Bhagavad Gita: సమస్త సృష్టికి మూలకారకుడు, ప్రేమ స్వరూపుడు శ్రీకృష్ణుడు. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అయినా.. తన భక్తుల పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన వాత్సల్యం ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు “ఎవరైతే నన్ను అనన్య భక్తితో కొలుస్తారో.. వారి యోగ క్షేమాలను నేను స్వయంగా చూసుకుంటాను” అని వాగ్దానం చేశాడు. అయితే.. కొందరి మనస్తత్వం, వారి ప్రవర్తన కృష్ణుని హృదయాన్ని ఇతరులకంటే త్వరగా గెలుచుకుంటాయి. కేవలం బాహ్య పూజల కంటే.. అంతర్గత శుద్ధి కలిగిన వారిని ఆయన తన దివ్య ప్రేమతో ఎలా ముంచెత్తుతాడో.. ఆ 5 రకాల వ్యక్తుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
శ్రీకృష్ణుని ప్రేమను త్వరగా పొందే 5 రకాల వ్యక్తులు:
1. నిష్కల్మషమైన మనసు కలిగిన వారు:
చిన్నపిల్లల వంటి మనసు కలిగిన వారిని కృష్ణుడు అమితంగా ప్రేమిస్తాడు. కుయుక్తులు, ఈర్ష్య, ద్వేషం లేని హృదయంలోనే కృష్ణుడు కొలువై ఉంటాడు. గోపికలు లేదా సుదాముని (కుచేలుని) చరిత్రను గమనిస్తే.. వారి వద్ద ఉన్నది కేవలం స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఎక్కడైతే కపటం ఉండదో.. అక్కడ కృష్ణుడు తన ప్రేమను కురిపిస్తాడు.
2. సంపూర్ణ శరణాగతి పొందిన వారు :
“నేను” అనే అహంకారాన్ని వదిలేసి.. సర్వస్వం భగవంతునిదే అని నమ్మే వారిని ఆయన వెంటనే ఆదుకుంటాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమె తన శక్తిని నమ్ముకున్నంత సేపు కృష్ణుడు రాలేదు. కానీ ఎప్పుడైతే రెండు చేతులెత్తి “కృష్ణా.. నువ్వే దిక్కు” అని శరణు వేడిందో.. ఆ క్షణమే ఆయన అక్షయ వస్త్రాలను ప్రసాదించాడు. తనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడు.
3. కర్మఫలాన్ని ఆశించని వారు:
“కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” ఫలితం మీద ఆశ లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వహించే వారు కృష్ణుడికి అత్యంత ప్రియమైన వారు. స్వార్థం కోసం కాకుండా.. లోక కల్యాణం కోసం లేదా కేవలం భగవంతుని ప్రీతి కోసం పనులు చేసే వారిని ఆయన త్వరగా తన ప్రేమతో ఆశీర్వదిస్తాడు. నిష్కామ కర్మ చేసే భక్తుడు కృష్ణుని దృష్టిలో జ్ఞానితో సమానం.
4. జీవకారుణ్యం కలిగిన వారు:
శ్రీకృష్ణుడు కేవలం మనుషులకే దేవుడు కాదు.. ఆయన గోపాలుడు (పశువుల కాపరి). ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూసే వ్యక్తికి కృష్ణుడు అతి దగ్గరగా ఉంటాడు. మూగజీవాల పట్ల దయ చూపడం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం వంటి పనులు చేసే వారిని కృష్ణుడు తన సొంత మనుషులుగా భావిస్తాడు. సర్వభూత హితాన్ని కోరేవాడే అసలైన భక్తుడు.
Also Read: శివాలయంలో.. మూడు సార్లు చప్పట్లు ఎందుకు కొడతారు ?
5. కష్టాల్లోనూ ధర్మాన్ని వీడని వారు:
పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం వంటి కఠినమైన కష్టాలను అనుభవించినా ధర్మాన్ని వదలలేదు. అందుకే కృష్ణుడు వారికి రథసారథిగా మారి విజయాన్ని అందించాడు. కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని దూషించకుండా.. అది తన కర్మానుసారం వచ్చిందని భావిస్తూ, భగవంతుని నామాన్ని స్మరించే వారిని ఆయన త్వరగా కష్టాల నుంచి గట్టెక్కిస్తాడు.
శ్రీకృష్ణుని ప్రేమను పొందడం అనేది చాలా సులభం. అలానే చాలా కష్టం. సులభం ఎందుకంటే.. ఆయనకు కావాల్సింది ఒక్క తులసి దళం లేదా స్వచ్ఛమైన కన్నీటి చుక్క మాత్రమే. కష్టం ఎందుకంటే.. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని చంపుకోవడం అందరికీ సాధ్యం కాదు. మన జీవితంలో మంచి గుణాలు అలవరుచుకుంటే.. ఆ మురళీకృష్ణుని దివ్య ప్రేమ మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.