Ashu Reddy : డ్రగ్స్ కేసు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. ఈ కేసులో పేర్లు వినిపిస్తున్న నటులు ఒక్కొక్కరు బయటకు వచ్చిన తమ వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా నటి అషురెడ్డి మరోసారి స్పందించింది. డ్రగ్స్ కేసులో తన పేరు బయటకి రావడంపై మండిపడింది. ఈ కేసులో అరెస్టైన నిర్మాత కేపీ చౌదరి వ్యవహారాలతో తనకు సంబంధంలేదని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను అషురెడ్డి పోస్టు చేసింది.
కొన్ని మీడియా ఛానళ్లు తనను కించపరిచే విధంగా వార్తలు ఇచ్చాయని అషురెడ్డి ఆరోపించింది. తన పేరు, ఫోన్ నంబర్ బయట ప్రపంచానికి తెలిపాయని మండిపడింది. ఈ వార్తలతో తాను మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. మొబైల్ నంబర్ బయటపెట్టడం వల్ల తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని వివరించింది. ఈ నేపథ్యంలో తాను ఆ నంబర్‌ను వాడలేకపోతున్నాని తెలిపింది.
తనను కించపరిచేవిధంగా వార్తలు ప్రచారం చేసిన మీడియా ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తానని అషురెడ్డి హెచ్చరించింది. కేపీ చౌదరితో గంటల తరబడి ఫోన్ మాట్లాడానని చెబుతున్నారని కానీ అతడితో ఉన్న పరిచయం, ఫోన్ కాల్స్‌పై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ డ్రగ్స్ వ్యవహారం నడిచిన సమయంలో తాను వేరే దేశంలో ఉన్నానని చెప్పింది. తనకు సంబంధం లేకపోయినా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన చెందింది. అందుకే ఈ వీడియోను విడుదల చేస్తున్నానని అషురెడ్డి పేర్కొంది.