4 people killed, 30 injured in US’s Georgia school shooting: Report: అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. పాఠశాలలో జరిగిన కాల్పులు కలకలం రేపాయి. జార్జియా రాజధాని అట్లాంటాకు సమీపంలో ఉన్న బారోకౌంటీలోని అపాలచీ హైస్కూల్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఉదయం పదిన్నరకు పాఠశాల క్లాసులు జరుగుతున్న సమయంలో ఆ ఆగంతకుడు హఠాత్తుగా తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరపగా అక్కడికక్కడే నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మిగిలిన విద్యార్థులు భయంతో బయటకు పరుగులు పెట్టారు. గుర్తు తెలియని ఉన్మాది ఎందుకు అలా కాల్పులు జరిపారో తెలియడం లేదని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. అయితే సకాలంలో పోలీసులు రావడం..నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుడిని తమ అదుపులోకి తీసుకున్నట్లు బారూ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది.
ఎవరూ రావొద్దు..
ప్రస్తుతం పాఠశాల పరిసరాలను పూర్తిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త గా ఎవరినీ ఆ ప్రదేశానికి రావద్దని సూచిస్తున్నారు. తల్లిదండ్రులతో సహా ఎవరీని పాఠశాలలోకి అనుమతించడం లేదు. ఈ సందర్భంగా బారూ కౌంటీ షెరీఫ్ జెడ్ స్మిత్ మాట్లాడారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. నిందితుడు ఎక్కడ నుంచి వచ్చాడు..ఎవరిని టార్గెట్ చేయదలుచుకున్నాడు వివరాలు ఇంకా తెలియలేదని..అతనిని ఇంటరాగేట్ చేస్తున్నామని..భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ సంఘటన చాలా విషాధకరమని..తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. మృతుల కుటుంబాలకు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని మృతులకు సంబంధించిన కుటుంబీకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.