Walking: బిజీ లైఫ్ స్టైల్‌లో వ్యాయామం కోసం గంటల పాటు సమయం కేటాయించడం చాలా మందికి సాధ్యం కాదు. కానీ ప్రతి రోజు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇదిలా ఉంటే కేవలం డైలీ 20 నిమిషాలు వేగంగా నడవడం వల్ల మీ జీవితాన్ని రక్షించుకోవచ్చు. అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో కూడా వాకింగ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఖర్చు లేకుండా ఎక్కడైనా చేయగలిగే ఈ చిన్న శారీరక శ్రమ మీ దీర్ఘాయువుకు ఒక శక్తివంతం అయిన సాధనం అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. డైలీ 20 నిమిషాలు నడవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డైలీ 20 నిమిషాలు నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండెకు రక్ష కవచం:
ప్రతిరోజూ 20 నిమిషాలు నడవడం వల్ల గుండె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుంది. ఇది గుండె కండరాన్ని బలోపేతం చేసి, రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. క్రమం తప్పకుండా నడవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని ఫలితంగా.. గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం 30 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
అకాల మరణాల ప్రమాదం తగ్గింపు:
రోజువారీ 20 నిమిషాల చురుకైన నడక శారీరకంగా “నిష్క్రియంగా” ఉన్నవారిని “మితంగా చురుకైన” సమూహంలోకి మారుస్తుంది. పరిశోధనల ప్రకారం, నిత్యం ఈ మాత్రం శ్రమ చేయడం వలన అకాల మరణాల ప్రమాదం 16 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. స్థూలకాయం ఉన్నవారికి కూడా వాకింగ్ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు తెలిపాయి. అంటే.. బరువు ఎంత ఉన్నా, కొద్దిపాటి నడకతో మీ ఆయుష్షు పెరుగుతుంది.
శారీరక, మానసిక ప్రయోజనాలు:
కేవలం 20 నిమిషాల నడక వల్ల కలిగే ఇతర అద్భుతమైన ప్రయోజనాలు:
బరువు నియంత్రణ: ఈ కొద్దిపాటి వాకింగ్ కూడా రోజుకు 90 నుంచి 110 కేలరీలను ఖర్చు చేస్తుంది. క్రమంగా.. ఇది బరువు అదుపులో ఉండటానికి, జీవక్రియ మెరుగుపడటానికి సహాయ పడుతుంది.
మధుమేహం అదుపు: నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, టైప్- 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: ధన త్రయోదశి రోజు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే.. సంపద వర్షం
కీళ్ల బలం: నడక కీళ్లకు సరళతను అందించి, ఎముకలు, కండరాలు బలంగా ఉండేలా చేస్తుంది. వృద్ధులలో బ్యాలెన్సింగ్‌ను పెంచి.. కిందపడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మానసిక ఆరోగ్యం: నడుస్తున్నప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుతుంది. నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది.
మీరు ఒక గంట వ్యాయామం చేయలేకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ రోజులో కేవలం 20 నిమిషాలను వేగంగా నడవడం కోసం కేటాయించండి. ఇది కేవలం వ్యాయామం కాదు.. మీ జీవితకాలంలో పెట్టుబడి. ఆ చిన్నపాటి అడుగులు మీకు మెరుగైన ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన మనసును, ఎక్కువ కాలం జీవించే అవకాశాన్ని ఇస్తాయి.