అమెరికా-రష్యా. ఈ రెండు దేశాలు బద్ధ విరోధులని ప్రపంచమంతా తెలుసు. రష్యా అంటేనే కాదు, రష్యాతో వ్యాపారం చేసే దేశాలంటే కూడా అమెరికాకు విపరీతమైన ద్వేషం. ఆ ద్వేషంతోనే రష్యానుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై సుంకాల వేటు వేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అలాంటిది అమెరికా-రష్యా మధ్య చర్చలంటే ఇక చెప్పేదేముంది. చర్చలు జరగకముందే అవి ఫెయిలవుతాయని జోస్యం చెప్పారు ప్రపంచ మేథావులు. కానీ వారి అంచనా తప్పింది. ఈ చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని ట్రంప్, పుతిన్ చెప్పడం విశేషం. శాంతికి ఇది తొలి అడుగుగా వారు చెబుతున్నారు.
ఆయనే ఉండి ఉంటే..
చర్చల తర్వాత ట్రంప్ ని ఆకాశానికెత్తేశారు పుతిన్. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు తలెత్తిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో ఉండి ఉంటే, అసలు యుద్ధమే వచ్చి ఉండేది కాదన్నారు. గతంలో ట్రంప్ కూడా ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించేవారు. ఆయన మాటల్ని పుతిన్ సమర్థించడం విశేషం. అప్పట్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే యుద్ధం వచ్చి ఉండేది కాదన్నారు. ఇప్పటికైనా శాంతి స్థాపనకు ఆయన ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు, ఆయన చొరవను మెచ్చుకున్నారు పుతిన్.
చర్చలు ఎలా జరిగాయంటే?
చర్చలు నిర్మాణాత్మకంగా జరిగాయని, కొన్ని అంశాలపై అవగాహనకు కూడా వచ్చామన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇరుదేశాల భాగస్వామ్య చరిత్రకు అలస్కా వేదిక నిదర్శనమన్నారాయన. రష్యా, అమెరికా సంబంధాలు చాలా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయని చెప్పారు పుతిన్. అలాంటి పరిస్థితులను సరిదిద్దుకునేందుకు నేరుగా చర్చలు జరపడం ఎంతో మంచి పరిణామం అన్నారు. ఉక్రెయిన్‌కు భద్రత కల్పించాలని అంటున్న ట్రంప్ వాదనను తాను సమర్థిస్తున్నానని అన్నారు పుతిన్. తర్వాతి భేటీ మాస్కోలో ఉంటుందని తెలుస్తోంది.
ఫలితం ఏంటి?
చర్చలు పాజిటివ్ గానే జరిగాయి, చర్చల తర్వాత ఎలాంటి నెగెటివ్ కామెంట్ వినపడలేదు. ముఖ్యంగా ఈ చర్చలు విఫలమైతే భారత్ పై మరో టారిఫ్ బాంబు వేస్తానన్న అమెరికా హెచ్చరిక అమలులోకి వచ్చే అవకాశం లేదు. అయితే చర్చల ఫలితం ఏంటనేది ఆసక్తికరం. ఈ చర్చలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సడన్ గా ఆగిపోయే అవకాశాలు లేవు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో మరో దఫా చర్చలు జరగాల్సి ఉందని అంటున్నారు. ఆ చర్చల తర్వాతే ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఆ చర్చల్లో పుతిన్, జెలెన్ స్కీ తో పాటు.. తాను కూడా పాల్గొంటానని అన్నారు ట్రంప్.
శత్రువులు కాదు..
ఇన్నాళ్లూ అమెరికా, రష్యా బద్ధ శత్రువులు అని అనుకుంటున్న వారికి ఈ చర్చల తర్వాత ఆ విషయంలో క్లారిటీ వచ్చింది. ట్రంప్ రాకతో అలాంటి పరిణామాలు మారిపోయాయని అంటున్నారు. టారిఫ్ వార్ కి తెరతీసిన ట్రంప్, ఎందుకో రష్యా విషయంలో సానుకూలంగా కనపడుతున్నారు. అటు పుతున్ కూడా ట్రంప్ ని పొగిడేందుకు మొహమాటపడటం లేదు. వ్యంగ్యంగా అన్నారో, లేక నిజంగానే పొగిడారో తెలియదు కానీ, అప్పట్లో ట్రంప్ అమెరికాకు అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్ తో యుద్ధం జరిగేది కాదని ఓ కీలక స్టేట్ మెంట్ ఇచ్చారు.