Karate Kalyani: మరోసారి నటి హేమ (Hema) వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కొన్ని యూట్యూబ్ చానల్స్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రిలకు కూడా హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపించారు. గతంలో తన పరువు పతిష్ట కు భంగం కలిగేలా వీరు కామెంట్స్ చేశారంటూ చట్టపరమైన చర్యలకు సిద్దమైంది హేమ. బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అరెస్ట్ అయిన హేమ, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే.. వైద్య పరీక్షల్లో హేమకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో తనపై విమర్శలు చేసిన వారికి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు హేమ. ఈ క్రమంలో కరాటే కళ్యాణికి కూడా నోటీసులు పంపించారు. తాజాగా దీని పై కరాటే కళ్యాణి స్పందించారు. హేమకు భయపడేది లేదు, తగ్గేదేలే అని ఒక వీడియో రిలీజ్ చేశారు.
మీడియా అటన్షన్ కోసమే ఇలా..
‘పొద్దున్నుంచి నాకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు కాల్స్ చేస్తున్నారు. హేమా మీకు నోటీసులు పంపించిందంట కదా? అని అడుగుతున్నారు. యస్ నిజమే.. నేను హేమ నోటీసులు రిసీవ్ చేసుకున్నాను. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నేను ఎక్కడ ఉన్నాను? ఏమిటి అన్న విషయాలపై అన్నీ క్లియర్ నిజాలే చెబుతాను. నేను ఇప్పుడు మా ఊరిలో ఉన్నాను. విజయనగరంలో ఉన్నాను. కాబట్టి నేను మీ అందరి రెస్పాండ్ అవలేకపోతున్నాను. నేను నోటీసులు తీసుకొని నా పనుల మీద ఇక్కడకి నేను వచ్చేశాను. ఇక నేను కూడా లీగల్ ఫైట్‌కి సిద్ధంగా ఉన్నాను. ఆవిడకు నేను రిప్లై ఇస్తాను. అలాగే.. ఆవిడకు కూడా నా నుంచి నోటీసులు అందుతాయి.నేను మీడియాలో ప్రచారమైన వాటిపైనే మాట్లాడాను. అంతకుమించి ఆమె మీద వ్యక్తిగతంగా కక్ష ఏమీ లేదు. అలా ఉంటే.. పర్సనల్‌గా ఆమెపై కోపం ఉంటే మా అసోసియేషన్‌పై ఆమెపై వేసిన సస్పెన్షన్‌ను తీసేయాలని ఓటు వేయను కదా? సస్పెన్షన్‌ను ఎత్తేయాలని నేను కూడా ఓటు వేశాను. కానీ ఆవిడ ఎందుకో ఇన్ని నెలల తర్వాత మీడియాలో అటెన్షన్ తగ్గిందని అనుకుందో ఏమో! తన పేరు మీడియాలో మళ్లీ వినిపించాలని నన్ను వాడుకుని నోటీసులు పంపినట్లుంది. నా మీద రూ.5 కోట్లకు దావా వేస్తున్నట్లుగా ఏదో పంపించారు. నేను కూడా లీగల్ ఫైట్‌కి వెళ్తాను. ఎక్కడా తగ్గేదే లేదు. మీడియా అందరి మీద వేసిన తర్వాత నా మీద కేసు వేయాలి. ఇక్కడ ఎవరికి ఎవరు భయపడరు. నేను భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా నేను కూడా లీగల్ ఫైట్ చేస్తాను..’ అని అన్నారు. మొత్తంగా.. హేమ ఈ నోటీసుల ద్వారా మీడియా అటెన్షన్ కోసం ప్రయత్నిస్తోందని కారాటే కళ్యాణి ఆరోపించారు.