?
భద్రకాలంలో రాఖీ కట్టడం మంచి పద్ధతి కాదు. భద్రకాలాన్ని ముహూర్త శాస్త్రాలలో అశుభంగా భావిస్తారు. పంచాంగం ప్రకారం ఈసారి భద్రకాలం తెల్లవారుజామునే ముగిసిపోతుంది. కాబట్టి ఇలాంటి సమస్య లేదు. ఆగస్టు 9న ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర లోపు ఎప్పుడైనా రాఖీని కట్టవచ్చు.
ఈ రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ప్రేమకు, నమ్మకానికి సంబంధించిన వేడుక. ఈ పండుగ నాడు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ల మధ్య నమ్మకం, బంధం, అనురాగం మరింతగా పెరుగుతుంది. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు… అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధాన్ని ప్రతిబింబించే వేడుక. అందుకే ఈరోజున అన్నదమ్ములు తమ అక్కచెల్లెళ్లకు ప్రత్యేకమైన బహుమతులను అందిస్తారు. ఇక అక్కా చెల్లెలు ప్రేమతో కూడిన తీపి వంటకాలను అన్నదమ్ములకు తినిపిస్తారు. మీరు కూడా ఈ రాఖీ పండుగ వేడుకను చేసుకునేందుకు సిద్ధం అవ్వండి.