హిందూమతంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించకూడదు అన్నది. ఇప్పటికీ దీన్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. అసలు ఉత్తరం వైపు తలపెట్టి ఎందుకు నిద్రించకూడదో ఎంతమందికి తెలుసు? కొంతమంది పెద్దవారికి తప్ప. చాలామందికి దీని వెనుక ఉన్న అసలు విషయం తెలియదు. ప్రాచీన భారతీయ శాస్త్రాలు చెబుతున్న ప్రకారం నిద్ర అనేది విశ్రాంతిని అందించడమే కాదు.. మన శరీరం, మనసు, భూ అయస్కాంత క్షేత్రం అన్ని సమతుల్యం చేయడానికి నిద్ర అనేది ముఖ్యమైన సాధనంగా చెప్పుకుంటారు. ఇక తల పెట్టుకునే దిశ అత్యంత ముఖ్యమైనదిగా అంటారు. అందుకే నిద్రపోతున్నప్పుడు ఒక వ్యక్తి తల దక్షిణ దశలో ఉండాలని నమ్ముతారు.
ఇది అసలు విషయం
తల దక్షిణం వైపు పెట్టుకొని ఉంటే మనిషి శరీరం భూ అయస్కాంత క్షేత్రానికి అనుగుణంగా ఉంటుందని శాస్త్రాలు నమ్ముతాయి. భూ అయస్కాంత క్షేత్రం ఉత్తరం నుండి దక్షిణం వైపుగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పడుకుంటే శరీరం సొంత అయస్కాంత క్షేత్రంలో శక్తి ప్రవాహానికి వీలు కల్పిస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ, హృదయ లయలు స్థిరంగా ఉంటాయి. ఎంతోమంది సాంప్రదాయ వైద్యులు కూడా ఉత్తరం వైపు తలపెట్టకుండా దక్షిణం వైపు పెట్టుకోమని సూచిస్తారు. ఇది మెదడుకు కూడా ఎంతో మంచిదని అంటారు.
వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
వాస్తు శాస్త్రం, ఆయుర్వేదం కూడా ఇదే విషయాన్ని ఒప్పుకుంటున్నాయి. వాస్తు ప్రకారం దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవడం వల్ల ఆ నిద్ర స్థిరంగా ఎక్కువ సేపు మెలకువ రాకుండా ఉంటుంది. అలాగే దీర్ఘాయువును కూడా అందిస్తుంది. అదే ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతే ప్రశాంతంగా నిద్ర పట్టదు. ఒత్తిడిగా అనిపిస్తుంది. గుండెపై ఆ ఒత్తిడి ఉన్నట్టు భావన కలుగుతుంది. దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోతే నాడీ వ్యవస్థ అంతటా సమతుల్యతా, ప్రశాంతత ప్రవహిస్తుందని నమ్ముతారు.
దేవతల దిశ ఇది
ఇక హిందూ సంప్రదాయంలో ఉత్తరదిక్కును దేవతల దిశగా చెప్పుకుంటారు. ఈ దశలో తలపెట్టి నిద్రపోవడం దేవతలను అగౌరవపరచడమేనని అంటారు. అలాగే మరణించిన వారి తలను ఉత్తర దశలో పెడతారని కొన్ని నమ్మకాలు ఉన్నాయి. అందుకే జీవించి ఉన్నవారు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోవడం మంచిది కాదని అంటారు. తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవచ్చని సూచిస్తారు. దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే మంచి నిద్ర పట్టడమే కాదు.. పాజిటివ్ ఎనర్జీ కూడా లభిస్తుందని నమ్ముతారు. అలాగే మానసిక ఆరోగ్యానికి కూడా దక్షిణం వైపు తలపెట్టి పడుకోవడం ఎంతో ఉత్తమమైనదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీలైనంత వరకు దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు గదులు దక్షిణం వైపు తలపెట్టి నిద్రపోయేందుకు వీలుగా ఉండవు. అలాంటి సమయంలో తూర్పు వైపు తలపెట్టి నిద్రపోండి. అంతే తప్ప ఉత్తరం వైపు మాత్రం నిద్రపోవడానికి సాహసించకండి. దీనివల్ల నిద్రకు భంగం కలగడమే కాదు తలనొప్పి, రక్త పపోటు పెరగడం వంటివి కూడా జరుగుతాయి.