Minister Ambati Rambabu on Palnadu Incident: ఏపీలోని పల్నాడులో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్లకు కారణం టీడీపీ అధినేత చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పల్నాడు నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిసిన మంత్రి పలు అంశాలను వారికి వివరించారు. అంతే కాకుండా పోలీసులు, ప్రతిపక్ష నేతల తీరుపై ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ రోజు పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలం అయిందని అన్నారు. ఎన్నికల్లో ఒడిపోతామనే భయంతో చంద్రబాబు హింసను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దాడుల వెనక చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఉన్నారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పోలింగ్, పోలీసు సిబ్బంది కొందరు డబ్బులకు అమ్ముడు పోయారని అన్నారు. తాను సత్తెనపల్లి నుంచి మూడు సార్లు పోటీ చేశానని.. ఎన్నడూ హింసాత్మక సంఘటనలు చూడలేదని తెలిపారు
పల్నాడు, తాడిపత్రిలో అధికారులను మార్చిన చోటే హింస చెలరేగిందని అన్నారు. ఈవీఎంలు పగల గొట్టాలనే ఉద్ధేశంతోనే దాడులు చేశారని తెలిపారు. పురందేశ్వరి ఎక్కడైతే ఫిర్యాదుతో అధికారులను మార్చారో అక్కడే హింస జరిగిందని అన్నారు. కూటమి నేతలు కలిసి కుట్రలు చేశారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారులను సస్పెండ్ చేశారని తెలిపారు.
Also Read: చరిత్రలోనే తొలిసారి.. ఏపీ పోలీసులపై కొనసాగుతున్న సిట్ విచారణ..
సత్తెనపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు పోలింగ్ బూత్ లను ఆక్రమించి దొంగ ఓట్లు వేశారని మండిపడ్డారు. హింసాత్మక ఘటనల్లో తప్పుడు కేసులు నమోదు చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులను కోరినట్లు వెల్లడించారు. కూటమి నేతల భయంతో కొండాపిలిలో ముస్లింలు ఇళ్లు వదిలి వెళ్లిపోయారని చెప్పారు. గ్రామాలను విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మరో సారి వైసీపీ గెలుపు ఖాయమన్నారు.