Vastu Windows: ఇళ్లు అనేది అందరి కళ, ఆ ఇంటికి కిటికీ అనేది ఆ కళలోని ప్రాణం. ఇంటి లోపలికి వెలుగు, గాలి, శుభశక్తి వచ్చే మొదటి మార్గం కిటికీనే. ఈ చిన్న నిర్మాణ భాగం ఎంత చిన్నగా కనిపించినా, ఇంటి మొత్తం వాతావరణాన్ని తీర్చిదిద్దే ప్రధాన ఆధారం ఇదే. సరైన దిశలో, సరైన ఎత్తులో పెట్టిన కిటికీ ఇంటి లోపలి శాంతిని కాపాడడంలోనూ, వెలుగు ప్రసరణను పెంచడంలోనూ, గాలి సక్రమంగా తిరుగడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. శాస్త్రపరంగా చూసినా, శక్తి ప్రవాహం ఏ ఇంట్లో ఎలా తిరుగుతుందో నిర్ణయించే ప్రధాన బిందువులలో కిటికీ ఒకటి. వెలుగు తక్కువగా ఉన్న ఇళ్ళు ఎంత భారం అనిపిస్తాయో, గాలి సరిగా రాని గదులు ఎంత ఒత్తిడిని కలిగిస్తాయో అందరికీ తెలుసు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కిటికీ స్థానం, దిశ, పరిమాణం సరిగ్గా ఉండటంలోనే ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రం కిటికీని ఒక సాధారణ నిర్మాణ భాగంగా కాకుండా, ఇంటి శ్రేయస్సును రూపొందించే ముఖ్యమైన అంశంగా పరిగణిస్తుంది. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం.
కిటికీల అమరికపై వాస్తు దృష్టి
ఇంటి నిర్మాణంలో కిటికీల అమరికను వాస్తు ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తుంది.. ఉదయం సూర్యకాంతి నేరుగా ఇంట్లోకి పడటం ఎంతో శుభం అని వాస్తు చెబుతుంది. ప్రత్యేకంగా తూర్పు, ఈశాన్య దిశల్లో ఏర్పాటు చేసే కిటికీలు ఉదయపు కాంతిని ఇంట్లోకి ఆహ్వానిస్తాయి. ఆ కాంతి స్థబ్దత శక్తిని తొలగించి ఇంటిని సానుకూల వాతావరణంతో నింపుతుంది..
గాలి చలనం కోసం కిటికీల ప్రాధాన్యం
ఇంటిలో గాలి సరిగా తిరగాలంటే కిటికీలు సరైన దిశల్లో ఉండటం తప్పనిసరి. ఒక దిశ నుంచి గాలి వచ్చి మరో దిశగా బయటికి వెళ్లే మార్గం లేకపోతే ఇంట్లో ఉక్కిరిబిక్కిరి వాతావరణం ఏర్పడుతుంది. వాస్తులో దీనినే ప్రాణవాయువు ప్రవాహం అని పిలుస్తారు. అందుకే ప్రతి గదిలో కనీసం ఒక కిటికీ ఉండాలి అని వాస్తు సూచిస్తుంది.
కిటికి ఎటువైపు ఉండాలి?
పశ్చిమ, దక్షిణ దిశల్లో ఎక్కువ కిటికీలు ఉంటే ఇంటిలో వేడి అధికమవుతుంది. వేడి పెరిగితే ఇంటి వాతావరణం భారంగా మారి అసౌకర్యం పెరుగుతుంది. కానీ తూర్పు, ఈశాన్య దిశల్లో కిటికీలు ఎక్కువైతే ఇంటిలో వెలుగు, ప్రశాంతత, శాంతి పెరుగుతాయని వాస్తు చెబుతుంది. ఇదే కారణంగా పూర్వకాల ఇళ్లలో ఉదయపు కాంతి వచ్చే దిశలో పెద్ద కిటికీలు ఏర్పాటు చేసేవారు.
కిటికీ ఎదుట కనిపించే దృశ్యాల ప్రభావం
కిటికీలు ఇంటికి కేవలం గాలి వెలుగే కాదు, మంగళకర దృశ్యాలు తీసుకొస్తాయి. కిటికీ ఎదుట చెట్లు, నీరు, ఆకాశం వంటి సహజ దృశ్యాలు కనిపిస్తే ఇంట్లో శక్తి సానుకూల దిశలో ప్రవహిస్తుంది. కానీ ఎదుట చెత్త, మూసుకున్న గోడల దృశ్యం ఉంటే ప్రతికూలత పెరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
శబ్ద ప్రవాహంపై కిటికీల ప్రభావం
కిటికీలు ఇంట్లో శబ్ద ప్రవాహాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి. రద్దీ ప్రదేశం వైపు కిటికీలు పెద్దగా ఉంటే శబ్దం నేరుగా లోపలికి చేరుతుంది. సరైన దిశల్లో ఉన్న కిటికీలు మాత్రం శబ్దాన్ని తగ్గిస్తూ ఇంటికి మృదువైన వాతావరణం అందిస్తాయి.
కుటుంబ శ్రేయస్సుపై కిటికీల ప్రభావం
వాస్తు దృష్టిలో ఇంటి శాంతి, కుటుంబ సభ్యుల మనస్తత్వం, ఆరోగ్యం, భద్రత అన్నీ కిటికీలతో ముడిపడి ఉంటాయి. చీకటి ఎక్కువగా ఉన్న ఇళ్లు బద్ధకం పెంచుతాయని, వెలుగు ఎక్కువగా ఉన్న ఇళ్లు ఉత్సాహాన్ని పెంచుతాయని వాస్తు చెబుతుంది. అందుకే ప్రతి గదిలో కిటికీ ఉండటం అత్యంత కీలకమని భావిస్తారు. ఇంటికి వెలుగు, గాలి, శక్తి, శాంతి తెచ్చే ప్రధాన మార్గం. అందుకే వాస్తుశాస్త్రం ప్రతి ఇంటిలో కిటికీలను శాస్త్రీయంగా, శుభదిశల్లో ఏర్పాటు చేయాలని స్పష్టంగా సూచిస్తుంది.