భారతీయ సంప్రదాయాల్లో దేవాలయ దర్శనానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. భక్తితో దేవుణ్ని దర్శించుకుంటే మనసుకు శాంతి, ఆత్మకు సంతృప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు. దేవాలయానికి వెళ్లినప్పుడు అక్కడ వినిపించే మంత్రాలు, గంటల శబ్దం, అగరబత్తీల సువాసన, పవిత్ర వాతావరణం కలిసి మనలో సానుకూల శక్తిని నింపుతాయని నమ్మకం. అయితే దేవాలయం నుంచి తిరిగి వచ్చిన వెంటనే చాలామంది చేతులు, కాళ్లు కడుక్కోవడం సాధారణంగా చేస్తారు. కానీ సంప్రదాయ విశ్వాసాల ప్రకారం గుడి నుంచి వచ్చాక వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదు అనే ఆచారం ఉంది. దీనికి మతపరమైన, ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎందుకు కడగకూడదు?
శాస్త్రాల ప్రకారం దేవాలయంలో ఉండే పవిత్ర శక్తి భక్తుల శరీరానికి, మనసుకు చేరుతుందిన ఎంతో మంది నమ్మకం.దర్శనం పూర్తయ్యాక కూడా ఆ దివ్యశక్తి కొంతసేపు మనతోనే ఉంటుందని అంటారు. ఆ సమయంలో వెంటనే నీటితో చేతులు, కాళ్లు కడిగితే ఆ పవిత్రత నీటితో కలిసి పోతుందని భావిస్తారు. అంటే దేవుని ఆశీర్వాదం తగ్గిపోతుందనే నమ్మకం ఉంది. అందుకే పూర్వకాలంలో పెద్దలు దేవాలయం నుంచి వచ్చిన తర్వాత కొంతసేపు ప్రశాంతంగా కూర్చొని ఆ భక్తి అనుభూతిని మనసులో నిలుపుకోవాలని చెప్పేవారు. ఇది కేవలం శారీరక శుద్ధి కంటే, ఆధ్యాత్మిక శుద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సంప్రదాయం అని చెప్పవచ్చు.
ఇంటికి వచ్చాక ఇలా చేయాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా దేవాలయ దర్శనం తర్వాత మనలో ఏర్పడే సానుకూల భావాలు ఇంటి వాతావరణంలోకి కూడా వెళ్లాలని భావిస్తారు. వెంటనే చేతులు, కాళ్లు కడిగితే ఆ శుభశక్తి ఇంట్లోకి పూర్తిగా ప్రవేశించదని కొందరి నమ్మకం. అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా దేవుని నామస్మరణ చేయడం, కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండటం మంచిదని చెబుతారు. కొంతమంది పెద్దలు అయితే దేవాలయంలో తీసుకున్న తీర్థం లేదా పవిత్ర నీటిని ఇంట్లో చల్లడం ద్వారా శుభం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు. ఈ విధంగా దర్శనం ఫలితం ఇంట్లోనూ కొనసాగాలని భావిస్తారు.
అయితే ఈ ఆచారం తప్పనిసరిగా పాటించాల్సిన నియమం కాదని కూడా మతపండితులు చెబుతారు. ఇది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం కాకపోయినా, సంప్రదాయ విశ్వాసంగా తరతరాలుగా వస్తోంది. పరిశుభ్రత, ఆరోగ్యం దృష్ట్యా అవసరమైతే చేతులు, కాళ్లు కడుక్కోవడంలో తప్పు లేదని కూడా చెబుతారు. కానీ భక్తి, ఆధ్యాత్మిక భావనలకు విలువ ఇచ్చేవారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. మొత్తానికి దేవాలయం దర్శనం తర్వాత వెంటనే చేతులు, కాళ్లు కడగకూడదన్నది ఒక ఆధ్యాత్మిక నమ్మకం. ఇది మనసులో భక్తిని, శాంతిని నిలుపుకునేందుకు ఉద్దేశించిన సంప్రదాయంగా ఇప్పటికీ ప్రజల్లో కొనసాగుతోంది.