Aishwarya Rajesh.. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పేరుకే తెలుగమ్మాయి. కానీ కోలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ.. అక్కడ స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు పెట్టే కొన్ని కండిషన్లకు ఒప్పుకోకపోవడం వల్లే.. తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడం లేదనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే తెలుగు అమ్మాయిలలో ఐశ్వర్య రాజేష్ కూడా ఒకరు. దివంగత ప్రముఖ సీనియర్ హీరో రాజేష్ (Rajesh)కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఐశ్వర్య రాజేష్. తండ్రి మాత్రమే కాదు ఆమె మేనత్త కూడా ఒక నటి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆమె ఎవరో కాదు శ్రీలక్ష్మి (Srilakshmi) . శ్రీ లక్ష్మీ లేడీ కమెడియన్ గా పేరు దక్కించుకొని పలు సినిమాలతో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తండ్రి, అత్త అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఐశ్వర్య రాజేష్, తన లెగస్సీని తెలుగులో కూడా కొనసాగించాలనుకుంది. కానీ అనుకున్నంత రీతిలో ఈమెకు అవకాశాలు లభించడం లేదు.
ఒక్క సినిమాతో భారీ పాపులారిటీ..
ఇకపోతే ఐశ్వర్య రాజేష్ సొంతంగా తన కాళ్ళ మీద ఇండస్ట్రీలో నిలబడే ప్రయత్నం చేసింది.అందులో భాగంగానే కోలీవుడ్ కి వెళ్లిపోయిన ఈమె అక్కడే తన కెరీర్లు మొదలుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంది. అలా తమిళంలో హీరోయిన్ గా దాదాపు 50 చిత్రాలలో నటించింది ఐశ్వర్య రాజేష్. ఇక తెలుగులో రాజేంద్రప్రసాద్ (Rajendraprasad) లీడ్ రోల్ పోషించిన ‘కౌశల్య కృష్ణమూర్తి’అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ (Vijay deverakonda) తో కలిసి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా చేసిన ఐశ్వర్య, నాని (Nani) నటించిన ‘టక్ జగదీష్’ సినిమాలో ఆయన మరదలిగా నటించింది. అలాగే సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) కి యాక్సిడెంట్ అయినప్పుడు రిలీజ్ చేసిన ‘రిపబ్లిక్’ సినిమాలో కూడా ఈమె నటించింది. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి(Anil ravipudi), వెంకటేష్(Venkatesh) కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో నటించి హోమ్లీ క్యారెక్టర్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది.
రెమ్యూనరేషన్ పెంచేసిన ఐశ్వర్య రాజేష్..
ఈ సినిమాలో తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఐశ్వర్య రాజేష్, వెంకటేష్ తో సమానంగా కామెడీ చేసి ఆకట్టుకుంది . ఇక ఈ సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయని, అయితే ప్రతి సినిమాకి సంతకం చేయకుండా.. ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం అందులో భాగంగానే కథలో బలం ఉండాలి, అదే విధంగా తన నటనకు ప్రాధాన్యత ఉండాలని ,అప్పుడే ఒక సినిమాకు సంతకం చేస్తానని కూడా చెబుతున్నట్లు సమాచారం. అంతేకాదు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇచ్చిన విజయంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కోటి రూపాయలు తీసుకున్న ఈమె ,ఈ సినిమా తర్వాత రూ.3 నుండి రూ.4 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఏది ఏమైనా ఒక్క సినిమా విజయం తర్వాత ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ పెంచడంతో నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. అందులో భాగంగానే తెలుగులో అవకాశాలు తగ్గిపోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.