
Vishal Political Party(Cinema news in telugu): సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. సీఎంలుగా రాష్ట్రాలను ఏలిన వారు ఉన్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత.. కమల్ హాసన్, విజయ్ కాంత్ ఇలా ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఉన్నారు. ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడు సినీ నటులు.. నటనకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. ఇటీవలే తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి కూడా రాజకీయ పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు విశాల్ కూడా విజయ్ నే ఫాలో అవుతున్నాడు. పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్న విశాల్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.
తమిళులు.. ఒక వ్యక్తిని అభిమానిస్తే.. అది జీవితాంతం ఉంటుంది. అభిమాన వ్యక్తిని అక్కున చేర్చుకుంటారు. సొంతంగా పొలిటికల్ పార్టీ పెట్టి.. ఎంజీఆర్ తమిళనాడుకు సీఎం అయ్యారు. ఆ తర్వాత జయలలిత అన్నాడీఎంకేలో చేరి.. తమిళులకు అమ్మ అయ్యారు. డీఎండీకే పార్టీ స్థాపించిన నటుడు విజయ్ కాంత్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా.. బలమైన ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించారు.
ఇక తాజాగా.. పొలిటికల్ పార్టీ పేరును ప్రకటించిన విజయ్.. పార్టీ ఏర్పాట్ల పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన టార్గెట్ లోక్ సభ ఎన్నికలు కాదని తేల్చేసిన ఆయన.. టార్గెట్ 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు విశాల్ కూడా పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్దమవ్వడంతో.. తమిళనాట రాజకీయం రంజుగా మారనుంది. తమకు తిరుగులేదనుకున్న నేతలకు గట్టిపోటీనే రాబోతోంది.
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన నడిగర్ సంఘం, నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయం సాధించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్. ఈ విషయమై వివాదాలు వచ్చినా.. ఒక వర్గం విశాల్ కు సపోర్ట్ గా నిలిచింది. జయలలిత మరణించిన తర్వాత ఉపఎన్నికల్లో.. ఆమె సిట్టింగ్ స్థానమైన ఆర్కే నగర్ నుంచి నామినేషన్ వేయగా అది తిరస్కరణకు గురైంది. విశాల్ నామినేషన్ ను కావాలనే చెల్లుబాటు కాకుండా చేశారని చర్చ కూడా జరిగింది. ఇవన్నీ విశాల్ కు రాజకీయ సింపతీని తెచ్చిపెట్టాయి.
విజయ్ మాదిరిగానే.. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని స్థాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేయకపోయినా ఏదొక పార్టీకి మద్దతు ఇచ్చి.. తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. గతంలో విజయ్ కూడా ఇదే చేశాడు. 2011 ఎన్నికల్లో జయలలిత కూటమికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు పార్టీ ప్రకటించారు. విశ్లేషకులు కూడా విశాల్.. విజయ్ ఫార్ములా ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరు రీల్ హీరోలు.. రాజకీయాల్లో ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి.