Kadapa Election 2024 Equations: కడప జిల్లాను వైఎస్ కుటుంబం పటిష్టమైన కంచుకోటగా మార్చుకుంది. వైఎస్ మరాణాంతరం వైసీపీ జిల్లాలో హవా కొనసాగిస్తుంది. గత రెండు ఎన్నికలలో కడప లోక్‌సభ స్థానంలో ఘన విజయాలు సొంతం చేసుకుంది. జగన్ బాబాయ్ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా తన పట్టు కొనసాగిస్తూ వచ్చారు. ఆయనపై ఉన్న కేసులు, ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉండటం.. హత్యకు అవినాష్ తండ్రి కుట్రదారుడన్న ఆరోపణలు.. ఈ సారి కడపలో వైసీపీకి ప్రతికూలంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కడప జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీకి ప్రాతినిధ్యమే దక్కలేదు. జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా టీడీపీకి కాస్త ఊరట లభించింది. ఆ క్రమంలో ఈ సారి ఎన్డీఏ కూటమి జిల్లాలోని వివిధ స్థానాల్లో వైసీపీకి గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు. ముఖ్యంగా మైదుకూరు, పొద్దుటూరు, కడప, కమలాపురం, జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి బలం పెంచుకుందని.. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పెరిగిన కరెంట్ చార్జీలు, ఇసుక కొరత, అభివృద్ది లేమి.. గత అయిదేళ్లలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలతో ప్రజలు విసిగిపోయారన్న టాక్ వినిపిస్తుంది.
Also Read: పల్నాడు హింసకు చంద్రబాబే కారణం: మంత్రి అంబటి
మరోవైపు వైఎస్ షర్మిల ఈ సారి కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా పోటీ చేశారు. ఇది వైఎస్ కుటుంబంలో ప్రత్యక్ష పోటీకి దారితీసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ పడటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైయస్ షర్మిల ఎన్నికల ప్రచారం మొదలు పెట్టినప్పటి నుంచి వైఎస్ వివేకా హత్య కేసునే ఫోకస్ చేశారు. వైఎస్ అవినాష్‌రెడ్డి ఆ హత్య చేయించారని.. అలాంటి వ్యక్తికి జగన్ టికెట్ ఇచ్చారని ఆరోపణలు గుప్పిస్తూ జనంలోకి వెళ్లారు. ఆమెతో పాటు వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రజల్ని న్యాయం అడుగుతూ.. షర్మిలకు మద్దతుగా ప్రచారం చేయడం.. వైసీపీకి పెద్ద మైనస్ అవుతుందన్న భయం ఆ పార్టీ శ్రేణుల్లోనే కనిపిస్తుంది.
అయితే షర్మిల కడప జిల్లా రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టివ్ రోల్ పోషించలేదు. ఆమె ప్రధానంగా హైదరాబాద్లో ఉండడం.. జిల్లా రాజకీయాలపై పట్టు లేకపోవడంతో ఆమె ప్రచారం ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. వైఎస్ కుమార్తెగా జిల్లా వాసులకు సుపరిచితురాలవ్వడం.. ప్రచారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి పేర్లను పదే పదే ప్రస్తావించడం.. అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ప్రజల మద్దతును పొందేందుకు గట్టి ప్రయత్నం చేయడం.. వివేకా హత్య సెంటిమెంట్ వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఖాయమంటున్నారు.
Also Read: SIT Report: డీజీపీకి చేరిన సిట్ ప్రాథమిక నివేదిక.. అందులో ఏముందంటే..?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించిన విజయంతో.. టీడీపీ జిల్లాలో 40 ఏళ్ల నాటి వైభవం సాధించుకోవడానికి గట్టిగానే పావులు కదిపింది. ఎన్డీఏ గట్టి పోటీ ఇచ్చిన అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ కూడా అంతోఇంతో బలమైన అభ్యర్ధులనే నిలబెట్టడం కూటమికి సానుకూలమయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా ఎన్నడూ లేని విధంగా ఈసారి కడప జిల్లాలో త్రిముఖ పోటీతో వైఎస్ కోటకు బీటలు వారే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. మొత్తమ్మీద కడప జిల్లాలో ఈ సారి మారిన రాజకీయ సమీకరణాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మరి అక్కడి ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.