Hanuman Chalisa: హనుమాన్ చాలీసా అనేది 16వ శతాబ్దంలో మహా కవి తులసీదాస్ గారు రచించిన అత్యంత శక్తి వంతమైన స్తోత్రం. హనుమంతుని శౌర్యాన్ని, భక్తిని, గుణ గణాలను కీర్తించే ఈ 40 పద్యాలను ప్రతి రోజూ పఠించడం వల్ల కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా.. మానసిక, శారీరక ప్రయోజనాలు కూడా చేకూరుతాయని భక్తుల నమ్మకం. ప్రతి రోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కలిగే అద్భుతమైన మార్పులు జరుగుతాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. భయం, ఆందోళనల నుంచి విముక్తి:
హనుమాన్ చాలీసాలోని ఒక ప్రసిద్ధ పంక్తి: “భూత పిశాచ నికట నహి ఆవై | మహావీర జబ నామ సునావై”. దీని అర్థం హనుమంతుని నామాన్ని స్మరిస్తే ఎలాంటి ప్రతి కూల శక్తులు, భయాలు దరిచేరవు. మీరు మానసిక ఆందోళనతో లేదా తెలియని భయంతో బాధపడుతుంటే.. చాలీసా పఠనం మీ మనస్సుకు ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ఇస్తుంది.
2. శని దోష నివారణ:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని ప్రభావం (ఏల్నాటి శని లేదా అర్ధాష్టమ శని) వల్ల ఇబ్బందులు పడేవారు హనుమంతుడిని ఆరాధించడం శ్రేయస్కరం. రావణాసురుడి బందీగా ఉన్న శని దేవుడిని హనుమంతుడు రక్షించినప్పుడు.. “ఎవరైతే నిన్ను పూజిస్తారో వారిని నేను ఇబ్బంది పెట్టను” అని శని దేవుడు మాట ఇచ్చాడట. అందుకే ప్రతి రోజూ చాలీసా చదవడం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది.
3. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత:
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం. హనుమాన్ చాలీసాను శ్రద్ధగా పఠించడం వల్ల మెదడులో సానుకూల తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇది విద్యార్థులలో ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా.. ఉదయాన్నే చదవడం వల్ల రోజంతా ఉత్సాహంగా.. ప్రశాంతంగా గడిపే శక్తి లభిస్తుంది.
4. ఆత్మవిశ్వాసం పెరగడం:
హనుమంతుడు అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసిన “సంకట మోచనుడు”. ఆయన స్తోత్రాన్ని పఠించడం వల్ల మనలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఎదురయ్యే సందిగ్ధత తొలగిపోతుంది.
5. పాప విముక్తి, ఆరోగ్య ప్రాప్తి:
మనం తెలిసో తెలియకో చేసే చిన్న చిన్న తప్పుల నుంచి విముక్తి పొందేందుకు హనుమాన్ చాలీసాలోని ప్రారంభ శ్లోకాలు సహాయ పడతాయి. అలాగే.. “నాసై రోగ హరై సబ పీరా | జపత నిరంతర హనుమత బీరా” అన్నట్లుగా. అనారోగ్యంతో బాధ పడేవారు నిరంతరం హనుమన్నామ స్మరణ చేయడం వల్ల శారీరక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
ఎలా పఠించాలి ?
హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే.. ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది.
సమయం: ఉదయం స్నానం చేసిన తర్వాత లేదా సాయంత్రం వేళల్లో చదవడం ఉత్తమం.
శుభ్రత: శారీరక శుభ్రతతో పాటు.. మనస్సును కూడా దైవ చింతనతో ఉంచుకోవాలి.
Also Read: ఇంటి ఈశాన్య దిశలో ఏం ఉంచాలి ? ఏం ఉంచకూడదో తెలుసా ?
ఆసనం: వీలైతే ఒక ఎర్రటి ఆసనం మీద కూర్చుని పఠించండి.
సంఖ్య: ప్రతిరోజూ ఒకసారి చదవచ్చు. కానీ ఏదైనా ప్రత్యేక కోరిక ఉన్నవారు 11, 21 లేదా 100 సార్లు పఠించడం విశేషం.
హనుమాన్ చాలీసా కేవలం ఒక మత పరమైన ప్రార్థన మాత్రమే కాదు. అది ఒక శక్తి వంతమైన ధ్యాన ప్రక్రియ. ఇది వ్యక్తిలోని అంతర్గత భయాన్ని తొలగించి.. అపార మైన ధైర్యాన్ని నింపుతుంది. క్రమం తప్పకుండా పఠించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులను మీరు గమనించవచ్చు.