Draupadi Pathivratha: ఒక్క మగాడినే పెళ్లి చేసుకుని.. ఆ ఒక్క మగాడితోనే జీవితం పంచుకునే స్త్రీలను పతివ్రతలు అంటారు. మరి ఐదుగురు పాండవులను పెళ్లి చేసుకుని.. ఆ ఐదుగురితో జీవితం పంచుకున్న ద్రౌపతిని పతివ్రత అని ఎందుకంటారో చాలా మందికి తెలియదు. అసలు ద్రౌపతిని పతివ్రత అని పురాణాలే ఎందుకు తేల్చేశాయి. ద్రౌపతి పాతివ్రత్యం వెనకున్న రహస్యం ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐదుగురు భర్తలున్నా ద్రౌపది పతివ్రత కావడానికి చాలా బలమైన కారణమే ఉంది. పూర్వ సత్స ప్రజాపతి కుమారుడైన త్రిసురుడనే రాక్షసుడిని దేవతల రాజైన ఇంద్రుడు సంహరిస్తాడు. అయితే త్రిసురుడు బ్రహ్మణుడు కావడంతో దాని కారణంగా ఇంద్రుడికి బ్రహ్మ హత్య పాతుకం చుట్టుకుంటుంది. బ్రహ్మ హత్యా దోషం వల్లన ఇంద్రుడు స్వర్గలోక ఆధిపత్యాన్ని కోల్పోతాడు. అప్పుడు ఇంద్రుడు దేవ గురువైన బృహస్పతిని కలిసి ఆ బ్రహ్మ హత్యా పాతుకం నుంచి బయట పడేందుకు మార్గం చెప్పమని ప్రాధేయపడతాడు.
అప్పుడు దేవతల గురువైన బృహస్పతి, ఇంద్రుడికి ఘోరమైన తపస్సు చేయమని చెప్తాడు. అయితే తపస్సు చేసే సమయంలో బ్రహ్మ హత్య పాతుకం చుట్టుకున్న ఇంద్రుడికి దైవ శక్తులు తోడుగా ఉండవు.. అప్పుడు దేవరాజును సంహరించడం రాక్షసులకు పెద్ద కష్టమేమీ కాదని.. కాబట్టి నీలోని పంచ ప్రాణాలను ఎవరి వద్దనైనా దాచిపెట్టి ఆ తర్వాతే తపస్సు చేసి బ్రహ్మహత్యా పాతుకం దోషాన్ని తొలగించుకోమని సూచిస్తాడు. దేవగురు బృహస్పతి సూచన మేరకు ఇంద్రుడు తన పంచ ప్రాణాలను యముడు, వాయుదేవుడు, అశ్వనీ దేవతల దగ్గర దాచి పెట్టి.. తన తపస్సు ప్రారంభిస్తాడు.
అయితే లోక కళ్యాణార్తం ఇంద్రుడి పంచ ప్రాణాలను భూలోకంలో జన్మించేలా చేయాలని యముడు, వాయుదేవుడు, అశ్వనీ దేవతలను విష్ణువు ఆజ్ఞాపిస్తాడు. అలాగే దుర్వాస మహర్షిని భూలోకంలో పాండురాజు భార్యలైన కుంతి, మాద్రిలకు సంతాన మంత్రం ఉపదేశించమని చెప్తాడు. విష్ణుదేవుడి అదేశానుసారం దుర్వాస మహర్షి కుంతి, మాద్రిలకు సంతాన మంత్రం ఉపదేశిస్తాడు. అదే సమయంలో యముడు, వాయుదేవుడు, అశ్వనీదేవతలు తమ దగ్గర ఉన్న ఇంద్రుడి పంచ ప్రాణాలు కుంతి, మాద్రిలకు పుత్రులుగా జన్మించాలని పంపిస్తారు. అలా భూమ్మీద పంచ పాండవులు పుడతారు. అలా పాండవులు అయిదుగురు కలిస్తేనే ఇంద్రుడు. ఏ ఒక్కరు తగ్గినా పరిపూర్ణ ఇంద్రుడు కాదు. తర్వాత జరిగిన మహా భారతం అందరికీ తెలిసిందే.
ఇక ఇంద్రుడు బ్రహ్మ హత్యా దోషాన్ని తొలగించుకోవడానికి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడి భార్య శచీదేవి.. రాక్షసుల బారి నుంచి తనకు రక్షణ కావాలని అగ్ని దేవుడిని వేడుకుంటుంది. దాంతో అగ్ని దేవుడు శచీ దేవికి తన ఆశ్రమంలోనే ఆశ్రయం కల్పిస్తాడు. శచీ దేవి అగ్ని దేవుడి చెంతనుండగానే.. ఇంద్రుడి పంచ ప్రాణాలు భూలోకంలో పంచ పాండువులుగా జన్మించారని తెలుసుకుంటుంది. దీంతో తాను కూడా భూలోకం వెళ్లిపోవాలని తన భర్తను చేరుకోవాలని అగ్ని దేవుడిని ప్రార్థిస్తుంది శచీదేవి. శచీదేవి కోరిక మేరకు అగ్ని దేవుడు భూలోకంలో అగ్ని గుండం నుంచి శచీదేవి జన్మించేలా చేస్తాడు. అలా అగ్నిగుండంలోంచి పుట్టుకొచ్చిన శచీదేవే.. భూమ్మీద ద్రౌపదిగా మారిపోతుంది. తర్వాత ద్రౌపదిని అర్జునుడు స్వయంవరంలో గెలుచుకుని తీసుకురావడం. తర్వాత కుంతిదేవి ఆమెను ఐదుగురు అన్నదమ్ములు సమానంగా పంచుకోమని చెప్పడం.. అంతా తెలిసిందే.
అయితే పాండవులు భౌతికంగా ఐదు మందిగా కనిపిస్తున్నా.. నిజానికి వారందరూ కలిసి ఒక్కరే.. ఆయనే ఇంద్రుడు అన్నమాట. అంటే ఆ ఒక్కరినే ద్రౌపది పెళ్లి చేసుకుని.. ధర్మానుసారం ఆ ఒక్కడితోనే సంసారిక జీవితం గడిపింది. కాబట్టి ద్రౌపదిని కూడా పతివ్రతగా కొనియాడాయి పురాణాలు.
గమనిక: పలు పురాణాలలో లభించిన సమాచారం. హిందూ పండితుల ద్వారా సేకరించిన సమాచారాన్నియధాతథంగా ఇక్కడ ఇస్తున్నాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు