రష్యాతో చమురు ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాల్లో భారత్ ఒకటి మాత్రమే. మిగతా దేశాలపై లేని ఆంక్షలు భారత్ పైనే విధించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. టారిఫ్ ల విషయంలో భారత్ పై మాత్రమే కక్ష తీర్చుకున్నారు. మిగతా దేశాలను వదిలిపెట్టి భారత్ పై మాత్రం టారిఫ్ ని 50శాతానికి పెంచారు. ఇంత వివక్ష ఏంటో ఆయనకే తెలియాలి. రష్యానుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా నెంబర్ 1 స్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది. కానీ సుంకాల విషయంలో భారత్ ని టాప్ ప్లేస్ లో ఉంచి తమాషా చూస్తున్నారు ట్రంప్. అదే సమయంలో చైనాపై సుంకాల భారాన్ని పెంచకుండా డ్రామా ప్లే చేస్తున్నారు.
చైనా సంగతేంటి..?
రష్యాతో చర్చలు విఫలం అయితే భారత్ పై సుంకాలను మరింతగా పెంచుతామంటూ అమెరికా ఇటీవల హెచ్చరించింది. ఆ చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అంటున్నారు కానీ, యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపడానికి రష్యా అంగీకారం తెలపకపోవడం విశేషం. బంతిని తెలివిగా ఉక్రెయిన్ కోర్టులోకి నెట్టేసింది రష్యా. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో ట్రంప్ సమావేశం మిగిలుంది. యుద్ధం ఆగిపోలేదు కదా, ఇప్పటికైనా చైనాపై సుంకాలు పెంచుతారా అనే ప్రశ్నకు మాత్రం ట్రంప్ నేరుగా సమాధానం ఇవ్వలేదు. చైనాపై అప్పుడే శిక్ష విధించబోమని మాత్రం ఆయన స్పష్టం చేసారు. రెండు మూడు వారాల్లో ఆ పని మొదలు పెట్టే అవకాశముందని అన్నార ట్రంప్.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోతే రష్యాపై ఆంక్షలు విధించడంతోపాటు, ఆ దేశం చమురు కొనుగోలు చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ బెదిరిస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆంక్షలు విధించే అవకాశం లేదనే చెప్పాలి. ఓవైపు చర్చలు జరుగుతుండగా, మరోవైపు ట్రంప్ మాత్రం హెచ్చరికలతో ప్రపంచ దేశాలను భయపెడుతున్నారు. ట్రంప్ చర్యల వల్ల భారత్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ అవకాశాలను వెదుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎప్పటికీ అమెరికాని నమ్మదగిన వ్యాపార భాగస్వామిగా మనం పరిగణించలేమని తేలిపోయింది. ఆ దిశగా భారత్ ఇప్పటికే అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవైపు అమెరికా సుంకాల పెంపుని తప్పుబడుతూనే, మరోవైపు ఆ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు ఓ మార్గాన్ని చూపించే అవకాశం కూడా లేకపోలేదు.
చైనాకు తిప్పలు తప్పవా..?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి శుభం కార్డు పడకపోయినా, రష్యా విషయంలో అమెరికా మరింత కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా చివరకు చైనాకి ఇబ్బందులు తప్పకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఇప్పటికిప్పుడు చైనాపై ట్రంప్ టారిఫ్ ని పెంచకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోతే ప్రపంచంలోనే చైనా పెద్ద బాధితురాలిగా మిగిలిపోతుంది. భారత్ పై ఆల్రడీ 50శాతం సుంకాల భారం వేశారు కాబట్టి, ఇకపై పెంచడానికి ఏమీ మిగల్లేదనే వాదన వినపడుతోంది. అదే జరిగితే అమెరికా విషయంలో ఇతర దేశాలు ప్రత్యామ్నాయాలను వెదుక్కోవడం మంచిది అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ లాంటి తలతిక్క దేశాధినేతలతో ఎప్పటికైనా ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.